జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఇవే..!


మందంగా, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టు సంబంధిత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి అయినా, హెయిర్ ట్రీట్మెంట్ గురించి చెప్పేటప్పుడు అయినా ఖచ్చితంగా ఈ విషయాలే పేర్కొంటూ ఉంటారు.  చాలా తొందరగా రిజల్ట్ ఉంటుందంటూ ఇచ్చే ప్రకటనలు,  ఖరీదైన ట్రీట్మెంట్లు,  ఖరీదైన హెయిర్ ఉత్పత్తులు.. ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా,  వేగంగా, బలంగా పెరగడంలో సహాయపడతాయని చెప్పే మాటలు అస్సలు నిజం కాదు.  జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా,  పొడవుగా మందంగా పెరగాలన్నా, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటం ముఖ్యం. జుట్టు కుదుళ్లు బలంగా లేకపోవడం వల్లనే జుట్టు పలుచ బడటం,  జుట్టు రాలడం, జుట్టు తెలుపు రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.  అయితే జుట్టు కుదుళ్లు బలంగా ఉండటంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఏంటో తెలుసుకుంటే..

విటమిన్-బి7..

జుట్టు పెరుగుదలకు ప్రమోట్ అయ్యే విటమిన్లలో బయోటిన్ ప్రముఖమైనది. బయోటిన్ ఉత్పత్తులంటూ చాలా ఉత్పత్తులు  మార్కెట్లో వస్తుంటాయి. బయోటిన్  శరీరానికి కెరాటిన్ తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇది  జుట్టును ఆరోగ్యంగా నిర్మించే ప్రోటీన్. ఇది తగినంతగా లేకపోతే జుట్టు కుదుళ్లు బలహీనంగా, పెళుసుగా మారి విరిగిపోవడం, రాలిపోవడం వంటివి  జరుగుతాయి.  

విటమిన్-డి..

బలమైన ఎముకల కోసం విటమిన్ డి చాలా అవసరం.  కాని  జుట్టు కుదుళ్లు వాస్తవానికి విటమిన్ డి గ్రాహకాలతో నిండి ఉంటాయట. విటమిన్-డి లోపం  ఉన్నప్పుడు   జుట్టు పెరుగుదల మందగిస్తుందట. కొన్ని అధ్యయనాలు విటమిన్ డి లోపం వల్ల  అలోపేసియా అరేటా వంటి సమస్యలకు కూడా కారణం అవుతుందట .

ఐరన్..

ఐరన్  జుట్టుకు విద్యుత్ సరఫరా లాంటిదని చెబుతారు. తగినంత ఐరవ్ లేకపోతే జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్  సరఫరా కష్టమవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా,  జుట్టు పలుచగా మారుతుంది. ఐరన్   లోపం వల్ల  రక్తహీనత సమస్య  మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా  పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం. రక్తం ఎక్కువగా పోవడం వంటివి జరుగుతాయి. అందుకే ఐరన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.


జింక్..

జింక్ దెబ్బతిన్న జుట్టు కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.  జుట్టు కుదుళ్ల చుట్టూ ఉన్న నూనె గ్రంథులు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. జింక్ లోపం వల్ల  జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండటం వంటివి జరుగుతాయి.

విటమిన్-ఇ..

విటమిన్ ఇ గొప్ప యాంటీఆక్సిడెంట్.  ఇది తల చర్మాన్ని, జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.  బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర,  అవోకాడోలలో విటమిన్-ఇ ఉంటుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్..

జుట్టు పొడిగా, పెళుసుగా ఉంటే అది ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల లోపమే. ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు  పోషణ ఇస్తాయి.  జుట్టును హైడ్రేట్ గా ఉంచుతాయి.  

విటమిన్-ఎ..

విటమిన్ ఎ   నెత్తిమీద చర్మ గ్రంథులలో ఉండే  సహజ కండీషనర్ అయిన సెబమ్ తయారీకి సహాయపడుతుంది. ఇది లోపిస్తే జుట్టు పొడిబారడం, దురద,  జుట్టు పెరుగుదల మందగించడం వవంటివి ఎదురవుతాయి. అయితే విటమిన్-ఎ ఎక్కువైతే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది.

                              *రూపశ్రీ.