ఏపీ టీడీపీకి మరో ఇద్దరు నేతల షాక్ ?

ఏపీలో క్షణ క్షణం రాజకీయం మారుతోంది. ఏపీలో టీడీపీ ఘోర ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ నేతలు దిక్కులు చూస్తున్నారు. పదవుల్లో ఉన్న వారు లేని వారు కూడా సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తున్నారు. అయితే వైసీపీ వైపు ఆ చూపులు లేకున్నా ఏపీ మీదే ప్రత్యేక ద్రుష్టి పెట్టిన బీజేపీ వలలో ఇట్టే పడిపోతున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అధికార ప్రతినిధి లంకా దినకర్ పార్టీ మారేందుకు రెడీ అయినట్టు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో వీరు అక్కడి బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని, పార్టీ మార్పు మీద చర్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరికల కోసమే ఏర్పాటు చేయబడ్డ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ నేత రాం మాధవ్‌తో ఈ ఇద్దరు టీడీపీ నేతలు మంతనాలు జరిపినట్టు తెలిసింది. అనగాని సత్యప్రసాద్ 2014, 2019లో రెండు సార్లు వరుసగా రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లూ ఆయన మోపిదేవి వెంకటరమణ మీద విజయం సాధించారు. అయితే తాజాగా ఈయన మీద ఓడిన మోపిదేవిని ప్రస్తుతం జగన్ తన కేబినెట్‌లో మంత్రిగా చేర్చుకున్నారు. ఇక మరో పక్క వ్రుత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన లంకా దినకర్ ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఒకరకంగా మీడియాలో ఆయన జగన్ ని, బీజేపీని తూర్పారబట్టే వారు. అయితే మరి పార్టీ పదవి తప్ప ఇంకేమీ లేని ఈయన ఎందుకు ఆ పార్టీలో చేరుతున్నారు అనే దాని మీద క్లారిటీ లేదు.