ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వి.హెచ్.

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా కుటుంబానికి వీర విధేయుడు అయిన వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం కావడాన్ని సాకుగా తీసుకుని వి.హనుమంతరావు ముఖ్యమంత్రి పదవికోసం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నడూ లేని విధంగా గత శనివారం హనుమంతరావు తన జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్ కి చెందిన 10మంది మంత్రులు స్వయంగా వేడుకలకు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల అనంతరం హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవినీతిని తీవ్ర పదజాలంతో విమర్శించారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాబోడని జోస్యం చెప్పారు. ఈ ప్రకటనలు హైకమాండ్ మెప్పుకోసమే ఆయన చేసుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. సోనియా గాంధీ కుటుంబం వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబీకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వై.ఎస్. కుటుంబాన్ని విమర్శిస్తూ హైకమాండ్ కు మరింత దగ్గర కావాలన్నది హనుమంతరావు వ్యూహంగా కనిపిస్తుంది. తనను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాష్ట్రంలో రెడ్డి కులస్థుల ఆధిపత్యం తగ్గించడంతో పాటు బిసిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో ప్రత్యేక తెలంగాణా వాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునన్న సంకేతాలను వి.హెచ్. హైకమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది.

 

 

 

సామాజికపరంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడ్డి, కమ్మ, ఎస్.సి, ఎస్.టి., మైనారిటీలకు దూరంజ్ అయిందని ఆ పార్టీకి ఇటీవలి ఉపఎన్నికల్లో బిసిలు మద్దతు ఇవ్వడం వల్లే కనీసం రెండు స్థానాల్లో అయినా గెలుపొందిందని వి.హెచ్. ఇటీవల వాయిలార్ రవి, గులాంనబీ ఆజాద్ లకు చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళుతెరిచి బిసిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో అన్ని  ప్రాంతాల్లోనూ ఘోర పరాజయం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన వి.హెచ్. తాను ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తన వర్గానికి చెందిన నాయకులు ఉన్నారని, తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగెస్ నాయకులు కూడా తన మాట జవదాటరని ఆయన భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చే విషయాన్ని ఆలోచిస్తే వి.హెచ్. తప్పనిసరిగా ఒక గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థి కాబోతున్నారు. ఇదిలా వుండగా ఢిల్లీలో పలుకుబడి ఉన్న మరో నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిని తిరిగి రెడ్డి కులస్థులకు ఇచ్చే పక్షంలో తన పేరును పరిశీలించాల్సిందిగా ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ ఉపఎన్నికల ఫలితాలు ఆయన ప్రయత్నాలకు గండికొట్టాయి. దీనికి తోడు గతంలో ఆయనపై ఎసిబి దాడుల వివాదాలు చుట్టుముట్టడం, కాంగ్రెస్ పార్టీనుంచి వలసలను అరికట్టలేక పోవడం మైనస్ పాయింట్లుగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులస్థులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన ఉంది. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు వంటి సీనియర్లు తమ అక్కసును బహిరంగంగానే వెళ్ళగక్కారు. తమ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే విషయాన్ని అధిష్టానం ఆలోచిస్తే కేంద్రమంత్రి పురందరేశ్వరి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్లు పరిశీలించవలసిందిగా కమ్మనాయకులు అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu