వైసీపీ ఎమ్మెల్యేలలో పెరిగిపోతున్న అసంతృప్తి.. ఆనం ఆగమాగం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తమని ఎవరూ పట్టించుకోవట్లేదని, తమకి గౌరవం ఇవ్వట్లేదని ఎమ్మెల్యేలు తెగ ఫీలైపోతున్నారు. మొన్న ఎమ్మెల్యే రోజా.. నిన్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి. అందరిదీ ఒకటే బాధ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలమైన మమ్మల్ని అధికారులు పట్టించుకోవట్లేదని హర్ట్ అయిపోతున్నారు.

 

నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి అవమానం జరిగింది. జిల్లాలో జరిగిన గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించలేదంటూ.. జిల్లా అధికారులపై ఆనం రాంనారాయణరెడ్డికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి, అధికార పార్టీకి చెందిన నేత అయిన తనకు కూడా గణతంత్ర వేడుకలకు ఆహ్వానం రాకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? అధికారుల నిర్లక్ష్యమా? లేక అహంకారమా?. దీన్ని వదిలి పెట్టను. దీనిపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా అంటూ ఆనం హెచ్చరించారు.

 

ఆనం రాంనారాయణరెడ్డి గతంలో కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని, జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్ప.. మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శలు చేశారు. మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్‌ లు ఇస్తే.. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని ఆనం అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన అనుభవమున్న ఆనం పరిస్థితే ఇలా ఉంటే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితితి ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది అన్నట్టుగా.. అధికార పార్టీలో ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉండటంతో వారికి దక్కాల్సిన ప్రాధాన్యత తగ్గిపోతుంది. దీంతో ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసహనం పెరిగిపోయి.. ఆవేదన, ఆగ్రహంగా మారుతుంది. ఎక్కువమంది ఉండటంతో అధికారులకు ఎవర్ని ఆహ్వానించాలో ఎవర్ని అహ్వాహించకూడదో అర్థంకావట్లేదు. దీంతో ఎమ్మెల్యేలు హర్ట్ అవుతున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎమ్మెల్యే పదవి అలంకారం అయిందని ఫీలవుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలలో రోజురోజుకి అసంతృప్తి పెరిగిపోతే భవిష్యత్ లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.