హెయిర్ ను పాడు చేసే రోజువారీ అలవాట్లు ఇవి..!

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అబ్బాయిలు  కూడా జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అమ్మాయిలకే జుట్టు మీద కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా చాలా మందికి హెయిర్ అంత హెల్తీగా ఉండదు. దీనికి కారణం ఏంటో తెలియక చాలా మంది గందరగోళానికి లోనవుతుంటారు. కానీ కొన్ని రోజువారీ అలవాట్లు హెయిర్ ను చాలా డ్యామేజ్ చేస్తాయి.  ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే..

షాంపూ వాడకం..

తలస్నానం చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుందని అందరూ అనుకుంటారు.   నిజానికి  సల్ఫేట్లు, పారాబెన్లు,  ఫార్మాల్డిహైడ్ లేని pH-బ్యాలెన్స్డ్ షాంపూలను వాడినంతవరకు  వారానికి 4–5 సార్లు తలస్నానం చేసి జుట్టుకు కండిషనర్ వాడుతూ ఉంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది.

సెన్సిటివ్  ఫార్ములాలతో తయారు చేయబడిన  షాంపూలు జుట్టుకు ఉండే  సహజ మృదుత్వాన్ని కోల్పోకుండా, చెమట, నూనెలను శుభ్రం చేయడంతో పాటు బయటి వాతావరణం,  కాలుష్యం, ఎండ,  ముఖ్యంగా దుమ్ము, తేమ లేదా కలుషితమైన గాలి వంటి వాటి వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

కానీ చాలామంది కఠినమైన షాంపూలు వాడుతుంటారు.  ఇవి జుట్టును చాలా తొందరగా డల్ గా చేస్తాయి.  జుట్టుకు సహజంగా ఉండే మృదుత్వాన్ని నాశనం చేస్తాయి.  జుట్టు కుదుళ్లను కూడా బలహీనపరుస్తాయి. అందుకే షాంపూ సరిగా లేకపోతే జుట్టు పాడవుతుంది.

హెయిర్ స్టైలింగ్..

చాలామంది అమ్మాయిలకు జుట్టు స్టైల్  గా ఉండాలంటే చాలా ఇష్టం. రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు లేదా కర్లింగ్ వాండ్స్ వంటివి వాడతారు.  వేడి మీద ఉపయోగించే ఈ పరికరాల కారణంగా జుట్టు బలహీనపడి క్రమంగా పెళుసుగా మారుతుంది.

హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడాల్సి వస్తే చాలా తక్కువగా ఉపయోగించడం,  వాటిని ఉపయోగించే ముందు జుట్టు మీద హీట్ ప్రొటక్షన్ స్ప్రే ఉపయోగించడం చాలా ముఖ్యం.

టైట్ హెయిర్ స్టైల్స్..

జుట్టును గట్టిగా లాగడం,  గట్టిగా టై చేయడం, ఎప్పుడూ పోనీటెయిల్ తరహా హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల జుట్టు మూలాలపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ట్రాక్షన్ అలోపేసియా అంటారు.

జుట్టును పైకి కట్టుకోవడం, గట్టిగా బిగించడం, మరీ ముఖ్యంగా రాత్రి పడుకొనేటప్పుడు జుట్టును గట్టిగా బిగించిన హెయిర్ స్టైల్ తో నిద్రపోవడం వంటివి చేయకూడదు.

తలచర్మం..

జుట్టు గురించి ఆలోచించేవారు తల చర్మం గురించి కూడా ఆలోచించాలి. తలచర్మం పొడిగా,  పొరలుగా లేదా పేరుకుపోయినట్టు ఉంటే జుట్టు పెరుగదు. జుట్టు శుభ్రం చేసుకోవడం గురించి ఆలోచించినట్టే తలచర్మానికి హాని కలిగించని షాంపూలు ఎంచుకోవాలి.  ప్రతి రోజూ కొన్ని నిమిషాలపాటు చేతి వేళ్ల కొనలతో తలచర్మాన్ని సున్నితంగా మసాజ్ చేస్తుండాలి.  ఇది జుట్టు మూలాలకు బ్లడ్ సర్క్యులేషన్‌ ను పెంచుతుంది.

పోషణ, హైడ్రేషన్..

జుట్టు బలంగా పెరగడానికి ప్రోటీన్, ఐరన్, జింక్,  విటమిన్లతో సహా సరైన పోషకాహారం అవసరం. భోజనం స్కిప్ చేయడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం లేదా తగినంత నీరు త్రాగకపోవడం వంటి చెడు ఆహారపు అలవాట్లు జుట్టును నిస్తేజంగా,  బలహీనంగా చేస్తాయి.

 
తగినంత ప్రోటీన్ కలిగిన సమతుల్య భోజనం, ముఖ్యంగా గుడ్లు, చేపలు,  కాయధాన్యాలు తినాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి.

                         *రూపశ్రీ.