వైసీపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి..! మండలి రద్దు ఓటింగ్ కి 18మంది డుమ్మా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేలు ఊహించని షాకిచ్చారు. ఏకంగా శాసనసభలోనే జగన్ మాటను ధిక్కరించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు టీడీపీ అడ్డంకులు సృష్టించిందనే కోపంతో మండలి రద్దుకు నిర్ణయం తీసుకుని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఝలక్ ఇఛ్చారు. మరి, మండలిని రద్దు చేయడం వాళ్లకు ఇష్టంలేదో ఏమో తెలియదు గానీ, కౌన్సిల్ రద్దుపై శాసనసభలో ఓటింగ్ జరిగినప్పుడు 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు డమ్మాకొట్టారు. మండలి రద్దు తీర్మానంపై సుదీర్ఘ చర్చ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఈ ఓటింగ్ నుంచి 18మంది ఎమ్మెల్యేలు తప్పుకున్నారు. అంతేకాదు ఓటింగ్ సందర్భంగా సభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పైనా గందరగోళం కనిపించింది. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 121మంది ఎమ్మెల్యేలు ఓటేశారని తెలిపిన అసెంబ్లీ సిబ్బంది... ఆ తర్వాత సంఖ్యను 133 అంటూ ప్రకటించారు. ఇక, మండలి రద్దు తీర్మానానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ అనుకూలంగా ఓటేయగా... వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ... అలాగే మద్దాల గిరిలు ... ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అయితే, 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉండటమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు వీళ్లెందుకు మండలి రద్దు తీర్మానం ఓటింగ్ కు దూరంగా ఉన్నారనేది రాజకీయ వర్గాల్లోనే కాదు.... వైసీపీలోనూ కలకలం రేపుతోంది.

అయితే, వీళ్లంతా పొరపాటున ఓటింగ్ కి గైర్హాజరయ్యారా? లేక కావాలనే దూరంగా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. ఇక, ఓటింగ్ కు కొద్ది సమయం ముందు విప్ చెవిరెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. చెవిరెడ్డితోపాటు విప్ గా ఉన్న దాడిశెట్టి రాజా కూడా ఓటింగ్ సమయంలో లేకపోవడంపై వైసీపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే, వైసీపీ ఫ్లోర్ మేనేజ్ మెంట్ పై సీఎం జగన్ ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో ఏకంగా 18మంది ఎమ్మెల్యేలు లేకపోవడంపై మండిపడ్డారు. అయితే, ఓటింగ్ కి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలపై జగన్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 18మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్న తర్వాత నెక్ట్స్ స్టెప్ ఉంటుందని అంటున్నారు. మరి, వీళ్లంతా మండలి రద్దు ఇష్టంలేక ఓటింగ్ కి దూరంగా ఉన్నారా? లేక ఓటింగ్ పై సమాచారం లేక సభ నుంచి బయటికి వెళ్లారా? అనేది తేలాల్సి ఉంది. అయితే, వైఎస్ తీసుకొచ్చిన మండలిని రద్దు చేయడం ఇష్టంలేకే ఓటింగ్ కి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి, ఏది నిజమో వాళ్లే చెప్పాల్సి ఉంటుంది.