మీ చూపుడు వేలు చిన్నదిగా ఉందా!

మన చేతిలో వేళ్ల పొడవుని బట్టి, ఇతర వేళ్లతో వాటికి ఉండే పోలికను బట్టి పెద్దలు రకరకాల జోస్యాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని వారి వారి అనుభవంతో చెప్పినవి కావచ్చు. మరికొన్ని ఊసుకోని ఊహలు కావచ్చు. కానీ వేళ్లని చూసి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చని ఇప్పుడో పరిశోధన రుజువుచేస్తోంది. అంతేకాదు! ఒక మనిషి ఏ రంగంలో రాణించగలడో కూడా చెప్పవచ్చునంటోంది.

 

ఉంగరం వేలు- చూపుడు వేలు
ఒక్కసారి మీ చేతి వంక చూసుకోండి. కొందరికి వారి ఉంగరం వేలు, చూపుడు వేలుకంటే పెద్దదిగా ఉంటుంది. మరికొందరికి చూపుడు వేలే ఉంగరపు వేలుకంటే పెద్దదిగా ఉంటుంది. సరే! మరికొందరికి రెండు వేళ్లూ సమానంగా ఉంటాయనుకోండి. తల్లి కడుపులో ఉన్నప్పుడు, మనకి లభించిన టెస్టోస్టెరోన్‌ అనే హార్మోనులో మార్పుల వల్లే ఇలా రెండు వేళ్లలో తేడాలు ఉంటాయని తేలింది.

టెస్టోస్టెరోన్‌ ఎక్కువైతే
టెస్టోస్టెరోన్‌ అనే హార్మోను పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వారిలోని పునరుత్పత్తిని నిర్దేశిస్తుంది. స్త్రీలలో కూడా ఈ హార్మోను ఉత్పత్తి ఉంటుంది కానీ, పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తల్లి కడుపులో ఉండగానే శిశువుకి ఈ హార్మోను ఎక్కువపాళ్లలో అందితే వారి చూపుడు వేలు, ఉంగరపు వేలుకంటే చిన్నగా ఉంటుందట. అదే తగినంతగా అందకపోతే ఉంగరపు వేలే చిన్నదిగా ఉంటుందట. ఇది జ్యోతిషులు చెప్పిన మాట కాదు... శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన వాస్తవం.


ప్రభావం ఉంటుంది
ఇలా చిన్నప్పుడే టెస్టోస్టెరోన్ హార్మోను ఎక్కువగా పొందినవారు ఇతరులతో పోలిస్తే చాలా దృఢంగా ఉంటారని తేలింది. వీరు క్రీడలలో సమర్థంగా రాణించగలరట. ఇక దారులను గుర్తుంచుకోవడం, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను వెతకడం వంటి ప్రతిభ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు! వీరిలో జీవితాంతమూ టెస్టోస్టెరోన్‌ ఇలా అధికమొత్తంలో విడుదల అవుతూ ఉంటుందట. అలాగని చిన్నప్పుడు టెస్టోస్టెరోన్‌ తక్కువగా పొందినవారిని (ఉంగరపు వేలు చిన్నగా ఉన్నవారు) తక్కువగా చేయడానికి వీల్లేదు. వీరు జ్ఞాన సంబంధమైన విషయాలలో ముందుంటారట. మనుషులను గుర్తుంచుకోవడం, చదివిన విషయాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలగడం వంటి ప్రతిభ వీరిలో అపారంగా ఉంటుంది.

జబ్బులు కూడా
చూపుడు వేలు, ఉంగరపు వేళ్లని బట్టి వారి ప్రతిభను మాత్రమే కాదు... వివిధ మానసిక సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా పసిగట్టవచ్చునంటున్నారు. చూపుడు వేలు చిన్నగా ఉన్నవారు ADHD, ఆటిజం వంటి తీవ్రమైన సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందట. ఇక ఉంగరపు వేలు చిన్నగా ఉన్నవారు చీటికీమాటికీ ఉద్వేగానికి లోనవ్వడం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు.

 

నార్వేజియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 42మంది మీద పరిశోధన చేసి తేల్చిన ఫలితాలివి. మన శరీర ఆకారానికీ హార్మోనులకీ మధ్య అవినాభావ సంబంధం ఉందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. అయితే ఇది కేవలం ఎదుటి వ్యక్తి గురించి ఒక అంచనాను మాత్రమే అందించగలదు. ఎందుకంటే ఒక మనిషి ప్రతిభ ఏమిటన్నది అంతిమంగా అతని వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటుంది కదా!

 

- నిర్జర.