ఛీ..గ్యాంగ్‌రేప్ బాధితురాలితో సెల్ఫీనా..!
posted on Jun 30, 2016 3:36PM

ఈ మధ్య సెల్ఫీ పిచ్చి మరి ఓవర్ అయిపోయింది. సమయం, సందర్భం లేకుండా సెల్ఫీల కోసం జనాలు ఆరాటపడుతున్నారు. కొందరు అలాగే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే సభ్యత మరచిన ఒక మహిళ రేప్‌కు గురైన బాధితురాలితో సెల్ఫీ తీసుకుంది. ఆ మహిళ వేరేవరో కాదు.. సాక్షాత్తూ మహిళల హక్కులను కాపాడతామని బాధ్యత తీసుకున్న ఒక రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో భర్త, అతడి ఇద్దరు సోదరుల అకృత్యానికి బలైన 30 ఏళ్ల బాధితురాలి ధీనగాధ దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
రూ.51 వేలు కట్నంగా ఇవ్వలేదని ఆమె నుదురు , చేతుల మీద అసభ్యకరమైన మాటలతో పాటు మా నాన్న దొంగ అంటూ టాటూలు వేయించారు. దీనిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. సదరు బాధితురాలిని పరామర్శించేందుకు రాజస్థాన్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సుమన్ శర్మ, సభ్యురాలు సౌమ్యా గుర్జర్ జైపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆమెను ఓదార్చి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.
ఈ సమయంలో సౌమ్యా బాధితురాలితో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. మామూలుగా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లు గానీ ఫోటోలు కానీ బయటకు వెల్లడించరు. అలాంటిది ఆమె ఏకంగా సెల్ఫీ దిగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన కమిషన్ ఛైర్‌పర్సన్ సుమన్ శర్మ..గుర్జర్ నుంచి లిఖిత పూర్వక వివరణ కోరారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కమీషన్ ఛైర్‌పర్సన్ సుమన్ శర్మ కూడా ఆ సెల్ఫీలో ఉన్నారు.