ఈ చీరలతో పెట్టుకుంటే ఫ్యాషన్ షేక్ అయిపోద్ది!

Publish Date:Dec 5, 2022

ఈ చీరలతో పెట్టుకుంటే ఫ్యాషన్ షేక్ అయిపోద్ది! ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ అమ్మాయిలే. ముఖానికి పెట్టుకునే బొట్టు బిళ్ళ నుండి వేసుకునే చెప్పుల వరకు దేంట్లోనూ తగ్గం అనేలా ఉంటాయి మహిళల ఫ్యాషన్ తీరూ తెన్నులు. అయితే ఈ ఫ్యాషన్ లో కూడా దుస్తులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అదిరేటి డ్రెస్సు మెవేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ ఆ మీకూ… దడ… అనే పాటే గుర్తొస్తుంది మహిళల ఫ్యాషన్ చూసినప్పుడు. అయితే ఈ దుస్తులలో కూడా మహిళలకు ఎన్ని రకాలు వచ్చినా చీర కట్టులో ఉన్నంత అందం, హుందాతనం మరెందులోనూ ఉండదు అంటే నమ్మండి.  అయితే చీరకట్టు పాత టేస్టు అవన్నీ ఎలాగబ్బా?? వంటి ఫీలింగ్ లో ఉన్నవాళ్లు ఒకటి తెలుసుకోవాలి. మన తెలుగువైపు మాత్రమే కాదు బాలీవుడ్ లో అదిరిపోయే అందాల భామలు అయిన దీపికా పదుకొనె నుండి కియారా అద్వానీ వరకు ఎంతోమంది చీరకట్టును ఎంచుకుని వహ్వా అనిపిస్తున్నారు. బోలెడు రకాల డిజైన్లలో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసే చీరల్లో ఆరు అద్భుతమైన శారీస్ మీకోసం… ఈ చీరకట్టులు సాంప్రదాయంగానూ.. ఫాషన్ తోనూ జతకలిసి భలే అనిపిస్తాయ్.  రఫ్లడ్ శారీ… ఈ రకమైన చీర సన్నని మడతలు కలిగి కాస్త రఫ్ గా కనిపిస్తుంది. కొద్దిపాటి మందం కూడా కలిగి ఉంటుంది. ఫాబ్రిక్ విషయంలో ఇది మందంగా, మృదువుగా ఉన్నా దీనికి ఉన్న చిన్న మడతల వల్ల రఫ్ గా అనిపిస్తుంది. పింక్ కలర్ నుండి లావెండర్ వరకు లేత రంగులు ఈ చీరలకు అద్భుతమైన లుక్ ఇస్తాయి. ఈ చలికాలంలో జరిగే పార్టీలు, ఫంక్షన్ లకు ఈ చీరలు మంచి ఫ్యాషన్ లుక్ ఇవ్వడంతో పాటు వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి. బెల్ట్ శారీస్.. బెల్ట్ శారీస్ ఇప్పట్లో చెప్పలేనంత ఫ్యాషన్. సాధారణ చీరలు తగినట్టుగా మంచి బెల్ట్ ఎంపిక చేసి వాటిని శారీ లుక్ కు జతచేస్తే బెల్ట్ శారీ రెడి అయినట్టే. క్లాసిక్ లుక్ ఇచ్చే ఈ బెల్ట్ శారీ ఫ్యాషన్ వీక్స్ నుండి పార్టీ ల వరకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పైపెచ్చు ఈ డ్రెస్సింగ్ స్టయిల్ లో వెళితే అందరినీ డామినేషన్ చేసేట్టు ఉంటుంది. అట్రాక్ట్ చేస్తుంది. మిర్రర్ వర్క్ శారీస్.. మిర్రర్ వర్క్ అనేది కేవలం ఒక ఫాబ్రిక్ కు మాత్రమే సెట్ అయ్యే అంశం కాదు. కాటన్ నుండి, షిఫాన్, సిల్క్ వంటి ఫాబ్రిక్ లకు కూడా బెస్ట్ గా నప్పుతుంది. పైగా ఈ మిర్రర్ వర్క్ కోసం ఉపయోగించే దారాలు కూడా గోల్డ్, సిల్వర్ ఇతర రంగులతో చాలా ఆకర్షణగా ఉంటాయి. ట్రెడిషల్ నుండి పార్టీస్ వరకు ప్రతి ఈవెంట్ లో అట్రాక్షన్ గా ఈ రకమైన డిజైన్ కలిగిన శారీస్ ఆకర్షణగా నిలుస్తాయి. చూపు తిప్పుకొనివ్వని చీరల మెరుపులతో పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ గా మీరు నిలవడం ఖాయం. సీక్వెన్ శారీస్.. ఈ రకమైన శారీస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. కాకపోతే వీటిని ధరించినప్పుడు వీటికి జతగా ధరించే జ్యువెలరీ, మేకప్ మొదలైనవి దీని అట్రాక్షన్ ను పెంచేలా వేసుకుంటే దీనికి మించినది ఇంకేది ఉండదు. అదే నప్పని జ్యువెలరీ, మేకప్ వేసుకుంటే మాత్రం దీనికి ఉన్న లుక్ మొత్తం పాడు చేసి పడేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే క్వీన్ తరహా లుక్ సొంతం చేసుకోవచ్చు. కేప్ శారీస్ ట్రెడిషనల్ శారీస్ కి కూడా ఫ్యాషన్ లుక్ ఇవ్వడం కేప్ డిజైన్లకు ఉన్న ప్రత్యేకత. ఇవి చీరలకు మెరుపును తీసుకొస్తాయ్. దీని వల్ల చీరలు ఎంతో ఆకర్షణగా కనబడతాయి.  ఈ చీరలకు తగ్గట్టు బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే అదిరిపోయే లుక్ సొంతమవుతుంది.  చికంకారి శారీస్.. సాధారణ శారీస్ ను కూడా స్పెషల్ గా చూపెట్టడం ఈ చికంకారి వర్క్ ప్రత్యేకత. దీనికోసం ఉపయోగించే డిజైన్లు  చాలా విలక్షణంగా ఉంటాయి. తెలుపు నుండి నలుపు వరకు పాస్టెల్ కలర్ నుండి విభిన్న రంగుల వరకు ఇవి విభిన్నతను కలిగి ఉంటాయి. వీటికి ఉపయోగించే ఎంబ్రాయిండరి టెక్నిక్ షాడో డిజైన్ అని పిలవబడుతుంది. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. జార్జిట్, షిఫాన్, కాటన్ సహా ఇంకా చాలా ఫాబ్రిక్ మీద ఈ రకమైన చీరలు అద్భుతమైన లుక్ సంతరించుకుంటాయి.  ఇవండీ అదిరిపోయే ఆరు రకాల చీరలు. ఇవన్నీ మార్కెట్ లలో లభ్యమయ్యేవే.. మీకు కాసింత ఫ్యాషన్ మీద అవగాహన ఉంటే రంగులు, బ్లౌజ్ ల డిజైన్ లలో వైవిధ్యం చూపిస్తే ఇంకా ఎక్కువ అట్రాక్షన్ తీసుకురావచ్చు. చీరకట్టులో కూడా సూపర్ అనిపించేలా రెడి అవ్వడమొక్కటే మీ వంతు ఇక..                                       ◆నిశ్శబ్ద.
[

Beauty

]

అమ్మాయిల అందాన్ని పెంచే రహస్య చిట్కాలు!

Publish Date:Dec 6, 2022

అమ్మాయిల అందాన్ని పెంచే రహస్య చిట్కాలు! పండు పండు పండు ఎర్ర పండు యాపిల్ దీని పేరు.. అని నాగార్జున పాడతాడు. యాపిల్ పిల్లా నీవెవరో.. ఐస్ క్రీమ్ చెలియా నీవెవరో అని ఇంకొక హీరో అందుకుంటాడు.. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ అని సంథింగ్ చేంజ్ చేస్తాడు రవితేజ.. మొత్తానికి ఫ్రూట్స్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఫ్రెష్ గా తాజాగా ఉన్నట్టు అమ్మాయిలు కూడా ఎంతో తాజాగా ఉండాలి. అప్పుడే వారిలో ఆరోగ్యం  కూడా బహుబాగుగా ఉంటుంది. అయితే అమ్మాయిలు ఎండిపోయిన పండ్లలా కనిపిస్తే ఏం బావుంటుంది. ఏడ్చినట్టు ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అందరూ కిందా మీదా పడిపోనక్కర్లేదు.. ఈ చలికాలం అధిరిపోయే గిఫ్ట్ తీసుకొచ్చింది అమ్మాయిలకు. ఎక్కడ చూసినా కమలా పండ్లు కనులకు విందు చేసున్నాయి, వీటి లోపలి పండు తినడానికి పనికొస్తే వీటి తొక్క భలే మంచి స్కిన్ ప్రొటక్షన్ ఐటమ్ గా పనికొస్తుంది. ఇంతకూ కమలా పండ్లతో బ్యూటీ పెంచుకోవడం ఎలా.. అంటే ఇదిగో ఇలా.. ఇంతకూ కమలా పండ్లను చర్మ ఆరోగ్యం కోసం ఎందుకు ఉపయోగిస్తారు అంటే.... కమలా పండ్లలో విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కారణంగా ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.  ఏముంటాయంటే... కమలా పండ్లలో కాల్షియం, విటమిన్ ఎ, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫైబర్, ఖనిజ లవణాలు అయిన పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇంతేకాకుండా థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్ వంటి ఇతర అంశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా సిట్రస్ అని పిలుచుకునే విటమిన్ సి పుష్కలంగా నిండి ఉన్న పండు ఇది. శరీరంలో తేమ స్థాయిలను పట్టి ఉంచుతుంది. చర్మాన్ని, చర్మం మీద మచ్చలు, మొటిమలు మొదలైన వాటిని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి కమలా పండు మహిళల అందాన్ని మెరిపిస్తుంది.  కమలా పండుతో అద్భుతమైన చిట్కాలు.. సాదారణంగా కమలాపండును తినేటప్పుడు తొక్కలు తీసి పడేస్తాం. అయితే ఆ తొక్కలను శుభ్రమైన ప్రదేశంలో ఎండబెట్టుకుని పొడిచేసుకోవచ్చు. ఇలా సహజంగా చేసుకునే పొడి మంచి ఫలితాలను ఇస్తుంది. కమలా పండు రసం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు మంచి చర్మ రక్షణ కారకంగా కూడా పనిచేస్తుంది. కమలా పండు రసానికి వేపాకు పొడి లేదా వేపాకు రసం జతచేయాలి, ఇందులో కాసింత శనగపిండి వేసుకుని పేస్ట్ లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటివి ఈ ప్యాక్ వల్ల  తొలగిపోతాయి. కమలా పండు తొక్కను పొడి చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ పొడి బెస్ట్ ట్యాన్ రిమూవర్ గా పనిచేస్తుంది. కమలా పండు తొక్కల పొడిని లేదా రసాన్ని స్నానం చేసేటపుడు నీటిలో కొద్దిగా వేసి ఆ నీటితో స్నానం చేస్తే చెమట వల్ల కలిగే చెడు వాసన పోతుంది. శరీరం మంచి రిలాక్స్ గా కూడా అనిపిస్తుంది. కమలా పండు తొక్కలను ఉడికించి, చల్లారిన తరువాత ఆ నీటిని ఒక స్ప్రే బాటల్ లో వేసుకుని ఫేస్ క్లెన్సర్ గా ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు, మృతకణాలు తొలగిపోయి ముఖ చర్మం యవ్వనంగా మారుతుంది.  ఇలా కమలా పండు తొక్కలు ఎంతగానో చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయి. ఇకపోతే వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే…                                        ◆నిశ్శబ్ద.
[

Health

]

గుమ్మడి విత్తనాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

Publish Date:Nov 24, 2022

గుమ్మడి విత్తనాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి అని చిన్నప్పుడు భలే ఆడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడేంటట అనే ప్రశ్న వద్దులెండి. గుమ్మడికాయ ఒక కాయగూర గానే కాకుండా భారతీయ హిందూ సాంప్రదాయంలో కూడా భాగం. క్రమక్రమంగా మాంసాహారం వైపు మళ్ళుతూ సాంప్రదాయ వంటకాలను కూరగాయలను మరుగున పడేస్తున్నారు నేటితరం వారు. ఇప్పుడు గుమ్మడికాయ స్తోత్రం ఎందుకట అనే ప్రశ్న గనుక మీరు వేస్తే దానికి సమాధానం గంపెడంత గుమ్మడి పొట్టలో మెరిసే విత్తనాల రాజసం గురించి చెప్పాలి. దోస, గుమ్మడి, పుచ్చకాయ వంటి విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ కాయలలో వేటిని కట్ చేసినా పండు తినేసి విత్తనాలు పడెస్తూ ఉండేవారు. ఏ కొద్దిమందో ఆ విత్తనాలను ఎండబెట్టుకుని టైంపాస్ గా తింటూ ఉంటారు.అయితే ప్రస్తుత కాలంలో వీటికి ప్రాధాన్యత పెరిగింది. దోస, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్, కర్భూజ వంటి విత్తనాలను ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకోవాలని పోషకాహార నిపుణులు మొత్తుకుని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు వీటిని ఎంత తీసుకుంటే అంత మంచిదని అంటున్నారు. ఇంతకూ గుమ్మడికాయ విత్తనాలు ఎందుకు తీసుకోవాలి వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటి వంటి విషయాలలోకి వెళితే.. విత్తనం చిన్నదే అయినా అందులో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. గుమ్మడి విత్తనాలలో పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్ సహా  ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. ఈ క్రొవ్వులు శరీరంలో అధిక శాతంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీని ఫలితంగా చాలా మందిని ఇబ్బంది పెట్టే టైప్-2 డయాబెటిస్ రాకుండా చేయడంలో గుమ్మడి విత్తనాలు సహాయపడతాయి.  ఇక గుమ్మడి విత్తనాలు నిద్రకు మంచి మందు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్, జింక్ అనే రెండూ కలసి సెరటోనిన్ గా మార్పు చెందుతుందట. ఈ సెరటోనిన్ కూడా మెలటోనిన్ అనే హార్మోన్ గా రూపాంతరం చెందుతుంది. మంచి నిధ్ర పట్టడానికి ఈ మెలటోనిన్ అనే హార్మోన్ చాలా సహాయపడుతుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు ఓ పది గుమ్మడి విత్తనాలు తిన్నా అద్బుతమైన నిద్ర సొంతం చేసుకోవచ్చు.  నిద్రకే కాదు అధిక బరువు ఉన్నవారికి కూడా ఈ గుమ్మడి విత్తనాలు వరమని  చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని కొద్దీ మొత్తంలో తీసుకున్న తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల ఎక్కువసేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండే వెసులుబాటు కలుగుతుంది. ఎలాగూ ఇందులో ప్రోటీన్లు, కెలోరీలు అధికంగా ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యకరమైన క్రొవ్వులు కాబట్టి, వీటిని తక్కువ మొత్తంలోనే తీసుకుంటాం కాబట్టి వీటి ద్వారా శరీరానికి అందే క్రొవ్వులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే… ఈ కారణంగా ఇది జీర్ణాశయంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో బెస్ట్ గా పని చేస్తుంది. అధిక బరువుకు దూరంగా కూడా ఉండవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్!! గుమ్మడి విత్తనాలు గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తాయి. వీటిలో ఉండే జింక్ గాయాలను, బాక్టీరియా, వైరస్ లతో సమర్థమవంతంగా పోరాడగలుగుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఇందులో ఉండే మాంగనీస్, విటమిన్ కె శరీరంలో ఎక్కడైనా  గాయాలు అయితే అవి నయం అవడంలో సహాయపడతాయి. ఉదయం టిఫిన్ తినే సమయంలో లేదంటే మధ్యాహ్నం లంచ్ చేయడానికి ముందు లేదంటే ఉదయం నుండి  అప్పుడప్పుడు బ్రేక్ సమయాల్లో గుమ్మడి గింజలను ఓ 10 నుండి 15 వరకు తిన్నా సరిపోతుంది. చెప్పలేనంత శక్తి, రోగనిరోధక శక్తి లభిస్తాయి.  కురులకోసం.. చాలామంది ఇప్పట్లో గుమ్మడి విత్తనాలను వాడేది కేవలం జుట్టు సంరక్షణ కోసమే. జుట్టు పెరుగుగుదలకు  తోడ్పడే కుకుర్ బిటాసిన్, అమినో యాసిడ్స్ గుమ్మడి విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ, కేరోటినాయిడ్లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. కొల్లాజెన్ తయారవడానికి దోహదం చేసి జుట్టు, చర్మం, గోర్లు  ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదపడుతుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇవీ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.                                       ◆నిశ్శబ్ద.

Turmeric Cure For Allergies

Publish Date:Sep 6, 2016

తీపి దగ్గర తడబడుతున్నారా?

Publish Date:Dec 1, 2022

తీపి దగ్గర తడబడుతున్నారా? అమ్మాయిలకు స్వీట్స్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఇంకా తీపి పదార్థాలు అంటే చెప్పలేనంత ఇష్టం. మరీ ముఖ్యంగా బయటకు ఎక్కడికైనా వెళితే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుక చేసుకుంటే తీపి పదార్థాల వల్ల కలిగే ఇబ్బందుల గురించి మనసులో ఒకవైపు భయం ఉన్నా వాటిని వదల్లేక తినేస్తుంటారు.  అయితే ఇలా తీపి పదార్థాలను తినడం అనేది సాధారణమైన అలవాటు కాదని. దీని వెనుక కారణం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తీపి పదార్థాలు తినాలని అనిపించడం వెనుక కారణం అనే మాట వినగానే చాలామంది షాక్ కు గురవుతారు కచ్చితంగా. అయితే దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమి లేదు. తీపి పదార్థాలు తినాలని అనిపించడానికి గల కారణాలు తెలుసుకుంటే తీపి వల్ల కలిగే అన్ని రకాల సమస్యలనూ పరిష్కరించుకోవచ్చు. తీపి తినాలని అనిపించడానికి కారణాలు!! ◆ ఒత్తిడికి లోనవడం తీపి తినడానికి కారణం అవుతుంది అనే మాట ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ ఇది నిజమని తెలిసింది. ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగానే శరీరానికి నిస్సత్తువ ఆవరించినట్టు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తెలియకుండానే ఏదైనా తీపి తినాలని అనిపిస్తుంది. అలా అనిపించగానే మహిళలు ఇంట్లోనూ, బయట పనిచేసేచోటా తీపి కోసం చాక్లెట్ ల మీదా బయట అమ్మే తీపి పదార్థాల మీద ఆధారపడతారు. ◆ చాలామంది మహిళలను వేధించే సమస్యలలో నిద్రలేమి ముఖ్యమైనది. నిద్రలేమి ఉన్నవారికి శరీరంలో కలిగే హార్మోన్స్ ప్రభావం వలన తీపి తినాలని అనిపిస్తుంది. ◆ అలసట అనేది మనిషిలో అంతర్లీనంగా భాగమైపోయి కనిపించే సమస్య. చాలామంది అలసటను గురైనప్పుడు చాక్లెట్ నోట్లో వేసుకోగానే ఎనర్జీ వచ్చినట్టు ఫీలవతారు. ఆ కారణంతో చాక్లెట్ లకు స్వీట్ లకు అలవాటు పడితే వాటికి ఆడిక్ట్ అయిపోతారు. ◆ శారీరక శ్రమ లేనివాళ్ళలో స్వీట్లంటే ఎక్కువ ఇష్టం ఉంటుందట. శరీరంలో ఏర్పడ్డ మార్పులు దీనికి కారణమవుతాయి. శారీరక శ్రమ లేనప్పుడు సహజంగానే మనుషులు మహా బద్ధకంగా కనిపిస్తుంటారు. వారికి స్వీట్లు, చాక్లెట్లు అంటే చెప్పలేని మక్కువ ఏర్పడుతుంది. ◆ శరీరంలో తగినంత నీతి శాతం లేకపోయినప్పుడు కూడా తీపి మీదకు మనసు మల్లుతుందట. బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు తీపి తినాలని అనిపించినా సందర్భాలు గుర్తుచేసుకుంటే ఇది నిజమేనని అనిపిస్తుంది. నోరు తడి ఆరిపోవడం తీపి తినాలని అనిపించడం గమనించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టాలి ఇలా…. తీపి తినాలని అనిపించినప్పుడు ఎక్కువ చెక్కెరలు కలిగిన పదార్థాలను టచ్ చేయకూడదు. తీపిని కంట్రోల్ లో పెట్టాలంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి. ◆ తీపి తినాలని అనిపించినప్పుడు చాక్లెట్ లు తినడం చాలామంది అలవాటు.  డార్క్ చాక్లెట్ లు పెద్ద పెద్దవి కొనుక్కుని లాగిస్తారు. అలా చేస్తే చాలా మొత్తంలో కేలరీలు పొట్టలోకి చాలా సులువుగా వెళ్లిపోతాయి. పైపెచ్చు అంత పెద్ద చాక్లెట్ లు ప్రతిసారి కొనడం అంటే కష్టమే. అందుకే చిన్న చిన్న చాక్లెట్  లేదా పెద్ద చాక్లెట్ లో చిన్న ముక్కలు ఒక రెండు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కాసింత ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ◆ తీపి అంటే స్వీట్లు, చాక్లెట్లు మాత్రమే కాదు. తీపిని ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి. చిలగడ దుంప, స్వీట్ కార్న్ మొదలైన వాటిలో తీపిదనం బానే ఉంది. కాబట్టి తీపి తినాలని అనిపించినప్పుడు వాటిని తీసుకోవచ్చు. ◆ తీపికి కేరాఫ్ అడ్రస్ గా డ్రై ఫ్రూట్స్ ని పేర్కొనవచ్చు. కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ మొదలైన ఎండు ఫలాలలో తీపిదనం ఎక్కువ కాబట్టి తీసుకోవచ్చు. ◆ అన్నిటికంటే ఉత్తమమైనవి ఆరోగ్యమైనవి సహజమైన పండ్లు. అరటి, బొప్పాయి, దానిమ్మ, ఆరెంజ్, సపోటా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండు తీపిదనాన్ని నింపుకున్నదే. కాబట్టి తీపి కోసం మనసు కొట్టుకుంటున్నప్పుడు హాయిగా పండ్లను తీసుకోవచ్చు. ◆ తీపికి మరొక ఆప్షన్ తేనె, బెల్లం. తీపి తినాలని అనిపించినప్పుడు టీ స్పూన్ తేనె లేదా ఓ ముక్క బెల్లం నోట్లో వేసుకుంటే మంచిది. అమ్మో తీపి తినాలని అనిపిస్తుంది. తింటే లావైపోతాం. అనే సందేహాలు పెట్టుకోకుండా పైన చెప్పుకున్న ప్రత్యామ్నాయాలు ఫాలో అయితే సమస్యే ఉండదు.                                     ◆నిశ్శబ్ద.
[

Yoga

]

యోగమంత ఆహారం!

Publish Date:Nov 26, 2022

యోగమంత ఆహారం! ప్రస్తుత కాలంలో పాశ్చాత్య దేశాలలో కూడా ఆదరణ పొందుతున్న గొప్ప ఆధ్యాత్మిక మార్గం యోగ. భారతీయ ప్రాచీన మహర్షుల చేత అందించబడిన గొప్ప మార్గమిది. యోగ అనేది శారీరక, మానసిక సమస్యలకు చక్కని మార్గం అయినందుకే అంత గొప్ప ఆదరణ పొందింది. అయితే యోగ కేవలం ఆసనాలతో మిళితమైనది మాత్రమే కాదు యోగాలో ఆహారం కూడా ఎంతో ముఖ్యమైనది. యోగ సాధన చేసేవారు ప్రత్యేక ఆహారం తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మహర్షులు ఆధ్యాత్మిక సాధకులు అవలంభించిన ఆహార మార్గాలు వేరు. ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించాలంటే కష్టమే. అయినప్పటికీ యోగ కు ముందు తీసుకోవలసిన సులువైన ఆహారం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని పాటించాలి. సాధారణంగా జిమ్ చేసేవారు డైట్ ని ఫాలో అవుతారు. వ్యాయామానికి ముందు ఇది, తరువాత ఇది, బ్రేక్స్ లో ఈ లిక్విడ్స్ లాంటి మెనూ ఒకటి తయారు చేసుకుంటారు. అయితే యోగా కు అంత పెద్ద మెనూ లేకపోయినా కొన్ని పదార్థాలు ఉన్నాయి. యోగా సాధనకు  ముందు తినేవాటిలో పండ్లే అగ్రభాగంలో ఉంటాయి. వాటిలో మొదటగా అవకాడో ముఖ్యమైనది. ఈ అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో కండరాలు, కణాల పనితీరుకు ఈ ఖనిజ లవణాలు ఎంతో అవసరం. అవకాడోలో ఉండే ఖనిజ లవణాలు కండరాలు, కణాల పనితీరును క్రమబద్ధంగా ఉండేలా చేస్తాయి. పైపెచ్చు ఇది జీర్ణమవడం కష్టతరమైన సమస్య ఏమి కాదు, చాలా సులువుగానే జీర్ణమైపోతుంది. అందువల్ల ఎలాంటి జీర్ణాశయ సమస్యలు దీనివల్ల రావు. ఇంకొక విషయం ఏమిటంటే అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా అవకాడో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.  ఇన్ని ప్రయోజనాలు కలిగిన అవకాడో తీసుకోవడం వల్ల యోగ సాధన చేయడానికి తగినట్టుగా శరీరం దృఢంగా, అనుకూలంగా మారుతుంది. సాధారణంగానే ప్రతి డైట్ మెనూ లో ఎలాంటి అబ్జక్షన్ లేకుండా అందరూ భాగం చేసేది అరటి పండు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే అరటిపండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ప్రతి డైట్ మెనూలో దీనికి ప్లేస్ తప్పనిసరిగా ఉంటోంది. అంతేకాదు అరటిపండు కడుపు ఉబ్బరంగా ఉన్నవారికి బెస్ట్ మెడిసిన్ గా పని చేస్తుంది. కండరాల నొప్పులతో బాధపడేవారు అరటిపండు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి పండును నేరుగా తినాలనే రూల్ లేదు. దీన్ని స్మూతీగానూ, ఇతర కాంబినేషన్ ఫ్రూట్స్ తో కలిపి సలాడ్ గానూ తీసుకోవచ్చు. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదు అంటారు. అయితే యోగాకు ముందు యాపిల్ తినడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. యాపిల్ లో క్షార గుణం ఉంటుంది. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లాలను శాంతపరచడంలో ఈ యాపిల్ బాగా పనిచేస్తుంది. పైపెచ్చు యాపిల్ లో నాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తగు మోతాదులో శక్తిని అప్పటికప్పుడు అందిస్తాయి. ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి యోగ సాధన చేసే సమయంలో ఆకలి, అతి దాహం వేయకుండా చేస్తుంది. పైగా యాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం చాలా మంచిదని అందరూ చెబుతారు. అయితే బాదం పప్పులను అలానే తీసుకోవాలని లేదు. యోగ సాధన చేయడానికి ముందు 4 నుండి 8 వరకు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ సొంతమవుతుంది. బాదం పప్పులలో విటమిన్ ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. పైన చెప్పుకున్న ఆహారపదార్థాలు యోగ చేయడానికి ముందు తీసుకుంటే అవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అలాగని అవి బరువుగా ఉండవు ఎంతో తేలికగా ఉంటాయి కాబట్టి యోగ సాధన సజావుగా సాగిపోతుంది..                                  ◆నిశ్శబ్ద.

Nutritional Facts Scale

Publish Date:Oct 15, 2013

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు?

Publish Date:Nov 20, 2022

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు? తల్లిదండ్రుల అవసరం లేకుండా పిల్లల్ని పెంచిన వారే ఉత్తమ తల్లిదండ్రులు. ప్రతి క్షణం పిల్లలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తల్లిదండ్రుల లక్షణం ఎలా ఉంటుందంటే…  మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టుకు కావలసిన నీరు, ఎరువులు సమకూరుస్తాం కానీ చెట్టుకు ఇలా ఎదుగు, అలా ఎదుగు అని ప్రతిక్షణం చెప్పం కదా! అలాగే పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇవ్వాలే గానీ బందీలు చేయరాదు. తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన వాటిని పిల్లల నుండి సాధించుకోవాలనే ఆలోచన పెంచుకొని వారి మీద వత్తిడి పెంచుతున్నారు. అటువంటి వారు మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లలు ఉత్తమంగా ఎదిగే వాతావరణం కల్పించేలా చేసే వారే మంచి తల్లిదండ్రులు. పిల్లల పెంపకం వ్యక్తిగతమైనదైనా తల్లిదండ్రులు ఆ పనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి సమాజానికి తమ సేవను సమర్ధవంతంగా నిర్వహించడానికి దీక్షతో కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పెద్దవారు. వారు చేసే పనులు గమనిస్తూ అనుసరిస్తారు. దానిని బట్టే వారి నడవడిక, ప్రవర్తన ఆధారపడతాయి. ప్రపంచంలో సర్వదోషాలకు ఈర్ష్య, స్వార్థాలు కారణం. ఇవి పెద్దల వలన పిల్లలపై ప్రభావం చూపి చెడును ప్రేరేపిస్తాయి. పిల్లలను హద్దులో పెట్టి బాగు చేసే ప్రయత్నం కన్నా పెద్దలలో మంచి మార్పు తెచ్చుకొని బాగుచేయడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలను భావి పౌరులుగా ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నారు. ఆ ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యతా లోపం చోటు చేసుకుంటే ఆ నష్టాన్ని సమాజం 60-70 సంవత్సరాల పాటు భరించవలసి వస్తుంది.  పిల్లలను ఎలా పెంచాలి? ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలను రాజకుమారుల్లా, అతి గారాభంగా పెంచాలి. ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించాలి. పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలాగా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకూ, దేశానికీ, కట్టుకున్న వారికీ సమస్య అవుతారు. చిన్నతనం నుంచీ మన తల్లి తండ్రి నుంచి మనం ఏమి కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి ఆ తప్పులే మళ్ళి మనం చేయకూడదు. పిల్లలు పెరిగి ప్రయోజకులుగా మారి, మనల్ని ఉద్దరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే స్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని తెలుసుకోవాలి. చిరుప్రాయంలో తల్లి ఇచ్చే శిక్షణా విధానం పిల్లల భవిష్యత్ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయంపై కొన్నేళ్ళ క్రితం ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో వెళ్ళడైన విషయం ఇది. "ఓ తల్లి పిల్లవాడికి నడక నేర్పే ప్రయత్నంలో పిల్లవాడికి కొంత దూరంలో నిలబడి తన వైపు రమ్మని ప్రోత్సహిస్తుంది. అప్పుడు పిల్లవాడు తల్లిని చేరుకోవాలని ఆశతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో పిల్లవాడు అదుపుతప్పి పడిపోయి, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తల్లి పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి ఓదారుస్తూ, చీ పాడునేల! నీవల్లే మా పిల్లాడికి దెబ్బలు తగిలాయంటూనే నేలను కొట్టింది. అప్పుడు పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. ఇదే విధంగా మరో తల్లి తన పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు, ఆ పిల్లవాడు తల్లి వైపు నడుస్తూ ఉండగా పడిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడి దగ్గరకు వెళ్ళకుండా దూరం నుండే 'లే నాయనా! లే లేచిరా!' అంటూ ఉత్సాహపరిచింది. ఆ పిల్లవాడు మెల్లగా లేచి నడుచుకుంటూ తల్లిని చేరుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయిన తరువాత వారి స్వభావాన్ని పరిశీలిస్తే తేలిందేమిటి. మొదటి పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలకు, అపజయాలకు బయట పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులే కారణమని నిందించే స్వభావం కలిగిన వాడయ్యాడు. రెండవ పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలు, అపజయాలను ఎదుర్కోగల మనోబల సంపన్నుడయ్యాడు. ఆలోచనలు మనం చేసే పనుల యొక్క సున్నిత రూపాలు. అవి మెదడులో చిన్న విద్యుత్తరంగాలుగా జీవం పోసుకొని, చుట్టూ ఉండే గాలిలాగ, పీల్చుకొనే ఊపిరిలాగ మనకు తెలియకుండానే మన బాహ్యమనోపరికరాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  ముఖ్యంగా పిల్లల పెంపక బాధ్యత స్త్రీల మీదే ఆధారపడి వుంటుంది.                                  ◆నిశ్శబ్ద.

మహిళలూ ఇది సబబేనా?

Publish Date:Dec 3, 2022

మహిళలూ ఇది సబబేనా? సాధారణంగా ఆడపిల్లల జీవితంలో ఓ దశ దాటిన తరువాత  ఎంతో నెమ్మదితనం చోటుచేసుకుంటుంది. రజస్వల కావడం అనే విషయం జరరగానే ప్రతి ఆడపిల్లా ఇంటి వాళ్లతో నెమ్మదిగా ఉండు అనే మాటలను తప్పనిసరిగా ఫేస్ చేస్తుంది. అయితే వాళ్లు మంచికే చెబుతారు. కానీ ఇప్పటికాలం మహిళల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నెలసరి. నెలసరి సరిగా రాకపోవడం అనే సమస్య మహిళల జనాభాలో సగానికి పైగా ఎదుర్కొంటోంది. సమస్య రాగానే డాక్టర్ల కన్సల్టేషన్ లు వారు చెప్పే మందులు ఇదే 90శాతం మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ ఇలా మందులూ మాకులూ వాడటానికి అలవాటుపడిపోవడమే కానీ అసలు సమస్య ఏంటి ఎందుకిలా అవుతోంది నేను చేస్తున్న పొరపాటు ఏంటి వంటి ప్రశ్నలు ఎప్పుడైనా వేసుకున్నారా??   మీరే గనుక ఎందుకిలా అనే ప్రశ్నలు వేసుకుంటే మీరు చేస్తున్న పొరపాట్ల మీద  మీకే ఓ ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఇంతకూ ఆ ప్రశ్నల వైపు వెళ్లడం ఎలాగో తెలుసా??  ఇదిగో ఇలా… ఇలా చేస్తున్నారా??  చాలా మందిలో అమ్మాయి అంటే ఇదిగో ఇలా ఉండాలి అని ఒక ఫిక్సషన్ ఉంది. సన్నగా, నాజూగ్గా ఉండాలి. చాలా తక్కువగా తినాలి. ఎంత సుకుమారంగా కనిపిస్తే అమ్మయిలు అంత బాగుంటారు అనే ఫీల్ ఉంటుంది. ఫలితంగా అమ్మాయిలలో సహజంగానే పోషకార లోపం, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కొందరు అలా ఉంటే మరికొందరు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. కేవలం రుచి మీద ఇష్టం పెట్టుకుని ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాటిని బాగా తినేసేవాళ్ళు విపరీతంగా లావు పెరిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే చిక్కు ఏమిటంటే… అతిగా తినడం, అసలు తినకపోవడం రెండూ హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మహిళల్లో నెలసరిలో అసమతుల్యత చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆహారం అనారోగ్యానికి కారణం అవ్వకుండా చూసుకోవాలి. ఏమి తింటున్నాం?? అనే ప్రశ్నను సంధించుకోవాలి. ఒక్కోసారి ఒక్కోలా… ఎందుకూ?? ఆడపిల్లలు రజస్వల అవ్వగానే అటు ఇటు తిరగొద్దు అనడంతో శారీరక వ్యాయామం అనేది తగ్గుతోంది. దానికి తగ్గట్టు చదువు గోలలో పడి ర్యాంకుల వేటలో మునిగిపోయి సరిగా తినీ తినక శారీరకంగా బలహీనంగా ఉండేవాళ్ళు కొందరు అయితే ఒత్తిడి వల్ల అతిగా తిని చిన్న వయసులోనే ఊబకాయం సమస్యను తెచ్చిపెట్టుకునేవాళ్ళు కొందరు. ఏ చదువుల దశ మొత్తం ఇలా సాగితే ఆ తరువాత ఉద్యోగాల టార్గెట్స్ లో తినడానికి సమయం ఉండక కొందరు బలహీనులు అయితే రెడి టూ ఈట్ ఫుడ్స్, ఆన్లైన్ ఆర్డర్స్, పిజ్జాలు ఇలాంటివి తిని అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కొందరు. దీని తరువాత మళ్ళీ పెళ్లి అయితే మరొక అదనపు బాధ్యత. మల్టి టాస్కింగ్ పెరిగి తీరిక దొరకని జీవితం అయిపోతుంది. మీకోసం మీరు ఏమి చేస్తున్నారు?? ఎలా ఉంటున్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నాకోసం నేను ఏమి చేసాను ఈరోజు అని ప్రతిరోజూ ప్రశ్నించుకోవాలి.  ముప్పేట దాడి… అంతా ఒత్తిడి!! సమస్యలు ఒకటికి మించి ఎక్కువగా ఉంటే… ఆహారం, ఉద్యోగం, ఇంటి బాధ్యతలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని కలిపి మహిళలకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత కలుగుతుందనేది అందరికీ తెలిసిందే… అందుకే ఒత్తిడి భూతం దరిచేరక ముందే దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాలి.  ఎలాంటి సమస్య అయినా మహిళల్లో నెలమీదకే టర్న్ అవుతుంది. నెలసరి సరిగా రాకపోవడం, అతిగా రతుస్రావం అవడం, పిసిఓయస్, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. ఈ సమస్యలు మహిళలను పూర్తిగా ఇబ్బంది పెట్టకముందే డాక్టర్లను కలవాలి. చాలామంది సమస్య పెద్దది అయితే తప్ప డాక్టర్లను కలవరు. అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలి. ప్రశ్నించుకుంటే… సమాధానం వైపు ప్రయాణం మొదలవుతుంది…                                        ◆నిశ్శబ్ద.

TeluguOne Sankranthi Rangavalli Muggulu

Publish Date:Dec 20, 2015

TeluguOne Sankranthi Rangavalli Muggulu Muggulu or Kolam Designs Indian Telugu Culture,Special Chukkala Muggulu 2014, TeluguOne Muggulu

Pongal Muggulu

Publish Date:Jan 13, 2015

Melikala Muggulu Witn Dots

Publish Date:Jan 8, 2015