సమ్మె కొనసాగించేందుకే జూడాలు మొగ్గు

 

గత నెలరోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణాలోని జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరియు హైకోర్టుల నుండి ఎదురుదెబ్బలు తగిలినా వారు సమ్మె కొనసాగించేందుకే మొగ్గు చూపడం విశేషం. ప్రభుత్వం వారికిచ్చిన 24గంటలు గడువు ముగియడంతో వారిని ఆరు నెలలపాటు డిబార్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈవిషయాన్ని వారి తల్లి తండ్రులకు తెలియజేస్తూ అధికారులు లేఖలు కూడా వ్రాయబోతున్నారు. డిబార్ అయిన ఆరు నెలలకి వారికి స్టైఫండ్ కూడా ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెంటనే విధులలో జేరకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన హైకోర్టు వారి కేసు ఈరోజు మరోసారి పునర్విచారించినప్పుడు తాము సమ్మె కొనసాగించదలచుకొన్నామని సప్శాతం చేసారు.

 

సకల జనుల సమ్మెలో తెరాస పిలుపు మేరకు తాము కూడా 49రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నప్పుడు అప్పటి ప్రభుత్వం తమను డిబార్ చేయలేదని కానీ తెరాస ప్రభుత్వం మాత్రం న్యాయబద్దమయిన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న తమను డిబార్ చేస్తానాని బెదిరించడం చాలా దారుణమని, అయినప్పటికీ ప్రభుత్వ బెదిరింపులకి తాము లొంగబోమని వారు స్పష్టం చేసారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు ఎన్ని కష్టాలు ఎదురయినా సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేసారు.