ముఖం మీద మచ్చలను వదిలించుకోవడానికి గ్లైకోలిక్ యాసిడ్‌ను ఎలా వాడాలంటే..!

మచ్చలు లేదా చాలా ఎక్కువగా ఉన్న టాన్  ముఖ  చర్మాన్ని  చాలా దెబ్బతీస్తాయి.  వికారంగా కనిపించేలా చేస్తాయి.  చాలామంది వీటిని తొలగించుకోవడానికి,  చర్మాన్ని క్లియర్ గా, అందంగా కనిపించం కోసం వివిధ రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు.  అయితే ఈ మధ్య  కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో  ఎక్కువగా  గ్లైకోలిక్ యాసిడ్  అనే పేరు వినబడుతోంది.  ముఖ చర్మం మీద ఉండే  అతి చిన్న రంధ్రాలను కూడా లోతుగా శుభ్రపరిచే లక్షణం ఉండటం వల్ల ఇది చర్మం మీద మచ్చలు,  చాలా ఎక్కువగా ఉండే టాన్ వంటివి కూడా సులువుగా తొలగిస్తుంది. అసలు గ్లైకోలిక్ యాసిడ్ అంటే ఏంటి? దీన్నెలా వాడాలి? దీనివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..


గ్లైకోలిక్ ఆమ్లం..


గ్లైకోలిక్ ఆమ్లం చెరకు నుండి తీసుకోబడిన ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం (AHA). చాలా చిన్న అణులుసు కలిగి ఉండటం దీని ప్రత్యేక లక్షణం  చిన్న. ఇవి చర్మం పై పొరలలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.  తాజాగా, ప్రకాశవంతంగా ఉన్న  చర్మాన్ని తిరిగి ఇవ్వడంలో చాలా సహాయపడుతుంది.  అందుకే ఇది పిగ్మెంటేషన్, టానింగ్,  మొటిమల గుర్తులను తగ్గించడంలో చాలా ప్రబావవంతమైన పదార్థంగా పరిగణించబడుతోంది.


మచ్చలకు గ్లైకోలిక్ యాసిడ్..

నల్లటి మచ్చలు, ఎండ కారణంగా చర్మం రంగు మారడం, వయసు పెరిగే కొద్ది వచ్చే  మచ్చలు లేదా మొటిమల గుర్తులు అన్నీ మెలనిన్ పేరుకుపోవడం వల్ల వస్తాయి. గ్లైకోలిక్ యాసిడ్ చనిపోయిన చర్మాన్ని సున్నితంగా తొలగిస్తుంది.  మెలనిన్ పొరను తగ్గిస్తుంది. మచ్చలను కాంతివంతం చేస్తుంది. కొన్ని వారాల పాటు రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల  చర్మపు రంగు మొత్తం బాలెన్స్డ్ గా ఉంటుంది. ముఖ చర్మం మెరుస్తుంది.

గ్లైకోలిక్ యాసిడ్ ఎలా వాడాలి?

టోనర్‌గా..

3% నుండి 7% వరకు బలం కలిగిన గ్లైకోలిక్ యాసిడ్ టోనర్లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కాటన్ ప్యాడ్ మీద కొంత టోనర్ తీసుకోవాలి.  ముఖం అంతా సున్నితంగా అప్లై చేయాలి.

ఇది వాడటం మొదలుపెట్టిన రోజుల్లో వారానికి 2-3 సార్లు మాత్రమే వాడాలి. ఇది  చర్మాన్ని ఎక్కువ చిరాకు  కలిగించకుండా మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

సీరం..

మచ్చలు లోతుగా ఉంటే 5% నుండి 10% గ్లైకోలిక్ ఆమ్లం కలిగిన సీరం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రిపూట చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత  ముఖంపై 2-3 చుక్కలు అప్లై చేసుకోవాలి.  చర్మం పొడిబారకుండా ఉండటానికి దానిపై మాయిశ్చరైజర్ రాయాలి.

ఈ సీరం కొంచెం బలంగా ఉంటుంది.  అందుకే మొదట్లో వారానికి 1-2 సార్లు మాత్రమే అప్లై చేసి క్రమంగా ఫ్రీక్వెన్సీని పెంచాలి.


 పీల్..

10% వరకు పీల్స్ ఇంట్లో వాడటానికి సేఫ్ గా ఉంటాయి. ముఖం మీద 5-10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మృత చర్మాన్ని తొలగించి కొత్త మెరుపును ఇస్తుంది.

జాగ్రత్తలు..

గ్లైకోలిక్ యాసిడ్ అప్లై చేసిన తర్వాత సన్‌స్క్రీన్ అవసరం.  లేకుంటే సన్‌బర్న్,  పిగ్మెంటేషన్ పెరుగుతుంది.

 చర్మం చాలా సున్నితంగా  ఉన్నవారు  ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే దీన్ని ముఖం మీద వాడాలి.

మొదట్లో తక్కువ పవర్ ఉన్న గ్లైకోలిక్ యాసిడ్ ను వాడటం  మొదలుపెట్టాలి. ఆ తరువాత క్రమంగా దా బలంగా ఉన్నదాని వైపు వెళ్లాలి. అంతేకానీ మొదట్లోనే చాలా స్ట్రాంగ్ గా ఉన్నవి వాడకూడదు.

                             *రూపశ్రీ.