‘ఆప్‌’లోకి ‘పాప్‌’...

 

 

 

భారతదేశంలోకి పాప్‌ ఎప్పుడు వచ్చిందంటే ఎవరూ చటుక్కున చెప్పలేరేమో కాని... పాప్‌ సింగర్‌ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రెమో ఫెర్నాండెజ్‌. హిందీ పాప్‌ సింగర్‌గా సంచలనానికి నాంది పలికిన రెమో... తెలుగుతో సహా విభిన్న భాషల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా బోలెడన్ని పాటలు పాడారు. ఆల్బమ్‌లు విడుదల చేశారు. అవార్డులు అందుకున్నారు. సంగీత సంబరాలకు నిత్య నిలయమైన గోవానగరంలో పుట్టిన ఈ ఆల్‌ ఇండియా సింగర్‌... ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు.

 

అదేమిటంటే ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి చేరడం. ‘‘స్వాతంత్య్ర పోరాటం అవసరమైనంతటి పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది’’ అని అంటున్నారు రెమో. ఆ పోరాటంలో తన వంతు పాత్ర  పోషించాలని అనుకున్నా... అందుకు తగిన వేదికగా మరే పార్టీ ఆయనకు కనపడకపోవడంతో ఇన్నాళ్లూ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ ఆవిర్భావం, విజయం సాధించడం తన లక్ష్యాలకు ఆప్‌ తగిన పార్టీ అని అనిపించడంతో... ఆయన ఆ పార్టీలోకి జేరిపోతున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఆప్‌ అమ్ములపొదిలో తొలి వినోద బాణం చేరిందని మనం చెప్పుకోవచ్చు.