మైగ్రేన్ వేధిస్తోందా? ఈ ఆసనం వెయ్యండి చాలు!

మైగ్రేన్ వేధిస్తోందా? ఈ ఆసనం వెయ్యండి చాలు..! నేటికాలంలో  అనారోగ్యకరమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లోనే మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.   మైగ్రేన్ నొప్పి తలకు ఒక వైపున రెండు గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది. . విచారించే విషయం ఏమిటంటే.. మైగ్రేన్ కు ఎలాంటి మందు లేకపోవడం.  ఒకసారి మైగ్రేన్ వస్తే దానికదే తగ్గేవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కానీ మైగ్రేన్ తగ్గడానికి యోగా చక్కగా సహాయపడుతుంది.  మైగ్రేన్ ను తగ్గించుకోవడానికి ఏ ఆసనం వేయాలి? తెలుసుకుంటే.. శశాంకాసనం.. శశాంకాసన యోగా మనస్సును ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఒత్తిడిని, మానసిక అలసటను తగ్గించగలదు. ఈ యోగాసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. శశాంకాసనం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో ఈ ఆసనం ఎంతగానో సహాయపడుతుంది. ఎలా చేయాలి? మొదట వజ్రాసనంలో కూర్చోవాలి.  రెండు చేతులను తల పైకి ఎత్తి, లోతుగా శ్వాస తీసుకోవాలి.  శ్వాసను వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగాలి. ఇప్పుడు, రెండు చేతులను ముందుకు చాచి, నుదుటిని నేలకు తాకించడానికి ప్రయత్నించాలి.  శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా ఉంచుతూ సాధారణంగా శ్వాస తీసుకోవాలి. ఈ ఆసన భంగిమలో 20 నుండి 30 సెకన్ల పాటు ఉండాలి.  ఆ తరువాత తిరిగి ఇదే విధంగా కొనసాగించాలి. హస్తపాదాసనం..   హస్తపాదాసనం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ యోగాసనం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, దీనివల్ల తలనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.  ఎలా చేయాలి?   ఈ ఆసనం వేయడానికి, మొదట నిటారుగా నిలబడి  పాదాలను కలిపి ఉంచాలి. తరువాత లోతుగా శ్వాస తీసుకుని  చేతులను తల పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ, నడుము నుండి ముందుకు వంగి,  పాదాల పక్కన నేలపై అరచేతులను ఉంచాలి. మోకాళ్లను నిటారుగా ఉంచుతూ 20-30 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి. పైన చెప్పుకున్న రెండు ఆసనాలు వేస్తుంటే మైగ్రేన్ సమస్య ఉన్నవారికి చాలా చక్కని ఉపశమనం లభిస్తుంది.                                *రూపశ్రీ.

మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతమైన యోగా భంగిమలు.!

మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతమైన యోగా భంగిమలు!   మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగితే గుండె ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మనకు జబ్బు కూడా రాదు. వీటన్నింటికీ ఈ యోగా వ్యాయామాలు సహాయపడతాయి! రోజూ యోగా చేయడం వల్ల మన ఆయుష్షు పెరుగుతుంది. నెమ్మదిగా చేసే ఈ అభ్యాసం మన శరీరంలోని అన్ని భాగాలకు మేలు చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహించే పని యోగాభ్యాసం ద్వారా జరుగుతుంది. మన రక్త ప్రసరణను మెరుగుపరచడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. యోగా మ్యాట్‌పై పడుకోవడం,లోతైన శ్వాస తీసుకోవడం కూడా యోగాభ్యాసం... అలాంటి ఇతర ఆరోగ్యకరమైన అభ్యాసాలు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాంటి యోగాభ్యాసాల గురించి తెలుసుకుందాం... విపరితకరణి ఆసనం: దీన్ని పాదాలపై ఆచరించే యోగాభ్యాసం అంటారు. ఇందులో మన కాళ్ల నుంచి గుండెకు రక్తం చేరడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది గుండె కార్యాచరణను ప్రేరేపిస్తుంది. గోడ సహాయంతో కాళ్లను పైకి లేపడం ద్వారా ఈ యోగాభ్యాసం చేయవచ్చు. చతురంగ దండాసనం: ఈ యోగాభ్యాసంలో కూడా మన శరీరానికి, మెదడుకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ భంగిమలో శ్వాసపై దృష్టి సారించి కొంత సమయం గడపండి. దీనివల్ల శిరోజాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. భుజంగాసనం: ఇది మన వెన్ను, పొత్తికడుపులో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. మీ ఛాతీ ప్రాంతాన్ని విస్తరిస్తుంది.  గుండె నుండి మెరుగైన రక్త ప్రసరణను అనుమతిస్తుంది. ఈ యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మీరు మీ ఉదర కండరాలను గట్టిగా ఉంచాలి. మీ ఛాతీని నెమ్మదిగా పైకి ఎత్తాలి. సేతు బంధాసనం: మీరు యోగా చేయడానికి ముందు మీ తుంటి, ఛాతీని ఎత్తినప్పుడు, మీ గుండె, మెదడుకు మంచి మొత్తంలో రక్తం ప్రవహిస్తుంది. ఇది మీ మెదడు, గుండెకు ఆక్సిజన్‌ను అద్భుతంగా పెంచుతుంది. దీనినే సేతు బంధాసనం అంటారు. మీ పాదాలను నేలపై ఉంచి, మీ తుంటిని పైకెత్తి, ఈ స్థితిలో కొద్దిసేపు ఉండి, ఆపై సాధారణ స్థితికి రావాలి. పశ్చిమోత్తనాసనం: ఈ యోగాసనం మీ నడుము, కాళ్ళకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ యోగా చేస్తున్నప్పుడు కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించండి. ఈ సందర్భంలో, మీ వెనుక, తల నేరుగా ఉండాలి. ప్రారంభకులకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అప్పుడు అది సులభం అవుతుంది. వీరభద్రాసనం: వీరభద్రాసనం మీ కాళ్లు, తుంటికి మెరుగైన రక్త ప్రసరణలో సహాయపడుతుంది. ఇది యోగాభ్యాసం, ఇక్కడ మీరు మీ రెండు చేతులను చాచి, మీ చూపులు మీ ముందు చేతి వైపు ఉండాలి.  

పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఈ ఆసనాలు వేయండి!

పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఈ ఆసనాలు వేయండి! ఆడవారికి నెలసరి అనేది సాధారణం. ఒక వయసులో ఋతుచక్రం మొదలయ్యాక  ప్రతి నెలా ఈ సమస్యను ఎదుర్కోవాల్సింది. ఇది ఒక నెలతోనో, ఒక ఏడాదితోనో ముగిసేది కాదు. కొందరికి నెలసరి సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. మరికొందరిలో మాత్రం తీవ్రమైన రక్తస్రావం, కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు సహాయపడతాయి. ఆ ఆసనాలేంటో తెలుసుకుంటే.. బలాసనం.. బలాసనం వేయడం చాలా సులువు.  మోకాళ్లమీద  పాదాలకు పిరుదులు తగిలేలా కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అని అంటారు. ఇప్పుడు ముందుకు వంగి తలను నేలకు ఆనించాలి. చేతులు రెండూ పొడవుగా చాపాలి. ఈ స్థితిలో 10నిమిషాల సేపు ఉండవచ్చు. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడమే కాకుండా జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. మానసిక సమస్యలు, జీర్ణసమస్యలుంటే తగ్గుతాయి. నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. పశ్చిమోత్తానాసనం.. వెన్నెముకను వంచి చేసే ఆసనం కాబట్టి దీన్ని పశ్చిమోత్తనాసనం అని అంటారు. పద్మాసనంలో కూర్చుని పాదాలను ముందుకు చాపాలి. ఇప్పుడు తలను కిందకు వంచి మోకాళ్లకు తల తగిలేలా వంగాలి. ఈ ప్రయత్నంలో రెండు చేతులను ముందుకు చాపి పాదాలను అందుకోవాలి. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైపోతుంది. ఈ ఆసనం వెన్నెముకను బలపరుస్తుంది.  నెలసరి సమయంలో కలిగే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు  తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది. సీతాకోక చిలుక భంగిమ.. సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండటం వల్ల దీన్ని సీతాకోక చిలుక భంగిమ అని అంటారు.  పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లను ఎడంగా చేసి రెండు పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు చేత్తో రెండు పాదాలను పట్టుకుని మోకాళ్లను సీతాకోక రెక్కల్లా ఆడించాలి. దీని వల్ల యోని కండరాలు బలపడతాయి. యోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నెలసరి సమయంలో కడుపునొప్పి నుండి ఉపశనం లభిస్తుంది. శవాసనం.. శవాసనం సాధారణంగా యోగా లేదా వ్యాయామాలు చేసిన తరువాత శరీరం విశ్రాంతి తీసుకోవడానికి   వేస్తారు. అయితే మహిళలు తమ నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటే శరీరాన్ని రాలాక్స్ గా వదులుగా ఉంచి శవాసనం భంగిమలో ఉండాలి. కాళ్లు, చేతులు, శరీరంలో కండరాలు వదులుగా ఉండటం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇది కడుపునొప్పిని తగ్గిస్తుంది.                                                  *నిశ్ళబ్గ.

మోకాళ్ల నొప్పి తగ్గాలంటే ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి..!

మోకాళ్ల నొప్పి తగ్గాలంటే ఈ యోగాసనాలు ప్రాక్టీస్  చేయండి..! కీళ్ల నొప్పులు ఒకప్పుడు వయసు పై బడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ నేటికాలంలో 30 ఏళ్ల వయసు గల వారిలో కూడా కీళ్ల నొప్పుల సమస్య కనిపిస్తోంది. ఈ కీళ్ల నొప్పులే చాలామందిలో మోకాళ్ల నొప్పులుగా పరిగణిస్తారు.  చాలామంది కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం కోసం మందుల మీద ఆధారపడతారు. అయితే ఏ మందులు అయినా దీర్ఘకాలం వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.  అందుకే మోకాళ్ల నొప్పికి యోగా మంచి పరిష్కారం అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు, యోగా గురువులు.  క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తుంటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మంత్రించినట్టు మెల్లిగా తగ్గిపోతాయి.  ఇంతకీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి ఏ ఆసనాలు ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుంటే.. తాడాసనం.. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి, నిటారుగా నిలబడి రెండు చేతులను తల పైకి ఎత్తండి. మీ శరీరం మొత్తాన్ని సాగదీసి, 10-15 సెకన్ల పాటు అలాగే ఉండండి. తాడాసనం సాధన చేయడం వల్ల బాలెన్సింగ్,  మోకాళ్ల బలం మెరుగుపడతాయి. వజ్రాసనం.. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి, మీ మోకాళ్లపై కూర్చోండి. ఇప్పుడు మీ వీపును నిటారుగా ఉంచి, మీ మడమల మీద కూర్చోండి. ఈ ఆసనంలో కొన్ని క్షణాల పాటు ఉండండి. వజ్రాసనం సాధన చేయడం వల్ల కీళ్లలో పట్టుత్వం పెరుగుతుంది. భుజంగాసనం.. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి, మీ పొట్టపై పడుకుని, మీ చేతులతో మీ శరీర పై భాగాన్ని పైకి లేపండి. ఈ స్థితిలో కొన్ని క్షణాల పాటు ఉండండి. భుజంగాసనం కండరాల బలాన్ని పెంచుతుంది. సేతు బంధాసనం.. సేతుబంధాసనంలో శరీర భంగిమ వంతెనను పోలి ఉంటుంది. సాధన చేయడానికి మీ వీపుపై పడుకోండి. మీ మోకాళ్లను వంచి, తుంటిని పైకి లేపండి. సేతుబంధాసనం మోకాళ్లను,  తొడలను బలపరుస్తుంది. బాలాసనం.. బాలాసనం వేయడానికి, మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి, నుదుటిని నేలపై ఆనించండి. ఈ భంగిమ నొప్పి,  ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎప్పుడైనా డిప్రెషన్ గా లేదా కోపం, బావోద్వేగాలు ఎక్కువగా అనిపించినప్పుడు ఈ ఆసనంలో కొద్దిసేపు గడపడం వల్ల మనసు శాంతిస్తుంది.                                   *రూపశ్రీ.

మొదటి సారి యోగా మొదలుపెట్టేవారికి సులువైన ఆసనాలు!

మొదటి సారి యోగా మొదలుపెట్టేవారికి సులువైన ఆసనాలు!  యోగా ఒక ప్రాచీన భారతీయ సంప్రదాయం, ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. కానీ ఎవరైనా యోగాను కొత్తగా ప్రారంభించినప్పుడు, ఏ యోగాసనాలతో ప్రారంభించాలి,  సరైన అభ్యాస పద్ధతి ఏమిటి అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా అయినా సరే.. మెల్లిగా సులభతరం నుండి క్లిష్టమైన దిశగా వెళ్లాలి. అప్పుడే నేర్చుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా శరీరం యోగాకు బాగా అలవాటు పడుతుంది.   మొదట్లోనే కష్టమైన యోగా ఆసనాలు ప్రారంభిస్తే అది శరీరం మీద చాలా ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. శరీరం ఇబ్బంది పడకుండా యోగాసనాలు నేర్చుకోవడానికి, ప్రారంభంలో సులువైన యోగాసనాలు సాధన చేయాలి.  ఆ ఆసనాలు ఏంటో తెలుసుకుంటే.. తాడాసనం.. తాడాసనం వేయడానికి, పాదాలు కలిపి నిటారుగా నిలబడాలి.  చేతులను పక్కన ఉంచాలి.  ఛాతీని పైకి ఎత్తి, శరీరం మొత్తాన్ని సాగదీయాలి. తర్వాత మెడను నిటారుగా చాచి, గడ్డాన్ని నేలకు సమాంతరంగా ఉంచాలి. ఈ భంగిమలో 30 సెకన్ల నుండి 1 నిమిషం పాటు ఉండాలి. వజ్రాసనం.. వ్రజాసనం వేయడానికి మోకాళ్లపై కూర్చోవాలి.  తుంటిని మడమలపై ఆనించి, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ,  శ్వాసపై దృష్టి పెట్టండి. భుజంగాసనం.. భుజంగాసనం వేయడానికి  పొట్ట మీద పడుకోవాలి.  అరచేతులను  భుజాల కింద ఉంచి,  శరీర బరువును చేతులకి మార్చాలి. ఇప్పుడు, శ్వాస తీసుకుంటూ  ఛాతీని పైకి ఎత్తాలి.   ఆ ఆసనంలో 30 సెకెన్ల పాటు లేదా 1 నుండి 10 నెంబర్లు లెక్క పెట్టేంత వరకు ఉండాలి. బాలాసనం.. బాలాసనం వేయడం చాలా సులవు.  ఈ ఆసనం వేయడానికి మోకాళ్లపై కూర్చోవాలి.  నుదుటిని నేలపై ఆనించి,  చేతులను ముందుకు లేదా ప్రక్కలకు చాచాలి.  శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి.  30 సెకెన్ల పాటు ఈ ఆసనంలో ఉండాలి.                             *రూపశ్రీ.

సోమాటిక్ యోగా అంటే ఏంటో తెలుసా!

సోమాటిక్ యోగా అంటే ఏంటో తెలుసా! భారతీయ ఋషులు అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదలో యోగా ప్రముఖమైనది. యోగా వల్ల  భారతీయ ఋషులు, ఆధ్యాత్మిక వేత్తలు వందల సంవత్సరాల పాటు బ్రతికారని చెబుతారు.  పురాణ గ్రంథాలలో కూడా యోగా ను ఒక ప్రసిద్ధ మార్గంగా,  గొప్ప జీవన మార్గంగా వర్ణించారు. అయితే యోగాలో సోమాటిక్ యోగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  సోమాటిక్ యోగా అంటే ఏంటి?  దీని వల్ల కలిగే ప్రయోజాలు ఏంటి?  తెలుసుకుంటే.. సోమాటిక్ యోగా.. సోమాటిక్ యోగా అనేది శరీరం బయటకు ఫిట్ గా ఉండటం కంటే కూడా శరీరంలో అంతర్గతంగా అంటే.. శరీరం లోపల ఎంత సౌకర్యంగా ఉంది అనే విషయం పై దృష్టి సారించే ప్రత్యేక యోగాభ్యాసం. సోమాటిక్ అనే పదం గ్రీకు పదం సోమ అనే పదం నుండి వచ్చింది.  గ్రీకులో సోమ అంటే జీవించే శరీరం అని అర్థం.   సాధారణ యోగాలో..  భంగిమలు ఉంటాయి.  వీటినే ఆసనాలు అంటారు.  సాధారణ యోగాలో ఈ ఆసనాలు సరిగ్గా వేయడం అనే విషయంపై,  ఆసనం పొజిషన్ పై దృష్టి పెడతారు.  అయితే సోమాటిక్ యోగాలో ఒక ఆసనం భంగిమలో ఉన్నప్పుడు శరీరం లోపల ఎలా అనుభూతి చెందుతోంది అనే విషయం పైన దృష్టి పెడతారు. సోమాటిక్ యోగాలో జరిగే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా,  చాలా సూక్ష్మంగా,  సున్నితమైన కదలికలు కలిగి ఉంటుంది.  దీని ప్రధాన ఉద్దేశ్యం మెదడు,  కండరాలను తిరిగి అనుసంధానించడం. ఒత్తిడి కారణంగా తెలియకుండానే  కొంతమందికి కండరాలు బిగుసుకుపోయి  ఉంటాయి.  ఇవి దీర్ఘకాలం పాటు నొప్పిని కలుగజేస్తూ ఉంటాయి.  ఈ నొప్పిని తగ్గించడంలో  సోమాటిక్ యోగా సహాయపడుతుంది. సోమాటిక్ యోగా శరీరంలో పేరుకుపోయిన గతం తాలుకూ గాయాలు,  ఉద్వేగాలు,  మానసిక ఒత్తిడి, మానసిక ఉద్రిక్తత వంటి సమస్యలను బయటకు పంపి మానసికంగా మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది. తద్వారా మానసిక సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఉండే పారాసిపథెటిక్ నాడీవ్యవస్థను సక్రియం చేయడంలో సోమాటిక్ యోగా సహాయపడుతుంది.  ఇది మనసుకు లోతుగా శాంతిని చేకూర్చుతుంది,  మంచి నిద్రకు సహాయపడుతుంది.                                            *రూపశ్రీ.

ఆఫీసులకు వెళ్లే మహిళలు చురుగ్గా ఉండాలంటే.. తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామాలు!

ఆఫీసులకు వెళ్లే మహిళలు చురుగ్గా ఉండాలంటే.. తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామాలు!  ఈ రోజుల్లో మహిళలు ఇంటి పనులు చేస్తూ, అటు ఆఫీసులకు వెళుతూ రెండు పడవల ప్రయాణం చేస్తుంటారు.  చాలా మంది మహిళలకు తమ కోసం తాము  సమయం కేటాయించుకోవడం  చాలా కష్టంగా ఫీలవుతుంటారు.  అయితే మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.  మరీ ముఖ్యంగా  ఆఫీసుకు వెళ్లే మహిళలు తప్పకుండా కొన్ని వ్యాయామాలను ప్రతిరోజూ చేయాలని మహిళా ఆరోగ్య సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  పని చేస్తున్నప్పుడు శరీరం అసౌకర్యంగా అనిపించడం,  కాళ్ల కీళ్లు,  ఎముకలు పట్టుకుపోయినట్టు బిగుతుగా మారడం వంటివి ఎదురవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామాలు చేయాలని అంటున్నారు.  మహిళలకు ఎంతగానో సహాయపడే ఆ వ్యాయామాలు ఏమిటో తెలుసుకుంటే.. షోల్డర్ రొటేషన్.. ఉద్యోగానికి వెళ్ళే మహిళలు ఇంట్లో కొంత సమయం కేటాయించి షోల్డర్ రొటేషన్ స్ట్రెచింగ్  వ్యాయామాలు చేయాలి. ఇవి భుజాలను బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి వెనుక కండరాలను కూడా బలోపేతం చేస్తాయి. హిప్ రొటేషన్.. హిప్ రొటేషన్ స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఇది  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  దీన్ని రోజూ చేస్తే,  శరీరం రోజంతా చురుకుగా ఉంటుంది. అలసిపోయినట్లు అనిపించదు యాంగిల్ రొటేషన్.. మీరు ఇంట్లో ప్రతిరోజూ  యాంగిల్ రొటేషన్ ను  కూడా సాధన చేయాలి. ఇది  శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. సాగదీయడం  చీలమండలలోని దృఢత్వాన్ని సడలించడానికి ,  శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సైడ్ బెండ్స్..  రోజూ సైడ్ బెండ్స్ కూడా చేయవచ్చు.  నడుము వైపులా సాగినట్లు అనిపిస్తుంది, వీపు మరింత నిటారుగా  మారుతుంది.  వెన్నెముకను బలోపేతం చేయడానికి  కూడా సైడ్ బెండ్స్  చేయవచ్చు.  డెస్క్ వద్ద  పనిచేసే వారికి ఇది చాలా మంచి వ్యాయామం. కాఫ్ రైజెస్..  కాఫ్ రైజెస్ కూడా రోజూ ప్రాక్టీస్  చేయవచ్చు. వీటిని చేయడం వల్ల  కండరాలు , చీలమండలు బలపడతాయి.  వీటిని వార్మప్ గా కూడా చేయవచ్చు.                                   *రూపశ్రీ.

కపాలభాతి ప్రాణాయామం.. ప్రతిరోజూ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

కపాలభాతి ప్రాణాయామం.. ప్రతిరోజూ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి! నేటికాలంలో యోగా, ప్రాణాయామం అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగంగా మారాయి.  కపాలభతి అనేది ఒక ప్రసిద్ధ ప్రాణాయామం, దీనిని చాలా మంది తమ దినచర్యలో చేర్చుకుంటారు. సరైన పద్ధతి,  జాగ్రత్తలతో సాధన చేస్తే,  కపాలభతి చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే  ఏదైనా యోగాభ్యాసం ప్రారంభించే ముందు ఆరోగ్య స్థితి ఆధారంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ కపాలభతి చేయడం మంచిదేనా?  దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవా? కపాలభాతి చేయడానికి సరైన పద్దతి ఏంటి? యోగా నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. కపాలభాతి అంటే.. కపలాభాతి అనేది ఒక రకమైన ప్రాణాయామం, దీనిలో శ్వాసను సాధారణంగా పీల్చుకోవడం ఆ తరువాత శ్వాసను చాలా వేగంగా వదలడం జరుగుతుంది. ఈ అభ్యాసం శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది,   జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ కపాలభాతి చేయవచ్చా.. యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం, కపలాభతి సరిగ్గా,  పరిమిత సమయం పాటు చేస్తే, అది ప్రతిరోజూ చేయడం మంచిదే.  అయితే, దీనిని మొదట్లో తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచాలి. రోజూ కపాలభాతి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.. కపలాభాతి చేయడం వల్ల ఉదర కండరాలు ఉత్తేజితమవుతాయి, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. కపలాభాతి క్రమం తప్పకుండా చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.. ఈ ప్రాణాయామం శరీరం నుండి విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.. కపలాభాతి మెదడుకు ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది, ఇది ఒత్తిడి,  ఆందోళనను తగ్గిస్తుంది.  చర్మాన్ని కాంతివంతం చేయడం.. క్రమం తప్పకుండా కపాలభాతి చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. కపలాభతి చేసేటప్పుడు జాగ్రత్తలు..  ఖాళీ కడుపుతో కపలాభతి చేయాలి. మొదట్లో 2-3 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. క్రమంగా సాధన చేస్తూ సమయాన్ని పెంచాలి. కపాలభాతి చేసినప్పుడు తల తిరుగుతున్నట్లు లేదా అసౌకర్యంగా అనిపిస్తే, వెంటనే ఆపాలి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా గర్భధారణ సమయాల్లో ఖచ్చితంగా వైద్యుడిని లేదా యోగా నిపుణుడిని సంప్రదించాలి.   కపాలభాతి చేయడానికి సరైన మార్గం.. నిటారుగా కూర్చోవాలి.  వెన్నెముకను నిటారుగా ఉంచాలి. లోతైన శ్వాస తీసుకొని పదే పదే గాలిని వదులుతూ కడుపుని లోపలికి లాగాలి. శ్వాస స్వయంచాలకంగా లోపలికి వెళ్లాలి.  దీన్ని   30-50 సార్లు రిపీట్  చేయాలి.                                          *రూపశ్రీ.

చేతుల కొవ్వు తగ్గాలంటే ఈ ఆసనాలు వెయ్యాల్సిందే!

చేతుల కొవ్వు తగ్గాలంటే ఈ ఆసనాలు వెయ్యాల్సిందే! శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో కొవ్వు చేరడం చాలా మంది విషయంలో కనిపిస్తున్న సమస్య. చాలామందికి పొట్ట, నడుము, పిరుదుల ప్రాంతాలలో కొవ్వు పేరుకుని ఉండటం గమనిస్తుంటాం. కానీ కొందరు మహిళల్లో చేతుల ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటుంది. ఈ కొవ్వు కరిగించడానికి కొందరు మార్కెట్లో దొరికే వివిధ ఉత్పత్తులు వాడటానికి ట్రై చేస్తారు. కానీ వీటి వల్ల ఫలితం పెద్దగా ఉండదు.  అయితే  యోగాసనాలు చేతుల కొవ్వు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఇంట్లోనే చేతుల కొవ్వు తగ్గించుకోవడానికి ఏ ఆసనాలు వేయాలో తెలుసుకుంటే.. భుజంగాసనం.. భుజంగాసనం ను కోబ్రా పోజ్ అని కూడా అంటారు. రోజూ భుజంగాసనం వేసేవారు చేతుల కొవ్వును క్రమంగా తగ్గించుకోవచ్చు.  భుజంగాసనం దృష్టిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.  ఏకాగ్రత పెరుగుతుంది.  మరీ ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ధనురాసనం.. చేతుల కొవ్వును తగ్గించడంలో మరొక ప్రభావవంతమైన ఆసనం ధనురాసనం.  దీన్ని బో పోజ్ అని అంటారు.  శరీరం విల్లులా వంచినట్టు ఉండే ఈ ఆసనం చేతుల కొవ్వును తగ్గించి చేతులకు, తొడలకు మంచి ఆకృతి ఇస్తుంది.  అంతేకాదు.. పొట్ట ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. చక్రాసనం.. చక్రాసనం నిలబడుకుని వేసే ఒక యోగాసనం.  చేతుల కొవ్వు తగ్గించడానికి భుజంగాసనంతో పాటు చక్రాసనం చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని వీల్ పోజ్ అని కూడా అంటారు.  చక్రాసనం కేవలం చేతుల కొవ్వు తగ్గించడమే కాకుంా వీపును కూడా బలోపేతం చేస్తుంది. పై మూడు ఆసనాలు ప్రతి రోజూ కొంత సమయం ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చేతులు, కాళ్లలో కొవ్వు తగ్గడం జరుగుతుంది. అంతేకాదు.. పొట్ట,  వీపు  కూడా బలపడతాయి.                                           *రూపశ్రీ.

డబుల్ చిన్ వచ్చిందా.. రోజూ 5 నిమిషాలు ఈ ఫేస్ యోగా చేస్తే సరి!

డబుల్ చిన్ వచ్చిందా.. రోజూ 5 నిమిషాలు ఈ ఫేస్ యోగా చేస్తే సరి! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ యవ్వనంగా,  టోన్డ్ బాడీని కోరుకుంటారు. జిమ్ కు వెళ్లి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో..   ముఖ దృఢత్వం కోసం అంతకంటో ఎక్కువ ప్రయత్నిస్తున్నారు.  ముఖంలో గీతలు,  ముడతలు,  ముఖంలో కొన్ని ప్రాంతాలు ఉబ్బినట్టు ఉండటం,  కొవ్వు పేరుకుని ఉండటం,  డబుల్ చిన్ రావడం వంటివి చూస్తూనే ఉంటాం.  వీటిని కవర్ చేయడానికి చాలామంది మేకప్ మీద ఆదారపడతారు.  మరికొందరు సర్జరీ వైపు వెళతారు.  కానీ  ముఖాన్ని సహజంగా టోన్ చేసి డబుల్ చిన్ ను తొలగించుకోవాలని అనుకుంటే అలాంటి వారికి పేస్ యోగా చాలా మంచి పరిష్కారం.  ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు,  బలోపేతం చేయడానికి ఫేస్ యోగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఫేస్ యోగా అంటే ఏమిటి? ఫేస్ యోగా అనేది ముఖ కండరాలను సాగదీసే, టోన్ చేసే,  విశ్రాంతినిచ్చే సహజమైన టెక్నిక్. యోగా మాదిరిగానే, ఇది 40 కి పైగా ముఖ కండరాలపై పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆక్సిజన్‌తో నింపుతుంది,  సహజమైన మెరుపును క్రియేట్ చేస్తుంది. డబుల్ చిన్ తగ్గించడంలో  ఎలా సహాయపడుతుంది.. దవడ రేఖ ముఖ నిర్మాణంలో కీలకమైన భాగం. ఇది దానికి పదునైన,  మంచి షేప్  ఉండేలా చేస్తుంది.  వృద్ధాప్యం లేదా పేలవమైన జీవనశైలి  డబుల్ చిన్ రావడానికి కారణం అవుతుంది. డబుల్ చిన్ తగ్గించే ఫేస్ యోగా.. చీక్ లిస్ట్.. నవ్వుతూ  వేళ్లతో మీ బుగ్గలను పైకి ఎత్తాలి. 10 సెకన్ల పాటు అలాగే ఉంచి, ఆపై వదిలేయాలి. 5 సార్లు దీన్ని రిపీట్ చేయాలి. ఇది బుగ్గలను టోన్ చేస్తుంది,  దవడ రేఖను క్లియర్ గా ఉంచుతుంది. ఫిష్ ఫేస్..  బుగ్గలను చేపలాంటి ముఖంలా కనిపించేలా లోపలికి  లాగాలి. 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి. 5 సార్లు రిపీట్  చేయాలి. ఇది  దవడ,  బుగ్గలకు వ్యాయామం చేస్తుంది. దవడ సాగతీత.. తలను పైకి వంచి దవడను విశ్రాంతిలో ఉంచాలి. తర్వాత దానిని క్రిందికి లాగాలి. 5 సెకన్ల పాటు అలాగే ఉంచాలి.  5 సార్లు రిపీట్  చేయాలి. ఇలా  సాగదీయడం వల్ల  డబుల్ చిన్ తగ్గించడానికి సహాయపడుతుంది. నాచురల్ క్లోజ్ స్మైల్..  పెదవులు మూసుకుని కొంచెం నవ్వాలి. వేళ్లతో సున్నితంగా ఒత్తిడి చేసి 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి. 5 సార్లు రిపీట్ చేయాలి.  ఇది కండరాలను బిగుతుగా చేస్తుంది. క్రమం తప్పకుండా చేయాలి.. ఈ ఫేస్ యోగా వ్యాయామాలను రోజూ కేవలం 5 నిమిషాలు చేస్తే, 2-3 వారాలలోపు  ముఖంలో కనిపించే మార్పులను  గమనించవచ్చు. దీని వల్ల దవడ రేఖ పదునుగా మారుతుంది. ముఖం గొంతులో కలిసిపోయినట్టు కాకుండా  పైకి కనిపిస్తుంది. పైగా యవ్వనంగా కూడా కనిపిస్తారు.                                     *రూపశ్రీ.

ఆడవాళ్లలో బలాన్ని, దీర్ఘాయువును పెంచే కాళ్ల వ్యాయామాలు!

ఆడవాళ్లలో బలాన్ని, దీర్ఘాయువును పెంచే కాళ్ల వ్యాయామాలు! ఆడవాళ్లు బలంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఆడవాళ్లు ఇంటి పనులన్నీ చేయడమే కాకుండా వారికి గర్భం దాల్చడం, ప్రసవం వంటివి ఎన్నో శరీరక కుదుపులు ఎదురవుతూ ఉంటాయి.  గర్బం, ప్రసవం తర్వాత మహిళల శరీరంలో శక్తి పుంజుకోవాలన్నా దానికి తగిన కసరత్తులు చేయాలి.  అయితే మహిళలలో బలాన్ని,  దీర్ఘాయువును పెంచే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాయామాలు ఏంటో తెలుసుకుంటే.. స్క్వాట్ లు.. కాళ్ల వ్యాయామానికి స్క్వాట్ లు చాలా బాగుంటాయి.  ఈ కోవకు చెందిన ఇతర వ్యాయామాలు కూడా బాగా సహాయపడతాయి. ఇది క్వాడ్ లు, హామ్ స్ట్రింగ్స్,  గ్లూట్స్ ను పెంచుతుంది.  మంచి బాలెన్స్ ను కెపాసిటీని పెంచుతుంది. డెడ్ లిఫ్ట్ లు.. బరువు ఎత్తడం వల్ల హామ్ స్ట్రింగ్స్, గూట్స్ తో పాటు నడుము కండరాలు కూడా బలోపేతం కావడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  ఇవి శరీర స్ట్రక్చర్ మెరుగుపరచడంలో సహాయపడతాయి. లంగ్స్.. కాళ్లలోని వివిధ కండరాలను బలోపేతం చేయడంలో లంగ్స్ బాగా సహాయపడతాయి.  ఇవి ఎక్కువకాలం బాలెన్స్ గా ఉండటానికి సహాయపడతాయి.    తూలిపోవడం,  బాలెన్స్ తప్పడం వంటి ప్రమాదాలు తగ్గిస్తాయి. లెగ్ ప్రెస్ లు.. లెగ్ ప్రెస్ లు కీళ్లపై అనవసరమైన ఒత్తిడి లేకుండా అన్ని మెయిన్ కాలు కండరాలను బలంగా చేయడంలో, కాళ్ల కండరాలను నియంత్రించడంలో సహాయపడతాయి. బెంచ్ లేదా ప్లాట్ స్టెప్-అప్ లు.. రోజువారీ కార్యకలాపాలకు  అవసరమైన కాళ్ల బలాన్ని,  చురుగ్గా కదలికలు ఉండటానికి బెంచ్ లేదా ప్లాట్ స్టెప్-అప్ లు బాగా సహాయపడతాయి. బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ లు.. కాళ్ల బలాన్ని విడివిడిగా కేవలం ఒక్కొక్క కాలు బలాన్ని పెంచడానికి బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ లు బాగా సహాయపడతాయి. కాఫ్ రైజెస్. లేత కండరాల ఓర్పు పెరగడానికి కాఫ్ రైజెస్ బాగా సహాయపడతాయి. మరీ ముఖ్యంగా చీల మండలు బాలెన్స్ గా ఉండటానికి,  గాయాలు కాకుండా ఉండటానికి సహాయపడతాయి.                                *రూపశ్రీ

మందంగా ఉన్న తొడలు సన్నగా మారాలంటే ఈ ఆసనాలు వేయండి..!

మందంగా ఉన్న తొడలు సన్నగా మారాలంటే ఈ ఆసనాలు వేయండి..! యోగా.. శరీరం ఫిట్ గా ఉండటానికి భారతీయ ఋషులు అందించిన గొప్ప మార్గం. ప్రతి  రోజూ యోగా చేసే వారి శరీరం చాలా ఫిట్ గా ఉంటుంది.  శరీరంలో ఏ ప్రాంతంలో అయినా కొవ్వు కరిగించాలన్నా,  ఏ భాగంలో అయినా నొప్పులు లాంటివి తగ్గి,  ఆ భాగం బలంగా మారాలన్నా కూడా యోగా బాగా పనిచేస్తుంది.  మహిళలు సాదారణంగా తమ తొడలు సన్నగా ఉండాలని కోరుకుంటారు.  కానీ చాలామంది మందంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. మందంగా ఉన్న తొడలను సన్నగా చేయడానికి కూడా యోగా బాగా సహాయపడుతుంది. తొడలు సన్నగా మారడానికి ఏ ఆసనాలు బాగా సహాయపడతాయో తెలుసుకుంటే.. వాటిని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.  అవేంటంటే.. సేతు బంధాసనం.. సేతు బంధాసనాన్ని వంతెన భంగిమ అని అంటారు. సేతు అంటే బ్రిడ్జ్.. దీన్నే వంతెన అని కూడా పిలుస్తారు.   ఎలా వేయాలి.. ఈ ఆసనాన్ని వేయాలంటే వెల్లికిలా పడుకోవాలి. మోకాళ్లను వంచి తుంటిని పైకి లేపాలి. ఇలా చేసినప్పుడు శరీరం వంతెన లాగా ఒక ఆకారానికి వస్తుంది. ఇది తొడలను టోన్ చేయడంలో సహాయపడుతుంది. నౌకాసనం.. నౌకాసనం ను బోట్ పోజ్ అని కూడా అంటారు.  ఇది పడవ ఆకారాన్ని పోలి ఉంటుంది.  అందుకే నౌకాసనం అని అంటారు. ఎలా చేయాలి.. నౌకాసనాన్ని వేయడానికి నేల మీద కూర్చోవాలి.  ఇప్పుడు పిరుదుల మీద బరువు ఉంచి చేతులను,  పాదాలను పైకి లేపాలి. ఇలా ఉన్నప్పుడు శరీరం V ఆకారంలోకి వస్తుంది. ఈ ఆసనం వల్ల తొడలు సన్నబడటమే కాకుండా.. మానసిక ఏకాగ్రత పెరుగుతుంది.  బలం పెరుగుతుంది, బాలెన్సింగ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. మలాసనం.. సాధారణంగా భారతీయుల జీవితంలో ముడి పడి ఉన్న ఆసనం ఇది.  బారతీయులు మలవిసర్జనకు కూర్చొన్నట్టు ఉంటుంది.  ఇలా కూర్చొన్నప్పుడు శరీరం ఒక దండ ఆకారంలో కనిపిస్తుంది. మలాసనం వేయడం వల్ల  తొడలు సన్నబడటమే కాకుండా తుంటి కదలిక బాగుంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.  వెన్నునొప్పికి ఈ ఆసనం చాలా మంచిది. వీరభద్రాసనం.. వీరభద్రాసనం సూర్యనమస్కారాలలో ఒక భాగంగా కనిపిస్తుంది. దీన్ని యోధుడి భంగిమగా పరిగణిస్తారు.  ఈ ఆసనంలోనే దైర్యం, స్థిరత్వం, బలం స్పష్టంగా వ్యక్తం అవుతాయి. ఈ ఆసనం వేస్తే శరీరం బలపడుతుంది.  భుజాలు, తొడలు, కాళ్లు బలపడతాయి.  తొడలు సన్నగా ఆవుతాయి. వృక్షాసనం.. వృక్షాసనం చెట్టు భంగిమను పోలి ఉంటుంది. ఎలా వేయాలి.. ఈ ఆసనం వేయడం సులభం.  ఒక కాలిపై నిలబడి,  మరొక కాలు మడిచి పాదాన్ని తొడ భాగం లోపల ఉంచాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ ఆసనం తొడలను సన్నగా చేయడమే కాకుండా  బాలెన్సింగ్ పెంచుతుంది,  ఏకాగ్రతను, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్కటాసనం.. ఉత్కటాసనం నే చైర్ పోజ్ అని కూడా అంటారు. ఉత్కట అంటే శక్తివంతమైనది లేదా తీవ్రమైనది అని అర్థం.  ఈ ఆసనం చాలా శక్తివంతమైనది. ఈ ఆసనం వేయడం చాలా సులభం.  ఈ ఆసనంలో మోకాళ్లను వంచి కుర్చీలో కూర్చున్నట్టుగా  ఉండాలి.  రెండు చేతులను కలిపి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇది తొడలను సన్నగా మార్చడమే కాకుండా,  కాళ్లు, తొడలు, పిరుదులను బలంగా మారుస్తాయి. నటరాజాసనం.. నటరాజాసనం యోగాలో చాలా ముఖ్యమైనది.  పరమేశ్వరుడి నృత్య భంగిమలలో ఇది ఒకటి. అందుకే దీన్ని నటరాజ ఆసనం అని అంటున్నారు.  దీనిని డాన్సర్ ఫోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం తొడలను సన్నబరచడమే కాకుండా ఏకాగ్రత పెంచుతుంది, కాళ్లు, తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. ఛాతీ, భుజాలు సాగదీయడం వల్ల ఆ కండరాలు కూడా బలపడతాయి.                                       *రూపశ్రీ.

అర్ధ భుజంగాసానం.. ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..!

అర్ధ భుజంగాసానం..  ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..! యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి.  ఒక్కో ఆసనం ఒక్కో రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది.  వీటిలో భుజంగాసనం, అర్ద భుజంగాసనం చాలా ముఖ్యమైనవి. అర్థభుజంగాసనాన్ని బేబీ కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఆసనాలు చాలా నార్మల్ గా అనిపిస్తాయి. కానీ రెగ్యులర్ గా వేస్తూ ఉంటే చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. శీతాకాలం లేదా వేసవిలో ఉదయం ఖాళీ కడుపుతో అర్ద భుజంగాసనం చేయడం వల్ల శరీర మూలాలు బలపడతాయి. అర్ధ భుజంగాసనాన్ని సరిగ్గా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాలు గడపడం వల్ల  వీపును నిఠారుగా చేస్తుంది,  శ్వాసను లోతుగా చేస్తుంది ,  మనస్సు తేలికవుతుంది. మహిళలు ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. అర్ద భుజంగాసనం ప్రయోజనాలు,, వెన్నెముక.. వెన్నెముకను బలంగా,  నిఠారుగా చేస్తుంది. వెన్ను సమస్యలను దూరం చేస్తుంది. నడుము.. నడుము నొప్పి , వెన్నునొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్నిరెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్ట కొవ్వు.. చాలా మంది పొట్ట కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ ఆసనం  పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ.. జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆసనం వేస్తుంటే జీర్ణవ్యవస్థ తిరిగి ఆరోగ్యంగా పనిచేస్తుంది.  తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఊపిరితిత్తులు.. ఈ ఆసనం వేసినప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్చ్వాసలు సక్రమంగా జరగడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం.. నేటికాలంలో చాలామంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే  ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. భుజాల ఆరోగ్యం.. ఈ ఆసనంలో భుజాలు,  మెడ సాగదీయం వల్ల భుజాలు, మెడ ప్రాంతాలలో  బిగుసుకుపోయినట్టు ఉండే ఫీలింగ్ తగ్గుతుంది. హార్మోన్స్.. అర్ద భుజంగాసనం హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సిట్టింగ్ వర్క్ కోసం.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఈ ఆసనం చాలా   ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.                                    *రూపశ్రీ.

PCOS సమస్యకు చెక్ పెట్టేందుకు సహాయపడే యోగా ఆసనాలు..!

PCOS సమస్యకు చెక్ పెట్టేందుకు సహాయపడే యోగా ఆసనాలు..! PCOS మహిళలను చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య.  భారతదేశంలో చాలామంది మహిళలు PCOS తో సఫర్ అవుతున్నాయి. చాలమంది మహిళలకు అసలు తమకు PCOS ఉన్నట్టు కూడా తెలియదు. పిసిఓయస్ సమస్య  ఉన్న స్త్రీలలో నెలసరి సరిగా లేకపోవడం,  బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, హార్మోన్ల అసమతుల్యత, గర్భం ధరించడంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతుంటాయి.  హార్మోన్ల అసమతుల్యత,  ఇన్సులిన్ నిరోధకత, ఒత్తిడి మొదలైనవి పిసిఓఎస్ కు కారణం అవుతాయి.  వీటన్నింటిని తగ్గించడంలో యోగా మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా పిసిఓఎస్ సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది, అండాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  జీవక్రియను పెంచుతుంది. పిసిఓఎస్ తగ్గడానికి సహాయపడే 5 యోగాసనాల గురించి తెలుసుకుంటే.. PCOS/PCOD తగ్గడంలో సహాయపడే ఆసనాలు.. భుజంగాసనం.. థైరాయిడ్,  అండాశయ పనితీరును తిరిగి మెరుగ్గా ఉండేలా చేస్తింది.  హార్మోన్లను బ్యాలెన్స్  చేస్తుంది. భుజంగాసనాన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్  చేయడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గుతుంది. సేతుబంధాసనం.. సేతుబంధాసనం  ఉద్రిక్తత,  వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని ప్రాక్టీస్  చేయడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. బాలసన.. బాలసన ప్రాక్టీస్ చేస్తే  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఒత్తిడి హార్మోన్ అయిన  కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. పశ్చిమోత్తాసనము.. పశ్చిమోత్తాసనం అండాశయాలు,  గర్భాశయ కండరాలను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఋతు చక్రం మెరుగుపడుతుంది. సుప్త బద్దకోణాసనం..  PCOSలో కటి ఆరోగ్యానికి  సుప్త బద్దకోణాసనం  అత్యంత ప్రభావవంతమైన ఆసనాలలో ఒకటి. ఇది చేయడం వల్ల పొత్తి కడుపు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  పొట్ట ఆరోగ్యానికి  ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది                            *రూపశ్రీ.

తొడలు మందంగా లావుగా ఉన్నాయా.. ఈ ఆసనాలు వేయండి చాలు!

తొడలు మందంగా లావుగా ఉన్నాయా.. ఈ ఆసనాలు వేయండి చాలు! నేటి కాలంలో, చాలా మంది బరువు పెరగడం,  ఊబకాయం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సరికాని ఆహారం,  చెడు జీవనశైలి కారణంగా, ఊబకాయం ఇప్పుడు చాలా మందిని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతోంది. . బిజీ జీవితం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా తొడల లావుగా ఉండటం వల్ల ఊబకాయం బయటకు  కనిపించడమే కాకుండా, నడకలో కూడా సమస్యలను కలిగిస్తుంది,  చూడటానికి కూడా వికారంగా కనిపిస్తుంది. ఇలాంటి వారి కోసం తొడల కొవ్వును తగ్గించి వాటిని బలంగా చేసే కొన్ని ప్రత్యేక యోగా ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలను రోజూ 15-20 నిమిషాలు చేస్తే తొడలతో సహా శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. ఆ ఆసనాలు ఏంటో తెలుసుకుంటే.. ఉత్కటాసనం బరువు పెరగడాన్ని నియంత్రించడానికి,  కొవ్వును తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన మార్గం. ఈ ఆసనంలో శరీర భంగిమ కుర్చీని పోలి ఉంటుంది. ఈ యోగాసనం తొడలు, పిరుదులు,  దిగువ నడుము కండరాలను ప్రభావితం చేస్తుంది.  కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం చేయాలంటే ముందుగా నిటారుగా నిలబడి రెండు చేతులను ముందుకు చాచి మోకాళ్లను వంచాలి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండాలి. త్రికోణాసనం.. ఈ ఆసనం శరీరంలోని పక్క భాగాలపై, ముఖ్యంగా నడుము, తొడలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీన్ని రోజూ ఆచరించడం వల్ల శరీరంలో  కొవ్వు తగ్గడమే కాకుండా, శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. ఈ ఆసనంలో రెండు కాళ్లు చాపాలి. ఇప్పుడు ఒక చేతిని కిందకు వంచి కాలు దగ్గరికి తీసుకువచ్చి మరో చేతిని పైకి లేపాలి. ఈ ఆసనం చేయడం వల్ల తొడల కొవ్వు తగ్గడమే కాకుండా శరీర సమతుల్యత, బలం పెరుగుతుంది. దీనిలో ఒక కాలును ముందుకు,  మరొక కాలును వెనుక ఉంచాలి.   ముందు కాలును మోకాళ్ల దగ్గర వంచాలి. రెండు చేతులను పైకి లేపి కాసేపు ఈ భంగిమలో ఉండాలి. భుజంగాసనం వెన్నెముకతో పాటు తొడలను ప్రభావితం చేస్తుంది. ఇది  రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది,  కొవ్వును తగ్గిస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు, కడుపుపై పడుకుని,  చేతులను భుజాల దగ్గర ఉంచి, తల,  ఛాతీని పైకి లేపాలి. శరీరాన్ని నాగుపాము లాంటి భంగిమలోకి తీసుకురావాలి. ఈ యోగాసనం కడుపు,  తొడలలో లోతైన సాగదీతను తెస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.  కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది. నేలపై కూర్చొని రెండు కాళ్లను ముందు చాపి ముందుకు వంగి రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి.                       *రూపశ్రీ.

యోగ చేయడానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

యోగ చేయడానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..     ప్రస్తుత కాలంలో పాశ్చాత్య దేశాలలో కూడా ఆదరణ పొందుతున్న గొప్ప ఆధ్యాత్మిక మార్గం యోగ. భారతీయ ప్రాచీన మహర్షుల చేత అందించబడిన గొప్ప మార్గమిది. యోగ అనేది శారీరక, మానసిక సమస్యలకు చక్కని మార్గం అయినందుకే అంత గొప్ప ఆదరణ పొందింది. అయితే యోగ కేవలం ఆసనాలతో మిళితమైనది మాత్రమే కాదు యోగాలో ఆహారం కూడా ఎంతో ముఖ్యమైనది. యోగ సాధన చేసేవారు ప్రత్యేక ఆహారం తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మహర్షులు ఆధ్యాత్మిక సాధకులు అవలంభించిన ఆహార మార్గాలు వేరు. ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించాలంటే కష్టమే. అయినప్పటికీ యోగ కు ముందు తీసుకోవలసిన సులువైన ఆహారం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని పాటించాలి. సాధారణంగా జిమ్ చేసేవారు డైట్ ని ఫాలో అవుతారు. వ్యాయామానికి ముందు ఇది, తరువాత ఇది, బ్రేక్స్ లో ఈ లిక్విడ్స్ లాంటి మెనూ ఒకటి తయారు చేసుకుంటారు. అయితే యోగా కు అంత పెద్ద మెనూ లేకపోయినా కొన్ని పదార్థాలు ఉన్నాయి. యోగా సాధనకు  ముందు తినేవాటిలో పండ్లే అగ్రభాగంలో ఉంటాయి. వాటిలో మొదటగా అవకాడో ముఖ్యమైనది. ఈ అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో కండరాలు, కణాల పనితీరుకు ఈ ఖనిజ లవణాలు ఎంతో అవసరం. అవకాడోలో ఉండే ఖనిజ లవణాలు కండరాలు, కణాల పనితీరును క్రమబద్ధంగా ఉండేలా చేస్తాయి. పైపెచ్చు ఇది జీర్ణమవడం కష్టతరమైన సమస్య ఏమి కాదు, చాలా సులువుగానే జీర్ణమైపోతుంది. అందువల్ల ఎలాంటి జీర్ణాశయ సమస్యలు దీనివల్ల రావు. ఇంకొక విషయం ఏమిటంటే అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా అవకాడో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.  ఇన్ని ప్రయోజనాలు కలిగిన అవకాడో తీసుకోవడం వల్ల యోగ సాధన చేయడానికి తగినట్టుగా శరీరం దృఢంగా, అనుకూలంగా మారుతుంది. సాధారణంగానే ప్రతి డైట్ మెనూ లో ఎలాంటి అబ్జక్షన్ లేకుండా అందరూ భాగం చేసేది అరటి పండు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే అరటిపండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ప్రతి డైట్ మెనూలో దీనికి ప్లేస్ తప్పనిసరిగా ఉంటోంది. అంతేకాదు అరటిపండు కడుపు ఉబ్బరంగా ఉన్నవారికి బెస్ట్ మెడిసిన్ గా పని చేస్తుంది. కండరాల నొప్పులతో బాధపడేవారు అరటిపండు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి పండును నేరుగా తినాలనే రూల్ లేదు. దీన్ని స్మూతీగానూ, ఇతర కాంబినేషన్ ఫ్రూట్స్ తో కలిపి సలాడ్ గానూ తీసుకోవచ్చు. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదు అంటారు. అయితే యోగాకు ముందు యాపిల్ తినడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. యాపిల్ లో క్షార గుణం ఉంటుంది. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లాలను శాంతపరచడంలో ఈ యాపిల్ బాగా పనిచేస్తుంది. పైపెచ్చు యాపిల్ లో నాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తగు మోతాదులో శక్తిని అప్పటికప్పుడు అందిస్తాయి. ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి యోగ సాధన చేసే సమయంలో ఆకలి, అతి దాహం వేయకుండా చేస్తుంది. పైగా యాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం చాలా మంచిదని అందరూ చెబుతారు. అయితే బాదం పప్పులను అలానే తీసుకోవాలని లేదు. యోగ సాధన చేయడానికి ముందు 4 నుండి 8 వరకు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ సొంతమవుతుంది. బాదం పప్పులలో విటమిన్ ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. పైన చెప్పుకున్న ఆహారపదార్థాలు యోగ చేయడానికి ముందు తీసుకుంటే అవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అలాగని అవి బరువుగా ఉండవు ఎంతో తేలికగా ఉంటాయి కాబట్టి యోగ సాధన సజావుగా సాగిపోతుంది..                                  ◆నిశ్శబ్ద.

యోగా లో జాగ్రత్తలు

యోగా లో జాగ్రత్తలు యోగ చేయడమన్నది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ యోగ వైపు మొగ్గు చూపుతున్నారు . యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా, అది చేసే ముందు కొన్ని విషయాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా యోగాసనాలు చేయడానికి నేలమీద టవల్ పరచి చేస్తుంటారు. అయితే టవల్ కన్నా సూపర్ మార్కెట్ లో దొరికే యోగా మేట్ వాడటం మంచిది అంటున్నారు యోగ నిపుణులు. యోగ చేసే గది లేదా ఆ ప్రదేశంలో ఎలాంటి  ఫర్నీచర్ లేకుండా చూసుకోవడం అవసరం. యోగ చేసే గది వాతావరణం మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాక ఆ గదిలోని ప్రశాంతతకు భంగం కలగకుండా కూడా చూసుకోవాలి. వారంలో రెండూ లేదా మూడు సార్లు అని కాకుండా ప్రతిరోజూ యోగా చేసే విధంగా మీ దినచర్యని మార్చుకోండి. అలా చేయడానికి వీలున్నప్పుడే యోగా మొదలుపెడితే  ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. యోగ చేయడం ఎవరికోసమో అన్నట్లు కాకుండా మీ కోసమే మీరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఆహారం తీసుకున్న రెండు గంటల తరవాత యోగ చేయడం మంచిది. యోగ చేసే ముందు చాక్లెట్ లు, కాఫీ, ఆల్కహాల్, ఉల్లిపాయ , పుల్లటి పండ్లు, స్పైసీ లేదా మసాల నిండిన ఆహారం , ఇంకా మాంసాహారం తీసుకోకూడదు.. యోగ చేస్తున్నంత కాలం తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. అందువల్ల అనుకున్న రీతిగా బరువుతగ్గడం, సౌందర్య పోషణ వంటి ఫలితాల్ని త్వరగా పొందగలుగుతారు . కొన్ని సందర్భాలలో మీ శరీరం యోగ చేయడానికి సహకరించకపోవచ్చు. అలాంటి  సందర్భాలలో మొండిగా యోగ చేయడానికి ప్రయత్నించక, విశ్రాంతి తీసుకోండి. యోగ చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో చేస్తేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు.  

గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల గర్భస్రావం జరుగుతుందా...

  గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల గర్భస్రావం జరుగుతుందా...   గర్భధారణ సమయంలో స్త్రీల మనస్సులలో అనేక రకాల భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమి చేయడం సురక్షితం,  ఏమి చేయకూడదు, ఏమి తినవచ్చు,  ఏమి తినకూడదు వంటి వాటి గురించి చాలా భయాలు ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణించడం సరైనదేనా? అదేవిధంగా, గర్భధారణ సమయంలో యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా?  లేదా యోగా చేస్తే మంచిదేనా అనే గందరగోళంలో కూడా ఉంచారు.   అదేవిధంగా కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో యోగా చేయడం గర్భస్రావానికి దారితీస్తుందా అని కూడా అయోమయానికి లోనవుతారు.  యోగా అనేది ఫిట్నెస్ కు  సంబంధించిన చర్య కాబట్టి ఈ విషయం పూర్తీగా తెలుసుకుంటే మంచిది. యోగా గురించి మహిళల విభిన్న భయాలు,  అపోహలను తొలగించడాని ప్రముఖ వైద్య నిపుణులు కొన్ని విషయాలను స్పష్టంగా తెలియజేశారు. మొదటి త్రైమాసికం.. గర్భధారణ మొదటి త్రైమాసికంలో (0 నుండి 13 వారాలు)  యోగా చేయడం సురక్షితమని వైద్యులు అంటున్నారు. అయితే ఇది సరైన టెక్నిక్‌తో, నిపుణుల పర్యవేక్షణలో,  కొన్ని ఆసనాలను మాత్రమే  చేయడం మంచిది. అలా కాకుండా సొంతంగా చేయడం చాలా ప్రమాదం. శ్వాస వ్యాయామాలు మేలు.. గర్భధారణ  సమయంలో మహిళలు సున్నితమైన,  బుద్ధిపూర్వక యోగాను అవలంబించవచ్చని డాక్టర్ చెబుతున్నారు, శ్వాస వ్యాయామాలు,  తేలికగా శరీరాన్ని  సాగతీసే  భంగిమలు శరీరానికి,  మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. ఆధారాలు.. సున్నితమైన,  తేలికైన యోగా సులభంగా గర్భస్రావం కలిగిస్తుందని నిరూపించడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవట.  వాస్తవానికి యోగా సరైన టెక్నిక్,  జాగ్రత్తతో చేస్తే, అది గర్భిణీ స్త్రీలకు సురక్షితంగా ఉండటమే కాకుండా నివారణగా కూడా ఉంటుంది. తీవ్ర వ్యాయామాలు.. గర్భధారణ ప్రారంభ దశలో మహిళల శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయని, దీని కారణంగా అలసట, తలతిరుగుడు లేదా వికారం వంటి ఫిర్యాదులు సర్వసాధారణమని  వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలను నివారించాలి, ఎందుకంటే ఇది శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామాలు, యోగా చేసే విషయంలో గర్భం దాల్చిన మహిళలు వైద్యుల సలహా లేకుండా ఏదీ చేయకూడదు.                                       *రూపశ్రీ.

యోగాతో స్ట్రెస్ ను తరిమికొట్టవచ్చు

యోగాతో స్ట్రెస్ ను తరిమికొట్టవచ్చు   స్ట్రెస్ అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. అబ్బో వత్తిడి, అయ్యో, నరాలు చిట్లిపోతున్నట్లు ఉన్నాయి.. స్ట్రెస్ ను తట్టుకోలేక పోతున్నాం అనే ఫిర్యాదులు అంతటా వినిపిస్తున్నాయి.ఎల్ కేజీ పిల్లలు మొదలు రిటైర్మెంట్ కి దగ్గరపడిన పెద్దల వరకూ కోట్లాదిమంది ఎదుర్కొంటున్న సమస్య స్ట్రెస్. ఎందుకింత స్ట్రెస్ అంటే మితిమీరిన పోటీ అనేది మొదటి సమాధానం. తర్వాత ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. ఏ కారణం చేత అయితేనేం నిజంగానే చాలా చాలామంది నరాలు చిట్లేంత వత్తిడికి గురవుతున్న మాట నిజం. మరి ఈ స్ట్రెస్ ను నివారించే మార్గాలు లేవా అంటే, తప్పకుండా ఉన్నాయి. పనిలో నైపుణ్యం సంపాదించడం ఒక మార్గం కాగా ప్రాణాయామం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరో దివ్యమైన మార్గం. రోజూ చేసే పనులకు తోడు మరేమైనా ఇతర పనులు చేయాల్సి వచ్చినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. ఓపిక తగ్గినప్పుడు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేకపొతే స్ట్రెస్ ఎక్కువౌతుంది. పోటీ ప్రపంచంలో టార్గెట్లు రీచ్ కాలేనప్పుడు మరింత వత్తిడి కలుగుతుంది. ఏ రకంగా అయితేనేం స్ట్రెస్ తో బాధపడుతున్నాం అని కంప్లైంట్ చేసేవారంతా రోజూ ఓ గంటసేపు బ్రీతింగ్ ఎక్సర్ సైజు  చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజు  వత్తిడిని ఎలా నియంత్రిస్తుంది, ఇవన్నీ వట్టి మాటలు అని కొందరు నమ్మరు. బ్రీతింగ్ ఎక్సర్ సైజు కల్పతరువు అని అర్ధం చేసుకోకపోగా ఎగతాళి చేస్తారు. ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప బ్రీతింగ్ ఎక్సర్ సైజు లోని గొప్పతనం అర్ధం కాదు. ఇంతకీ బ్రీతింగ్ ఎక్సర్ సైజు ఎలా చేయాలో చూద్దాం. ఉదయాన్నే  ప్రశాంత వాతావరణంలో తాజా గాలి వచ్చే ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. కుడిచేతి చూపుడు వేలితో ఒక నాసికారంద్రాన్ని మూసి ఉంచి, రెండో నాశికా రంధ్రంతో నిండా గాలి తీసుకోవాలి. మూసి ఉంచిన వేలిని తీసి ఆ రంధ్రం లోంచి పూర్తిగా శ్వాస వదలాలి. తర్వాత రెండో రంధ్రాన్ని మూసి మొదటిదానితో శ్వాస పూర్తిగా తీసుకోవాలి. ఇలా మార్చి మార్చి చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేసేటప్పుడు ఆలోచనలను సైతం నివారించే ప్రయత్నం చేయాలి. ఇది అంత తేలికేం కాదు. మనసు చాలా చంచలమైనది. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూనే ఉంటాయి. మనసు స్థిరంగా లేదని గ్రహించినప్పుడల్లా దాన్ని శ్వాస మీదికి మళ్ళించాలి. రోజులో ఓ గంటసేపు ఈ బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేయగలిగితే స్ట్రెస్ అనేది మన దరిదాపులకు రాదు. వీలు చిక్కితే, పొద్దున్న, సాయంత్రం రెండు గంటలు గనుక బ్రీతింగ్ ఎక్సర్ సైజు కు కేటాయించగలిగితే ఆరోగ్యం, ఆనందం మన సొంతమౌతాయి. రోజూ బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేయలేనివారు కనీసం బాగా స్ట్రెస్ ఫీలౌతున్నప్పుడు అయినా చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజు శారీరకంగా, మానసికంగా కూడా చెప్పలేనంత మేలు చేస్తుంది. స్ట్రెస్ నుండి బయటపడేస్తుంది. తలనొప్పులు, వికారం లాంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మానసిక జబ్బులను తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఒక్కోసారి  స్ట్రెస్ ఎక్కువై కర్తవ్యం బోధపడదు. మైండ్ బ్లాంక్ గా మారుతుంది. దిక్కుతోచనట్లు అయోమయంగా ఉంటుంది. విసుగు, అసహనం ఎక్కువౌతాయి. ఏ పనీ చేయలేని నిస్సహాయత చోటుచేసుకుంటుంది. అలాంటప్పుడు బ్రీతింగ్ ఎక్సర్ సైజు మంత్రంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బ్రీతింగ్ ఎక్సర్ సైజు ప్రాక్టీసు చేసేవారు ఎట్టి పరిస్థితిలో వత్తిడికి గురవ్వరు. ఎలాంటి సమస్యనయినా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. క్లిష్ట సమయాల్లో, స్ట్రెస్ ఫుల్ సిట్యుయేషన్ల లో కూడా సమర్ధవంతంగా పని చేయగల్గుతారు. అదీ, బ్రీతింగ్ ఎక్సర్ సైజు లేదా ప్రాణాయామం గొప్పతనం.  

అలసటను తీర్చే శవాసనం

అలసటను తీర్చే శవాసనం   ఆసనాల్లో మకుటాయమానం - శవాసనం యోగ సాధనలో శవాసనం (savasana)ఎంతో ముఖ్యమైంది. శవాసనాన్ని "మృతాసన" అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం అని అర్థం. మృతి చెందినప్పుడు ఎలా పడుకోబెడతామో శవాసనం లోనూ అలా పడుకుంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైన ఆసనం. అయితే దీనిపైన పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలోగాని, అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది. ఉదయం యోగాసనాలతో పాటు మాత్రమే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు, అలా చేయడం వలన మనస్సు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. మనస్సు .శాంతంగా వుంటుంది. ఈ ఆసన సమయంలో శరీరం అంతటా ప్రాణశక్తి తిరుగుతూ వున్నట్టుగా అనిపించడం ఈ ఆసనం యొక్క ప్రత్యేకత. శవాసనం వలన పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా సహజ సిద్ధమైంది కనుక మనస్సును, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకు వెళుతుంది. శరీరానికీ మనస్సుకూ విశ్రాంతి అవసరమైన సమయంలో శవాసనం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంద్ర స్థాయిలో శ్లోకాలు లేదా మనస్సుకు హాయిని గొలిపే పాటలు లేదా మాటలు వింటూ ఈ ఆసనం ఆచరిస్తే ధ్యానస్థితిని చేరుకుంటాము. శవాసనం చేసే పద్ధతిః నేలపై తివాచీ లేదా yoga mat పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ... ఒకటి, లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. ఏవైపుకు వుంచితే హాయిగా వుంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి వుంచాలి. కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా వుంచాలి. మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలుః మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా, చికాకుగా, దిగులుగా ఆందోళనగా అలిసిపోయినట్లుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా వున్నపుడు శవాసనం ఎంతో ఉపయోగకారిగా వుంటుంది. శరీర కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. కండరాలు పూర్తి విశ్రాంతిని పొంది, ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది. దృష్టిని మనస్సు పై కేంద్రీకరించడం వలన మెదడు బాగా విశ్రమిస్తుంది. వీపు వెనుక, దిగువ భాగాన లేదా పొత్తికడుపు నొప్పి వున్నా శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. అలసటకు, ఒత్తిడికి గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతిని కలిగించవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం వుంటుంది. ప్రెగ్నెంట్‍ గా వున్న సమయంలో పగటి పూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా వున్నప్పుడు శవాసనం వేయవచ్చు. సాధారణ ప్రయోజనాలు తలనొప్పి, తలతిరగడం, మానసిక నీరసం, చికాకు, తుంటి నరం నొప్పిలాంటి వాటి నుంచి ఉపశమనం. శరీరం మనస్సు పూర్తి విశ్రాంతి పొందుతాయి. శరీర భాగాలన్నింటికీ ఈ అనుభూతి తెలుస్తుంది. మనస్సు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది. బాగా వ్యాయామం చేసి అలిసి పోయాక కండరాలకు విశ్రాంతి అవసరం. ఈ ఆసనం వేస్తే కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి, ప్రశాంతత ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాలు నిర్వహించే పనులకు ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం ద్వారా లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్‍ అవసరమైతే రక్త ప్రసరణ కూడా అధికం అవుతుంది. ఈ ఆసనం వల్ల రక్తనాళాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. శవాసనం వేసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది. అన్ని శరీర భాగాల కార్య కలాపాలు నెమ్మదిగా జరుగుతాయి. ఈ ఆసనాన్ని ఆచరించినట్లయితే అంతరంగిక కార్య కలాపాలన్నీ తగ్గిపోయి, శ్వాస తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు తిరిగి ఈ ప్రక్రియ అంతా నెమ్మదిగా కొత్తగా ప్రారంభమవుతుంది. దీర్ఘకాలంగా, తీవ్రంగా జబ్బు పడిన వ్యక్తుల శరీరం, మనస్సు తిరిగి కోలుకుంటుంది. శవాసనం మనిషిని బాగా ఉత్సాహపరుస్తుంది. మళ్ళీ తాజాగా శరీరం తయారై పని చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. నిద్రలేమి, అధిక లేదా తక్కువ రక్తపోటు, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. రక్త ప్రసరణ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. హృదయ సంబంధమైన వ్యాధులు, మానసిక వత్తిళ్ళు, అలసట, స్వల్ప దిగులు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేసినట్లయితే కోపం అదుపులో వుంటుంది. చికాకు పరిచే ఆలోచనలు ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.