మద్యం సిండికేట్ లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లు
posted on Jun 19, 2012 9:24AM
ఎప్పటినుంచో మద్యం వ్యాపారంలో ఉన్నా బయటికిరాని కొత్త పాత్రలు ఇప్పుడు పరిచయమవుతున్నాయి. పాటజాబితాలో పాత్రధారులుగా ఉన్న ఇద్దరు సిండికేటు వాటాదారులు ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఉపఎన్నికల్లో గెలుపొందారు. దీంతో సిబీఐ జాబితాలోని రాజకీయనాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అలానే గుంటూరు జిల్లాలో ఎసిబి వలేసి పట్టుకున్న నారాకోడూరు మద్యం సిండికేటు నిర్వాహకుడు జమ్ముల ఉమామహేశ్వరరావును విచారిస్తే ఆయన కూడా కొన్ని కొత్తపాత్రల వివరాలు కక్కారట. దీంతో ఈ మద్యం వ్యవహారం కొన్ని కీలకమైన మలుపులు తిరుగుతోంది. ఎం.ఆర్.పి. కన్నా అధికధరలకు మద్యం అమ్మకాలు జరిపిన కేసులో ఎసిబి కొంత పురోగతి సాధించింది. ప్రస్తుతం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావులను ఎసిబి డిఎస్పీలు విచారిస్తున్నారు. అయితే వీరి వెనుకే నిందుతుల జాబితాలో ఉన్న చెన్నకేశవరెడ్డి, నరసన్నపేటకు చెందిన కృష్ణదాసు ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిని కూడా విచారించనున్నారు. గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన జమ్ముల ఉమామహేశ్వరరావు ఎం.ఆర్.పి. ధరలకన్నా అధికరెట్లకు మద్యం విక్రయించిన సిండికేట్లలో ప్రముఖుడు. ఇతనికి ఇక్సైజ్ శాఖతో సత్సంబంధాలున్నాయి. ఎసిబి ఈ కేసు విచారిస్తోందనీ, దానిలో ఉమామహేశ్వరరావు పేరు కూడా ఉందని సమాచారం అందుకున్న వెంటనే ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. చాలాకాలం కనిపించకుండాపోయిన ఉమామహేశ్వరరావు తన సంగతి అందరూ మరిచి ఉంటారని ఇటీవల బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఎసిబి ఆయన్ని చాకచక్యంగా అరెస్టు చేసింది. ఆయన్ని విచారించగా చేబ్రోలుకు చెందిన ఓ చోటానాయకుని వివరాలు ,నారాకోడూరు ఎక్సైజ్ కానిస్టేబుల్, ఓ కాంగ్రెస్ నాయకుడి వివరాలు కక్కేశారు. వీరందరూ సిండికేటు వాటాదారులు. ఉమామహేశ్వరరావు ఎసిబి కోర్టులో హాజరుపరిస్తే ఆయనకీ 14రోజుల రిమాండు విధించింది. ఇటీవల ఇదే జిల్లాలోని పొన్నూరులో మద్యం వ్యాపార్య్లపై ఎసిబి దృష్టిసారించింది. అలానే ములుకుదురు సాయి బీర్ అండ్ వైన్స్ యజమాని అన్వర్ గౌడ్ తెల్లకార్డును రెవెన్యూ అధికారులు క్యాన్సిల్ చేశారు. ఉమామహేశ్వరరావు రిమాండు ఎసిబి విచారణ గుంటూరు జిల్లాలోని మద్యం సిండికేట్లను వణికిస్తోంది. ఎసిబి పేరు వింటేనే వ్యాపారులు భయపడుతున్నారు.