వికలాంగుల పాఠశాలల పేరిట దోపిడీ?
posted on Jun 19, 2012 9:41AM
వికలాంగుల హాస్టల్, విద్యకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పాఠశాలల పథకాన్ని స్వచ్చందసంస్థలు దుర్విన్హియోగం చేస్తున్నాయి. 14ఏళ్ళలోపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని కొన్ని సంస్థలు దోపిడీ చేసుకునేందుకు వినియోగించుకుంటున్నాయి. ప్రతీ విద్యార్థికి 2వేల రూపాయల చొప్పున 50మంది ఉండే పాఠశాలకు నెలకు లక్షరూపాయలు నేరుగా అకౌంట్ లో వేసే సదుపాయాన్ని ఆ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక పాఠశాలలపై 'తెలుగువన్.కామ్' పరిశీలన చేస్తే అసలు పాఠశాల కూడా పెట్టకుండానే కొన్ని స్వచ్చందసంస్థలు తమ అకౌంట్ల ద్వారా డబ్బులు తెప్పించుకుంటున్నాయి. ప్రత్యేకించి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో స్వచ్చందసంస్థలు తమ ఆదాయవనరుగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నివేదికలు మాత్రమే సక్రమంగా పంపిస్తూ పాఠశాలలను కాయితాలపై లేక్కల్లా చూపుతున్నారని ధానమైన ఆరోపణ. దీని పొరుగున ఉన్న విశాఖజిల్లాలో పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. నర్సీపట్నంలోని ఏరియా ఆసుపత్రి సమీపంలో సిబిఎం కాంపౌండ్ లో ఒక స్వచ్చందసంస్త వికలాంగుల ప్రత్యేక పాఠశాల అని ఇటీవల బోర్డు పెట్టింది. అందులో వికలాంగ విద్యార్థులు పెద్దగా ఎవరికీ కనిపించలేదు. బోర్డు పెట్టిన రెండు నెలల తరువాత ఆ సంస్థ ప్రతినిథి ఏడు నెలలనుంచి నడుపుతున్న పాఠశాలను మూసివేస్తున్నట్లు ఎంఇఓ దివాకర్ కు లేఖ రాశారు. తానెప్పుడూ ఆ పాఠశాలనే చూడలేదని దివాకర్ ఆశ్చర్యపోయారు. ఇదే విషయమై సర్వశిక్షాఅభియాన్ విశాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావును ప్రశ్నిస్తే ఆ పాఠశాలల నిర్వహణ విషయంలో తమ ప్రమేయం లేదన్నారు. ఎంఇఓ దివాకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 2011 జులైలో తాము పాఠశాల పెట్టామని, 2012 జనవరిలో పాఠశాల మూసేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిథి తెలిపారు. పాఠశాల పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి విద్యార్థికి 2వేల రూపాయల చొప్పున తమ అకౌంటులో పడుతున్నప్పుడూ చెప్పని సంస్థ ఎంఇఓ కు లేఖ ఎందుకు రాసిందని అధికార్లను ప్రశ్నిస్తే దాన్ని ధృవీకరించాల్సింది మాత్రం ఎంఇఓ అన్న విషయం తెలిసింది. ఇలా వికలాంగుల ప్రత్యేకపాఠశాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా దోపిడీ జరుగుతోంది. దీనిపై రాష్ట్రస్థాయిలో స్పందించాలని వికలాంగ సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి.