మళ్లీ వచ్చిన 'హోదా' సీజన్!

దాదాపు దశాబ్దమున్నర కాలం తెలుగు నేల ప్రత్యేక రాష్ట్రం నినాదాలతో దద్ధరిల్లింది! ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం స్థానంలో ప్రత్యేక హోదా మార్మోగుతోంది! తెలంగాణ వాదులు యూపీఏను ముప్పతిప్పలు పెట్టి రాష్ట్రం సాధించుకుంటే ఆంధ్రా నేతలు, ఉద్యకారులు, సినిమా వాళ్లు ... ఇలా అందరూ ఎన్డీఏను టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపికి, మోదీకి ప్రత్యేక హోదా పెద్ద కొరకరాని కొయ్యలా మారిపోయింది!

 

నిజానికి ఆ మధ్య వెంకయ్య నాయుడు, తెలుగు దేశం పార్టీ నేతలు కొందరు ఢిల్లీలో చాలా హడావిడి చేశారు. దాని ఫలితమే ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్. కాని, బీజేపి అద్భుతం అంటూ చెబుతోన్న ప్యాకేజ్ పై టీడీపీ మనస్ఫూర్తిగా స్పందించలేదు. ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూనే ఇంకా కావాల్సింది వుందని చెప్పింది. ఇలా బీజేపి, టీడీపీల మధ్య ఫ్రెండ్లీ రాజకీయాలు నడుస్తుండగానే పవన్ , జగన్ తమ పని తాము చేసుకుపోతున్నారు. మైక్ చేతికి దొరికినప్పుడల్లా ప్రత్యేక హోదా అంటూ జనాల్ని అలెర్ట్ చేస్తున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు వస్తుండటంతో ఇప్పుడు మరోసారి హోదా పాలిటిక్స్ మొదలయ్యాయి... 

 

ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాని మన గబ్బర్ సింగ్... పవన్ కళ్యాణ్ వున్నట్టుండీ మూడో సభ అన్నాడు. అసలు తిరుపతి , కాకినాడ మీటింగ్ ల తరువాత ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో ఎవరికీ అర్థం కాలేదు. పైగా కాకినాడలో ఒక అభిమాని చనిపోవటంతో మళ్లీ సభలుండవని కూడా అన్నాడు. కాని, ఇప్పుడు ఏమైందోగాని అనంతపురంలో పబ్లిక్ మీటింగ్ ప్రకటించాడు. అది కూడా స్పెషల్ స్టేటస్ కోసమే అని క్లారిటీ ఇచ్చాడు!

 

హోదా ఇవ్వటం కుదరదని మోదీ గవర్నమెంట్ ఇప్పటికే తేల్చేసింది. నీతి ఆయోగ్, ప్లానింగ్ కమీషన్ ఇలా చాలా కారణాలే చూపించింది కూడా! అందుకే, ఆంద్రాలో చిన్న పిల్లలు కూడా స్పెషల్ స్టేటస్ చాప్టర్ ఓవర్ అనుకున్నారు. కాని, పవన్ రంగంలోకి దిగి మళ్లీ హోదా అంటుండటంతో ప్రతిపక్ష నేత జగన్ కూడా అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ యూత్ ను పోగేసి హోదా కావాల్సిందేనని స్పీచ్ లు ఇస్తున్నాడు. ఇంకా ఓ అడుగు ముందుకేసి తన పార్టీ ఎంపీలు అవసరమైతే రాజీనామాలు చేస్తారని ఆఫర్ ఇచ్చాడు కూడా! 

 

హోదా కోసం పవన్ , జగన్ ఎవరి పొలిటికల్ స్టెప్పులు వారేస్తుంటే చంద్రబాబు మరో వైపు నుంచి నరుక్కొస్తున్నారు. ఇచ్చిన ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఊరికే హామీలు ఇవ్వటం కాకుండా పార్లమెంట్లో భరోసా ఇవ్వాలంటున్నారు. జైట్లీ లాంటి మంత్రులు ప్యాకేజ్ చట్టబద్ధతపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఇది జరిగితే హోదాపై పవన్, జగన్ ఎలాంటి పోరాటాలు చేసినా టీడీపీ క్రెడిట్ టీడీపికి దక్కుతుందని ఆయన కాలిక్యులేషన్...

 

చంద్రబాబు, పవన్, జగన్ ... ఇప్పుడు మరోసారి అందరూ హోదా, ప్యాకేజ్ లపై దృష్టి సారించారు. పార్లమెంట్ సమావేశాలే దీనికి కారణం అనేది క్లియర్. మరి ఢిల్లీ పెద్దలు ఈ హోదా ఫీవర్ కి ఎలాంటి మందు వేస్తారో చూడాలి! లేదంటే ఎప్పటిలానే టెంపరరీగా ప్యారసెటమాల్ పరిష్కారం ఏదైనా చూపుతారేమో...