మహిళలు ఇంటి పని, ఉద్యోగం రెండూ సక్సెస్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగంటే..!

మహిళా శక్తి  రోజు రోజుకూ పెరుగుతున్న కాలమిది. మగవారితో పాటు మహిళలు కూడా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో సత్తా చాటుతున్నారు. కానీ మహిళలు ఎంత సక్సెస్ సాధించినా ఇంటి గడప తొక్కితే గృహిణులుగా మారిపోతారు. ఇంటి పనులు, వంట పనులు, భర్త, పిల్లల బాధ్యత అన్ని చూసుకుంటారు. అందుకే మహిళలను మల్టీ టాస్కర్లు అని అంటారు.  ఇది పైన చెప్పుకోవడానికి బానే ఉంటుంది కానీ  మహిళలు రెండింటిని బాలేన్స్ చెయ్యడానికి చెప్పలేనంత ఒత్తిడికి లోనవుతుంటారు. అటు ఉద్యోగినిగా, ఇటు తల్లిగా, భార్యగా, గృహిణిగా అన్నింటికి న్యాయం చేస్తూ ఒత్తిడి దరిచేరకూడదంటే ఈ కింది చిట్కాలు పాటించాలి.

 ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి..

ముందుగా సమయపాలన ముఖ్యం.  ముఖ్యమైన పనులు ఏమిటో నిర్ణయించుకోవాలి. అప్పుడు వాటిపై దృష్టి పెట్టాలి. అవసరమైనప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. అంతేకాని మొహమాటానికి దేన్నీ నెత్తిన వేసుకోకూడదు.  అది పని అయినా లేదా ఇంటి బాధ్యత అయినా. చాలా కంపెనీలు పెళ్లై పిల్లలున్న మహిళలకు పని సౌలభ్యాన్ని అందిస్తాయి.  అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపికల ప్రయోజనాన్ని పొందాలి. అది రిమోట్ పని లేదా సౌకర్యవంతమైన పని గంటలు కావచ్చు, ఇంటి బాధ్యతలతో పాటు  మహిళలు తమని తాము డవలప్ చేసుకుంటూ తమ ఉద్యోగాన్ని నిర్వర్థించేందుకు ఇంట్లో వ్యక్తుల మధ్య సమన్వయం ఏర్పడేలా చూడాలి.

సాంకేతికతను బాగా ఉపయోగించుకోవాలి..

ఇప్పట్లో సాంకేతికత చాలా అభివృద్ది చెందింది.  పనిని సులభతరం చేయడానికి  సాంకేతిక సాధనాలను ఉపయోగించుకోవాలి. దీనితో  పని,  జీవితం మధ్య మంచి బ్యాలెన్సింగ్ సాధించవచ్చు. ఇంటి పనులను కుటుంబ సభ్యులతో కలసి షేర్ చేసుకోవడం వల్ల మహిళలకు కొంత ఊరట లభిస్తుంది.

స్వీయ సంరక్షణ ముఖ్యం..

మహిళలు శక్తివంతంగా ఉండాలి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. వ్యాయామం చేయడం, చదవడం, ఇష్టమైన  వారితో సమయం గడపడం వంటివన్నీ మానసిక ,  శారీరక  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

విజయాలను సెలబ్రేట్ చేసుకోండి..

మహిళలు సాధించే విజయాలు చిన్నవా, పెద్దవా అనే విషయం కాదు సక్సెస్‌లు చిన్నదైనా, పెద్దదైనా వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి.  పనిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విజయాన్ని గుర్తించాలి. ఎవరో మీ విజయాన్ని గుర్తించి మిమ్మల్ని అభినందించాలనే ఆలోచన వదిలిపెట్టాలి. చిన్న విజయాలే పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి చేయూతనిస్తాయి. ఉత్సాహాన్ని పెంచుతాయి.  ఇది మహిళల మనస్తత్వాన్ని పాజిటివ్ గా ఉంచుతుంది.

మంచి  కమ్యూనికేషన్..

 సహోద్యోగులతో,  కుటుంబ సభ్యులతో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. మహిళలు తమ ప్రాధాన్యతలు,  బాధ్యతలను వారికి తెలపాలి. ఉద్యోగం, ఇంటి జీవితం విషయంలో వారి సహాకారం, పని ముగించడానికి కావలసిన సమయం విషయంలో స్పష్టత ఇవ్వాలి.  వృత్తిపరమైన బాధ్యతల గురించి  కుటుంబ సభ్యులకు కూడా అర్థమయ్యేలా వివరించాలి.  ఇలా చేయడం వల్ల  జీవితంలో స్థిరత్వం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలిగే ఏ సందర్బాన్ని వీలైనంత వరకు వదులుకోవద్దు. ప్రతి మహిళ బలం కుటుంబం అయితే ఆమె వృత్తి జీవితాన్ని కూడా విజయవంతంగా నెగ్గుకురాగలదు.

                                                    *నిశ్శబ్ద.