ట్రాఫిక్‌లో పైలట్.. వెంకయ్య, కేటీఆర్ పడిగాపులు
posted on Jun 29, 2016 5:27PM
.jpg)
సాంకేతిక లోపంతోనో..వాతావరణం సరిగా లేకనో విమానాలు ఆలస్యమవుతుండటం మనం చూస్తూ ఉంటాం. కానీ విమానాన్ని నడపాల్సిన పైలట్ సమయానికి రాకపోవడంతో ఫ్లైట్ లేటవ్వడం మీరేక్కడైనా చూశారా.? ఇలాంటి ఘటనలతో తరచుగా సాధారణ ప్రయాణికులకు చుక్కలు చూపించడం ఎయిర్ ఇండియాకు పరిపాటే. మామూలుగా అయితే ఇది పెద్ద వార్త అయ్యేది కాదు. కానీ ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారిలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉండటంతో ఇది పెద్ద వార్త అయ్యింది.
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాలి. ఇందుకోసం వెంకయ్య మధ్యాహ్నం 12.30 గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కేటీఆర్ కూడా సరైన సమయానికే వచ్చారు. సమయం 1.45 గంటలైనా విమానం కదల్లేదు.. గంట గడిచింది అయినా విమానం గాల్లోకి లేవలేదు. అసలు విషయం ఆరా తీస్తే..విమానం నడపాల్సిన పైలట్ ఢిల్లీ రోడ్ల మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని తెలిసింది. ఇక చేసేది లేక వెంకయ్య తన ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో పాటుగా తన అసంతృప్తిని ట్వీట్టర్ ద్వారా వెళ్లగక్కారు.

ఇలాంటి సంఘటనల పట్ల ఎయిరిండియా వివరణ ఇవ్వాలి. సర్వీసులో పారదర్శకత, జవాబుదారీతనం అవసరం..మీరు వ్యర్థం చేసిన గంట సమయం ఎంతో విలువైనది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని..దీనిపై ఎయిరిండియాను విచారణకు ఆదేశించినట్లు అశోక్ ట్వీట్ తెలిపారు.
