బాడీ లోషన్ సీక్రెట్స్.. పొడి చర్మం ఉన్నవారికి ఏ లోషన్ మంచిది...


శీతాకాలం ప్రారంభమైంది. ఇది చర్మానికి పరీక్షలు పెట్టే కాలం.  ముఖ్యంగా సున్నితమైన చర్మం,  పొడి చర్మం ఉన్నవారు చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పొడి చర్మం శీతాకాలంలో తేమ లేకపోవడం, సాగిన గుర్తులు, దురద,  పాచెస్ వంటి సమస్యలకు గురవుతుంది. సరైన లోషన్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించగలదు. అందువల్ల పొడి చర్మం ఉన్నవారు ఎక్కువసేపు చర్మాన్ని హైడ్రేట్ గా,  హెల్తీగా ఉండే లోషన్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.


మార్కెట్లో వివిధ రకాల లోషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రతి ఉత్పత్తి  అన్ని చర్మ రకాలకు   సరిపోదు. అందువల్ల బాడీ లోషన్  కొనడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు సరైన లోషన్ ఎందుకు ఎంచుకోవాలి? సరైన లోషన్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుంటే..


సరైన లోషన్ ఎందుకు  ఎంచుకోవాలి?


సరైన లోషన్ పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పొడి చర్మం ఉన్నవారు బాడీ లోషన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటే.. లోషన్ కొన్న తర్వాత ఎలాంటి అసంతృప్తికి లోను కాకుండా,  డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది.

బాడీ లోషన్..  తయారీ పదార్థాలు..

బాడీ లోషన్ కొనుగోలు చేసేటప్పుడు, దాని తయారీకి వాడిన  పదార్థాలను చెక్ చేయాలి.

ఉదాహరణకు..

హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, షియా బటర్, కోకో బటర్, సెరామైడ్లు,  బాదం నూనె వంటి హైడ్రేటింగ్ పదార్థాలు పొడి చర్మానికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బాడీ లోషన్‌లో ఈ పదార్థాలు ఏవైనా ఉంటే, దానిని ఉపయోగించడం వల్ల  చర్మం మృదువుగా ఉంటుంది.

ఫార్ములా..

పొడి చర్మం ఉన్నవారు ఎల్లప్పుడూ బాగా మాయిశ్చరైజింగ్ ఫార్ములాను ఎంచుకోవాలి. ఎందుకంటే హెవీ మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఉన్న బాడీ లోషన్ క్రీమీగా,  అంటుకోకుండా ఉంటుంది. పొడి చర్మానికి ఎక్కువ సేపు తేమను అందిస్తుంది. ఇది చర్మం జిడ్డుగా అనిపించకుండా నిరోధిస్తుంది.


లోషన్ లో ఇవి ఉండకూడదు..

పొడి చర్మం ఉన్నవారు ఆల్కహాల్ లేదా కఠినమైన రసాయనాలు కలిగిన బాడీ లోషన్లను వాడకూడదు. ఆల్కహాల్,  కఠినమైన రసాయనాలు  చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి.  చర్మ సమస్యను తగ్గించే బదులు మరింత తీవ్రతరం చేస్తాయని స్కిన్ కేర్ నిపుణులు అంటున్నారు.

సీజన్ ముఖ్యం..

 చర్మ రకాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు,  బాడీ లోషన్‌ను కొనుగోలు చేసే సీజన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఉదాహరణకు..

శీతాకాలంలో బాగా మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఎంచుకోవడం మంచిది.   వేసవిలో తేలికపాటి మాయిశ్చరైజింగ్ ఫార్ములా బాగుంటుంది. ఇది  చర్మం జిడ్డుగా అనిపించకుండా చేస్తుంది.

ఇది గమనించాలి..

పొడి చర్మం ఉన్నవారు బాడీ లోషన్ కొనే ముందు బాక్స్ మీద ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. చర్మం చాలా పొడిగా ఉంటే "డీప్ నూరిషింగ్" లేదా "ఇంటెన్స్ మాయిశ్చర్" అని రాసి ఉన్న లోషన్ కొనాలి. ఇది రాసిన లోషన్లు చర్మాన్ని ఎక్కువ కాలం మృదువుగా ఉంచుతాయి.

                            *రూపశ్రీ.