మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకుంటే ఈ మూడు సమస్యలే కారణం కావచ్చు!

ప్రస్తుతకాలంలో అధికశాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో అధిక బరువు ప్రధానంగా ఉంది. అధిక బరువు క్రమంగా గుండె సంబంధ సమస్యలు, మధుమేహం, కీళ్ల నొప్పులు, ఎముకల అరుగుదల వంటి సమస్యలకు కారణం అవుతుంది. అదే విధంగా అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది. ప్రస్తుతం అధిక బరువు సమస్యకు వయసుతో కూడా సంబంధం లేదు.
ఈ అధిక బరువు మీద చాలా మందికి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు, ఆహారంలో మార్పులు వంటివి ఎన్నో ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ని చేసినా సరే అధిక బరువు తగ్గడం లేదంటే అసలు కారణాలు వేరే ఉన్నాయని అర్థం. అవేంటో తెలుసుకుంటే..
థైరాయిడ్ సమస్యలు..
ఆహారం, వ్యాయామం, జీవనశైలి వంటి విషయాలలో ఎన్ని మార్పులు చేసుకున్నా బరువు విషయంలో ఏమాత్రం మార్పులు కనబడకపోతే థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో బరువు పెరుగుదల దారుణంగా ఉంటుంది.
ఒత్తిడి..
ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారు బరువు విషయంలో మార్పులు పొందలేరు. ఎందుకంటే ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రభావం అవుతాయి. ప్రధానంగా ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసాల్ హర్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. నెలసరి సమస్యలు, మెనోపాజ్, ఇతర ఒత్తిడులు బరువు మీద ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిలో అధిక బరువు సమస్య ఉంటే బరువు తగ్గడం కంటే ముందు ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నం చెయ్యాలి.
నిద్ర..
పౌష్టికాహారం తీసుకుంటున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా బరువు విషయంలో ఎలాంటి మార్పులు లేవని చింతించేవారు ఉంటారు. అయితే అలాంటి వారు నిద్ర విషయంలో సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవాలి. నిద్రసరిగ్గా లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. నిద్ర వేళలు సరిగ్గా ఫాలో అవ్వకపోతే వారి రోజు మొత్తం గందరగోళంగా గడిచిపోతుంది. ఈ చికాకుల కారణంగా హార్మోన్లు కూడా ప్రభావితం అవుతాయి. అందుకే బరువు తగ్గాలని అనుకుంటే ముందు సరైన నిద్ర వేళలు పాటించాలి. రాత్రి 10 నుండి 11 గంటల లోపు నిద్రపోవడం. ఉదయాన్నే 6నుండి 6-30 నిమిషాల లోపు నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రోజు ఖచ్చితంగా 7నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
*నిశ్శబ్ద.



