ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వర్షాకాలం ఇల్లంతా తాజా!


వర్షాకాలం మొదలయ్యింది. ఇది క్రమంగా పెరిగేదే తప్ప ఇప్పట్లో తగ్గేది కాదు. ఇళ్లు కాస్త పాతవి అయినా, ఇంటి నిర్మాణం నాసిరకంగా ఉన్నా ఇంటి గోడలు వర్షం నీటి కారణంగా చెమ్మ ఏర్పడుతుంది. గోడలు నీటిని పీల్చుకుని వాసన వస్తుంటాయి. ఇది అంత సులువుగా తొలగిపోయే వాసన కాదు. ఇంట్లో వాళ్ళు ఏదో సర్దుకుపోతారు. కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు, బంధువులు వస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.  ఈ సమస్య మీ ఇంట్లోనూ ఉన్నా, ఇంకా పెరిగే వర్షాల కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నా దాన్ని తరిమికొట్టే చిట్కాలు ఉన్నాయి.  ఈ కింది టిప్స్ పాటిస్తే ఇంటిలో వాసనను పారద్రోలడం సులభం.

దుర్వాసనను వదిలించుకోవడానికి చాలా ముఖ్యమైన విషయం ఇంటి లోపలి భాగం బాగా పొడిగా ఉండాలి. దీని కోసం, ఇంట్లో ఎక్కువ సమయం ఫ్యాన్‌ని ఆన్‌లో ఉంచండి . అలాగే ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో  వాసనలు రావు. ఇంట్లో  వాతావరణం చాలా వరకు తాజాగా  కనిపిస్తుంది.

గది నుండి వాసనను తొలగించడానికి చాలా మంది డియోను ఉపయోగిస్తారు, కానీ ఇది వాడకూడదు. ఎందుకంటే ఇందులో రసాయనాలు ఉంటాయి. ఇది మొదట బానే ఉన్నా ఇంట్లో ఉన్న వాసనతో కలిపి కొత్త రకమైన వాసనను ఇది క్రియేట్ చేస్తుంది. ఇంట్లో నుండి  ఈ వాసనను తొలగించడానికి వెనిగర్ మంచి ఆప్షన్.  దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో వెనిగర్,  నీరు కలపాలి.  ఇంట్లో ప్రతి మూలలో  దీన్ని చల్లుకోవాలి.

నిమ్మ,  తులసి యొక్క కూడా ఇంటి నుండి తేమ వాసన తొలగించడంలో చాలా సహాయపడుతుంది. దీనికోసం ముందుగా ఒక పాత్రలో ¾ కప్పు నీటిని మరిగించండి. తర్వాత దానికి నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు తులసి వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు టీ స్టయినర్‌తో ఫిల్టర్ చేసి అందులో 2-3 స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో వేయాలి. తర్వాత కాసేపయ్యాక ఇంటి మొత్తానికి చల్లుతూ ఉండండి.

వర్షపు రోజులలో ఇంటి నుండి వచ్చే తేమ  వాసనను తొలగించడానికి  బేకింగ్ సోడా కూడా  ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో 2 కప్పుల నీటిని పోయాలి, దానికి 1 టీస్పూన్ బేకింగ్ సోడా,  కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. దీన్ని బాగా  షేక్ చేసి ఇంట్లో చల్లాలి. అంతే ఇవన్నీ పాటిస్తుంటే ఇంట్లో వర్షం వల్ల కలిగే తేమ వాసన మాయమవుతుంది. ఇంట్లో తాజాదనం వస్తుంది.

                                                              *నిశ్శబ్ద.