మోడీ, షాలు ఇక బలవంతులు కాదు.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్ 

ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య నిన్న తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ జాతీయ నేతలు ఇకనైనా మేలుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్విటర్‌లో వరుసగా పోస్టులు పెట్టారు. నిన్న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ పరేడ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న ‘‘బలవంతులు’’ అనే ముద్రకు నష్టం వాటిల్లిందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. "ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన కారణంగా ప్రధానంగా ఇద్దరు భాగస్వాముల గౌరవం దెబ్బతిన్నది. ఒకటి, పంజాబ్ కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు, వారి మధ్యవర్తులు కాగా... రెండోది, మోదీ- షా ‘‘బలవంతులు’’ అనే ముద్ర. అయితే ఈ ఘటనతో భయపడింది ఎవరు అంటే.. నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్తానీలు. దయచేసి ఇకనైనా బీజేపీ మేలుకోవాలి..’’ అని స్వామి ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.

 

అంతేకాకుండా ఢిల్లీలో శాంతి భద్రతల "వైఫల్యం" పైనా స్వామి విమర్శలు సంధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే కేంద్రాన్ని అనేక మార్లు కోరానని ఆయన గుర్తుచేశారు. "భారత్‌ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చు. హిందువులను ముట్టడి వేశారు జాగ్రత్త.. ఇకనైనా మేలుకొండి.." అని ఆయన హెచ్చరించారు. రైతుల ఆందోళన కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... ట్రాక్టర్ పరేడ్ పేరుతో తాజాగా ఢిల్లీ నగర వీధుల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.