తిరుపతి ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఎవరంటే!
posted on Apr 29, 2021 6:30PM
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు? వైసీపీకి 5 లక్షల మెజార్టీ వస్తుందా? టీడీపీని గెలుపు వరిస్తుందా? బీజేపీ-జనసేనను ఓటర్లు ఆదరిస్తారా? ఇలా, తిరుపతి ఎన్నికల ఫలితాలపై ఎక్కడలేని ఉత్కంఠ. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో పేరెన్నిక గల సంస్థ.. "ఆరా".. తిరుపతి పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో ఆసక్తికర రిజల్ట్స్.. గెలుపు, ఓట్ల శాతం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. అందుకే, ఆరా పోస్ట్ పోల్ సర్వేపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తిరుపతి బైపోల్‌ను మొదటి నుంచీ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తిని బరిలో నిలిపింది. టీడీపీ.. సీనియర్ లీడర్, మాజీ ఎంపీ పనబాక లక్ష్మిని పోటీలో దించింది. ఇక అనూహ్యంగా జనసేనను ఒప్పించి తిరుపతి సీటును బీజేపీ దక్కించుకొని.. రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను రంగంలో నిలిపి అదృష్టం పరీక్షించుకుంది. మూడు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. తిరుపతి ఎన్నికను ఊదరగొట్టాయి. ఫలితాలూ అలానే అదరగొడతాయని ఆరా సర్వే తేల్చింది.
అధికార పార్టీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. పలువురు మంత్రులు ప్రచారానికి తిరుపతి తరలివచ్చారు. బీజేపీ తరఫునా హేమాహేమీలు ప్రచారం నిర్వహించారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తిరుపతిలో పర్యటించి బీజేపీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, టీడీపీ ప్రచారం ఓ రేంజ్‌లో సాగింది. మొదట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎంట్రీ ఇచ్చి కేడర్‌లో జోష్ తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంతో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. చంద్రబాబు, లోకేశ్ నిర్వహించిన ప్రతీ రోడ్‌షోలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, పాదయాత్రలకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. తిరుపతిలో టీడీపీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. మరి, ఆ ప్రచార ప్రభంజనం.. ఫలితాల్లో కనిపిస్తోందా? తిరుపతి తెలుగుదేశం వశం అవుతుందా? "ఆరా" సర్వే ఏం చెబుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక, తిరుపతి పోలింగ్ హైటెన్షన్ క్రియేట్ చేసింది. దొంగ ఓట్ల గొడవతో పోలింగ్ నాడు రచ్చ రచ్చ జరిగింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు.. పక్క నియోజక వర్గాల నుంచి మనుషులను రప్పించి దొంగ ఓట్లకు తెగబడ్డారు. వందలాది బస్సులు, వాహనాల్లో తిరుపతి నిండా దొంగ ఓటర్లను దింపేశారు. ఆలస్యంగా గుర్తించిన ప్రతిపక్షాలు.. దొంగ ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అధికార పార్టీకే వత్తాసు పలికారు. తిరుపతిలో ప్రజాస్వామ్యం అబాసుపాలు అయిందంటూ విపక్షం మండిపడింది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. కోర్టును సైతం ఆశ్రయించారు. ఇన్ని వివాదాల మధ్య తిరుపతి ఎన్నిక ముగిసింది. మరి, ఈవీఎంలో భద్రంగా ఉన్న ఫలితం ఎలా ఉండబోతోంది? తిరుపతిలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయి? అంటూ ఓటింగ్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
"ఆరా".. ఎన్నికల సర్వేలు చేయడంలో ఖ్యాతి గాంచిన సంస్థ. గతంలో "ఆరా" చేసిన అనేక ఎగ్జిట్ పోల్స్ పక్కాగా ఫలితాలనిచ్చాయి. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లోనూ "ఆరా" సర్వే నిజమవుతుందా? ఇంతకీ "ఆరా" సర్వేలో ఏం తేలింది? అనేది ఆసక్తికరం.

అధికార పార్టీ చెబుతున్నట్టుగానే.. వైసీపీకి అత్యధిక శాతం సీట్లు వస్తాయని "ఆరా" పోస్ట్ పోల్ సర్వేలో తేలింది. వైఎస్సార్ కాంగ్రెస్.. ఏకంగా 65.85 శాతం ఓట్లను గంప గుత్తగా కొల్లగొట్టబోతోంది. వైసీపీ నేతలు ధీమాగా ఉన్నట్టే.. ఆ పార్టీకి లక్షల్లో మెజార్టీ వస్తుందంటూ ఆరా సర్వేలో తేలింది. దొంగ ఓట్ల ప్రభావమో.. లేక, అధికార పార్టీపై అభిమానమో.. కారణం ఏదైనా.. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయమనేది.. "ఆరా" రిపోర్ట్.
ఇక ప్రచారంతో ఊదరగొట్టి.. ఉర్రూతలు ఊగించిన టీడీపీ.. 23.10 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితం కానుందని "ఆరా" సర్వే చెబుతోంది. తిరుపతిలో తడాఖా చూపిస్తామంటూ సవాల్ చేసిన బీజేపీ-జనసేన కూటమికి ప్రజల ఆదరణ అంతంతమాత్రమేనని తేలిపోయింది. "ఆరా" సర్వేలో బీజేపీ అభ్యర్థికి కేవలం 7.34 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేలింది. ఇక ఇతరులకు 3.71 శాతం ఓట్లు పోలైనట్టు "ఆరా" పోస్ట్ పోల్ సర్వే చెబుతోంది.