లోకేష్ ను చంపుతామని మావోలు మళ్లీ అదే తప్పు చేశారా?

 

మావోయిజం... ఇది ఆదర్శాల శంఖాలు, యుద్ధ భేరీల శబ్దాల మధ్య సాగే అమానుష రణం! ఇప్పటికి ఎందరు పోరాట యోధులు పోలీసు తూటాలకు బలయ్యారో లెక్కే లేదు. అలాగే, నక్సల్స్ మందుపాతరలకి ఎన్ని ప్రాణాలు గాల్లో కలిశాయో, ఎన్ని పోలీసుల కుటుంబాలు, ఇన్ పార్మార్ల కుటుంబాలు కుమిలిపోతున్నాయో అంచనా లేదు. దశాబ్దాలుగా రక్తం పారుతూనే వుంది. అయినా రెండు వైపుల నుంచి వెనక్కి తగ్గటం అనే మాట వినిపించటం లేదు. తాజాగా ఏఓబీలో జరిగినా ఎన్ కౌంటర్ మరో మారు మావోయిజంలోని హింసాత్మక ధోరణి బయటకి తీసుకొచ్చింది... 

 

నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేసి చంపటం తప్పా ఒప్పొ అనేది పెద్ద చర్చ. ఏకపక్షంగా పోలీసులను, గ్రేహౌండ్స్ ను సమర్థించటం కరెక్ట్ కూడా కాకపోవచ్చు. కాని, అసలు సమస్యంతా మావోలు గన్నులు పట్టడంలో వుంది. తమ ఆశయాలు, ఆదర్శాల కోసం వారు ఆయుధాలు పట్టడంతో సామాన్య జనంలో రాను రాను సానుభూతి తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా, ఒకప్పటిలా ఇప్పుడు యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూపులు చూడటం లేదు. చిన్న పల్లెటూరులోని వాళ్లు కూడా నగరాలకి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ ప్రైవేట్ ఉద్యోగాల ప్రపంచంలో మావోయిజం చెప్పే సాయుధ పోరాటం, విప్లవం లాంటి మాటలకి చోటే లేదు. అందుకే, రాను రాను యువత నక్సలిజం వైపు వెళ్లటం తగ్గిపోతోంది. క్రమంగా మావోయిస్టు పార్టీ బలహీనపడుతోంది. దానికి తోడు ప్రభుత్వాల ఉక్కుపాదం వున్న కొద్ది పాటి శక్తిని కూడా నీర్వీర్యం చేసేస్తోంది. మొత్తంగా వామపక్ష సాయుధ పోరాటం కోలుకోలేని దెబ్బలు చవిచూడాల్సి వస్తోంది... 

 

యుద్ధంలో తీవ్ర నష్టం ఎదుర్కొంటోన్న మావోయిస్టులు తాజా ఎన్ కౌంటర్ తరువాత ఎప్పటిలానే మరోసారి తప్పు చేశారు. చంద్రబాబును, ఆయన కుమారుడ్ని టార్గెట్ చేశారు. చంపేస్తామని లేఖలో పేర్కొన్నారు. నిజానికి చంద్రబాబు మీద గతంలో చేసిన అలిపిరి దాడే ప్రజల్లో పెద్దగా మద్దతు సంపాదించి పెట్టలేదు. మావోయిస్టులు చెప్పినట్టుగా బాబు అంతటి దుర్మార్గుడే అయితే ఆయనని పదేళ్ల తరువాత కూడా జనం ముఖ్యమంత్రిని చేసే వారు కాదు. ఇక ఇప్పుడు సీఎంని మరోసారి టార్గెట్ చేసి నక్సల్స్ తప్పే చేశారు. దీని వల్ల ప్రజల్లో మావోయిస్టులు హింసాత్మక శక్తులనే అభిప్రాయం బలపడిపోతుంది. అదీ కాక ఇంత వరకూ పార్టీకే పరిమితం అయినా లోకేష్ ను కూడా చంపేస్తామని చెప్పటం మరో రాంగ్ సిగ్నల్. ఆయనకు పోలీసులపై ఎలాంటి అధికారం వుండదు. అప్పుడు లోకేష్ ను ఎన్ కౌంటర్ కు బాద్యుడిగా ఎలా చేస్తారు? పోనీ... చంద్రబాబు కొడుకు అవ్వటం వల్లే మావోలు చంపేద్దామనుకుంటున్నారా? అలా చేస్తే మతోన్మాదంతో మరిగిపోయే పాక్ ఉగ్రవాదులకి , వీరికి తేడా ఏముంటుంది? ఆదర్శాలు, సిద్ధాంతాలు అన్నీ ఎక్కడికి పోయినట్టు?

 

చంద్రబాబు, లోకేష్ హై సెక్యురిటీతో వుండే వీవీఐపీలు. వాళ్లని చంపటం దాదాపు అసాద్యం. కాని, మావోలు లేఖ ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కారు. రేపు ఎప్పుడైనా గట్టి ప్రయత్నం కూడా చేయవచ్చు కూడా. కాని, అసలు ఇప్పుడు అడవిలోని అన్నలు ఆలోచించాల్సింది ఎవర్ని చంపటం గురించి కాదు... తాము ఎంచుకున్న చంపుతూ పోవటం అనే మార్గం సరైందా? కాదా? జనం మెచ్చుతారా? అని! 

 

మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖ నిజమైంది కాకపోవచ్చని కూడా అంటున్నారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ ల మీద దాడి విషయం ఇప్పటికి్ప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సింది కాదు. అయినప్పటికీ పోలీసులు ఎప్పటిలానే అప్రమత్తంగా వుండటం మంచిది! ఉనికిని కాపాడుకునే క్రమంలో ఆత్మాహుతి దాడి జరగదనటానికి అవకశం లేదు. ప్రపంచం వ్యాప్తంగా సాయుధ పోరాటాల్లో అది చాలా సార్లు జరిగింది!