నాయకుడికి చెలగాటం... నేతలకి ప్రాణ సంకటం!

 

సామెత పాతదైనా మళ్లీ చెప్పుకోవాల్సిందే! పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణ సంకటం!ఇంతకీ పిల్లి ఎవరు? ఎలుకలెవరు అంటారా? ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం గాని... ముందు జగన్ పార్టీ ఎంపీల టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం... 
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపి కాకుండా వున్న ఏకైక పార్టీ ఆయనదే! ప్రతిపక్షంలో అయితే రెండో పార్టీనే లేదు. మొత్తమంతా ఆయనే, ఆయన ఎమ్మేల్యేలే! నిజానికి ఇలాంటి పరిస్థితి చాలా గొప్ప అవకాశం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం చాలా తేలిక. అసెంబ్లీలో , బయట తనకున్న అనేక మంది ప్రజా ప్రతినిధులతో అద్భుతంగా పోరాటాలు చేయవచ్చు. కాని, యువనేత అలాంటిదేం చేస్తున్నట్టు లేదు. పైగా అనాలోచిత నిర్ణయాలు, ప్రకటనలతో స్వంత పార్టీ నాయకుల్నే బెంబేలెత్తిస్తున్నారు. దూరం చేసుకుంటున్నారు. 

 

దివంగత వైఎస్ తనయుడుగా జనంలో వున్న క్రేజ్, సానుభూతి అన్నీ కలుపుకుని జగన్నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేత అయ్యారు. ఆయన నేరుగా సీఎం అవ్వాలని అనుకున్నా జనం చంద్రబాబుకి పట్టం కట్టారు. అయితే, అపోజిషన్ గా వైసీపీ తగిన పాత్ర పోషించటం లేదని మొదట నుంచీ ఆరోపణ వుంది. తాజాగా ప్రత్యేక హోదా రచ్చ మరోసారి జగన్ నాయకత్వ పటిమపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు తన ఎంపీలు రాజీనామా చేస్తారని బాంబు వేశారు. ఇమీడియెట్ గా కాకున్నా శీతకాల పార్లమెంట్ సమావేశాల తరువాత రిజైన్ చేస్తారని ఆయన సెలవిచ్చారు! కాని, ఇందులో ట్విస్ట్ ఏంటంటే... అలా రాజీనామా చేయాలని మనందరితో పాటూ వైసీపీ ఎంపీలకు కూడా అప్పుడే తెలిసింది. టీవీల్లో లైవ్ చూస్తూ జగన్ మాటలు విన్న వారంతా దెబ్బకి షాకయ్యారట!

 

ఎన్నికల్లో జనం జగన్ ముఖం చూసి ఓటేసినా, వైఎస్ బొమ్మ చూసి గెలిపించినా ఎంపీలుగా గెలవాలంటే డబ్బులు ఖర్చు చేయాలా వద్దా? బోలెడు చేయాలి. కోట్ల రూపాయలు చిత్తు కాగితాల్లా విసరాలి. అలా చేస్తేనేగాని ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా వున్న వారు గెలవలేదు. వాళ్లే కాదు అన్ని పార్టీల వారు అదే చేస్తున్నారు. కాని, జగన్ నాయకత్వంలోని ఎంపీలకు మాత్రం ఊహించని విధంగా బంపరాఫర్ తగిలింది! ఆయన ఎవరితోనూ చర్చించకుండా రాజీనామా అనౌన్స్ మెంట్ చేశారట నిండు సభలో! ఒకవేళ ఆయన అన్నమాటే నిజమైతే... ఎంపీలుగా వున్న వారు మళ్లీ కోట్ల రూపాయలు సూట్ కేసుల్లో సర్దుకోవాలి. అవన్నీ ఎవరిస్తార్రా దేవుడా అనుకుంటున్నారట వారు!

 

వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి వుంది. అందులో చర్చించిగాని కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. కాని, అది ఇప్పటి వరకూ జగన్ ఏర్నాటు చేయలేదట. ఎప్పుడో ఒకట్రెండు సార్లు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పొలిటికల్ అడ్వైజర్ కమిటీతో సంబంధం లేకుండానే అధినేత డిసీషన్ తీసుకుంటారట. వైసీపీ ఎంపీలు, ఎమ్మేల్యేలు వాట్ని మారు మాట్లాడకుండా ఫాలో అయిపోవాలి. కాని, ఏవో చిన్నా చితకా నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు అంటే ఓకే. కాని, తమకు చెప్పుకుండా ఏకంగా రాజీనామాల నిర్ణయం జగన్ ఎలా తీసుకుంటారని నేతలు లోలోన ఉడికిపోతున్నారు. ఒకవేళ రేపు రాజీనామాల కారణంగా ఉప ఎన్నికలు వస్తే తిరిగి గెలుస్తామన్న గ్యారెంటీ కూడా లేదని వారు మథనపడిపోతున్నారు...

 

తెలంగాణలో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉప ఎన్నికలు తీసుకొచ్చే వారు. అక్కడ జనం కూడా సెంటిమెంట్ కి విలువనిచ్చి ఓట్లు వేసేవారు. కాని, ఆంద్రాలో ప్రత్యేక హోదాకి అంత సీన్ వుందా? జనం ఆల్రెడీ ప్యాకేజ్ వచ్చాక కూడా హోదా కావాలని సీరియస్ గా డిమాండ్ చేస్తారా? అంత సెంటిమెంట్, కోరిక వుంటే పరిస్థితి ఇంత సైలెంట్ గా వుండేదా? బీజేపీ, టీడీపీ ప్యాకేజ్ గురించి ఇప్పటికే జనానికి తమకు చేతనైనంత వివరంగా చెప్పేశాయి కదా? ఇలా బోలెడు ప్రశ్నలు వైసీపీ ఎంపీల్ని తొలిచేస్తున్నాయట! ప్రస్తుతానికి ఎవ్వరూ బయటపడటం లేదుగాని జగన్ తమలో ఎవరికీ చెప్పకుండా రాజీనామా నిర్ణయం తీసుకోవటం అందర్నీ ఇబ్బంది పెడుతోందట. తమ భవిష్యత్ తో ఇలా ఆటాలు ఆడుకోవటం సబబు కాదని వారు దగ్గరి వారితో వాపోతున్నారు. చూడాలి మరి... జగన్ ప్రకటించిన రాజీనామాల నిర్ణయం వైసీపీలో ఎంతటి తుఫాన్ అవుతుందో! చివరకు, అసలు రాజీనామాలే చేయకుండా టీ కప్పులో తుఫాన్ గా మార్చేసిన మార్చవచ్చు! ఎందుకంటే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు రాజీనామా చేసినా, ఎన్ని రాజీనామాలు చేసినా హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆల్మోస్ట్ చెప్పకనే చెప్పేసింది కదా...