ఆత్మహత్యలకు దారితీస్తున్న సీరియల్

 

ఇప్పటి సినిమాలు చూసి కుర్రవాళ్లు చెడిపోతున్నారని అంటారు పెద్దలు. ఇప్పటి సీరియల్స్ ఇంట్లో విషాన్ని నింపేస్తున్నాయి అంటున్నారు పిల్లలు. మనకి రోజూ కనిపించేదే తీస్తున్నాం కదా! అని తప్పుకుంటున్నారు నిర్మాతలు. ఇంతకీ మీడియా ప్రభావం మన మీద ఉందా? అనే ప్రశ్నకి దిమ్మతిరిగిపోయే జవాబు ఒకటి వినిపిస్తోంది. అదే 13 Reasons Why. ఒక టీనేజీ అమ్మాయి తన స్కూళ్లో అనుకోని సమస్యలని ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యే సరైన మార్గం అని అనుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటుంది కూడా! కానీ చనిపోబోయే ముందు ఓ 13 వీడియో క్యాసెట్ల ద్వారా తన బాధనంతా వెళ్లగక్కుతుంది. తన మనసుని నొప్పించి తన చావుకి కారణమైనవారికి ఆ 13 క్యాసెట్లనీ పంపుతుంది. ఇదీ క్లుప్తంగా ’13 Reasons Why’ అనే నవలలోని కథ. ఇప్పుడు అదే నవలను Netflix అనే సంస్థ ఒక సీరియల్గా రూపొందించింది. ఈ ఏడాది మార్చిలో సీరియల్ మొదలవగానే విపరీతమైన జనాదరణ లభించింది. సీరియల్ అద్భుతంగా ఉందనీ, కుర్రకారు ప్రవర్తనకు దగ్గరగా ఉందనీ జనం విరగబడి చూడటం మొదలుపెట్టారు. కానీ ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ అది కుర్రకారు మీద ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆరోపణలు మొదలయ్యాయి.

 

నిజంగానే 13 Reasons Whyతో ఆత్మహత్యలు పెరిగి ఉంటాయా? అన్న అనుమానం వచ్చింది పరిశోధకులకి. దాంతో ఇంటర్నెట్లో ఆత్మహత్యల గురించి వెతికేవారి సంఖ్య పెరిగిందో లేదో గమనించాలనుకున్నారు. ఆశ్చర్యంగా ఈ సీరియల్ మొదలైన దగ్గర్నుంచీ ఆత్మహత్యల గురించి సమాచారం కోరుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. ఇలా కాస్తో కూస్తో కాదు, దాదాపు 20 శాతం ఎక్కువ మంది ఆత్మహత్యల గురించి విచారించడం మొదలుపెట్టారట. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? మనల్ని మనం చంపుకోవడం ఎలా? లాంటి ప్రశ్నలు ఇంటర్నెట్లో ఎక్కువయిపోయాయి.

 

ఆత్మహత్య గురించి సెర్చ్ చేసినవారంతా ఆత్మహత్యకు పాల్పడరు కదా! అన్న వాదన రావచ్చు. కానీ వారిలో అలాంటి ఆలోచన ఒకటి మొదలయినట్లేగా! పైగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, అప్పటికే మానసికమైన సమస్యలు ఉన్నవారు.... ఇలాంటి సీరియల్స్ చూస్తే, ఆత్మహత్య చేసుకుంటే దరిద్రం వదలిపోతుంది అన్న నిర్ణయానికి వచ్చేసే ప్రమాదం ఉన్నట్లే. దానికి రుజువుగా, ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ... ఆత్మహత్య చేసుకోవాలనే తలపుతో సైక్రియాట్రిస్టుల దగ్గరకి పరుగులు పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందట.

 

ఆత్మహత్య అనేది క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి దృశ్యాలు కనిపించకుండా మీడియా జాగ్రత్త పడాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకునే విధానాన్ని చూపించడం, ఆత్మహత్యే ప్రధాన అంశంగా ప్రోగ్రాంలు రూపొందించడం చేయకూడదని చెబుతోంది. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప మరో మాట లేకుండా ఏకంగా ఓ సీరియల్నే రూపొందించేశారు. పైగా అది సూపర్హిట్ కావడంతో... దాన్ని పొడిగించేందుకు సిద్ధపడిపోతున్నారు.

- నిర్జర.