తెలంగాణా ప్రభుత్వ తీరును తప్పు పట్టిన ప్రెస్ కౌన్సిల్

తెలంగాణా రాష్ట్రంలో మీడియాపై కొనసాగుతున్న అప్రకటిత నిషేధం, మీడియాపై ప్రభుత్వ నియంత్రణపై విచారించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు-రాజీవ్ రంజన్ నాగ్, కె.అమర్నాథ్ మరియు కృష్ణప్రసాద్ లతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఇటీవల తెలంగాణాలో పర్యటించిన ఆ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర డి.జి.పి.ని కలిసేందుకు అపాయింటుమెంటు కోరినా లభించలేదు. వారి విచారణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను బెదిరిస్తూ మాట్లాడటం, హైదరాబాదు మరియు వర్నగల్ జిల్లాలలో మహిళా జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించడం, రెండు న్యూస్ చానళ్ళపై ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అప్రకటిత నిషేధం అమలుచేస్తున్నట్లు నిర్ధారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో మీడియాకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణా సమాజానికి సెల్యూట్ చేయకపోతే మీడియా మెడలువంచుతామని, పది కిమీ.లోతున వాటిని పాతిపెడతామని మీడియాను బెదిరించడం ద్వారా సెక్షన్స్ 19 (1)(ఎ)(ఇ) మరియు (జి) ప్రకారం వ్యక్తుల, మీడియా భావ ప్రకటనస్వేచ్చను, దేశంలో ఏ ప్రాంతంలోనయినా స్వేచ్చగా జీవించే హక్కులకు భంగం కలిగించారని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ, ట్రాయ్, మీడియా, ప్రతిపక్షాలు నచ్చజెప్పినా తెలంగాణా ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోవడాన్ని కూడా వారు తప్పు పట్టారు. మీడియా స్వేచ్చను హరించే విధంగా తెలంగాణా ప్రభుత్వం యం.యస్.ఓ.లను సమర్దించడం కూడా తప్పేనని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మీడియాకూడా వార్తలు ప్రచురించేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ విషయాలన్నిటినీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, తెలంగాణా రాష్ట్రంలో మీడియాపై కొనసాగుతున్న ఆంక్షలను తొలగించేందుకు కృషి చేయాలని కమిటీ తన నివేదికలో కోరింది.