35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడం మంచిదేనా.. వైద్యులు ఏం చెప్తున్నారంటే!
posted on Dec 13, 2025
35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడం మంచిదేనా.. వైద్యులు ఏం చెప్తున్నారంటే!
ప్రతి స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది మధురమైన క్షణం. ఇది సాధారణ మహిళ నుండి అమ్మతనం వైపు మహిళను మార్పు చెందించే అంశం. కానీ వయసు పెరిగే కొద్దీ శరీర జీవ గడియారం నెమ్మదిస్తుంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో, చాలా మంది మహిళలు కెరీర్ కోసం, సెటిల్ కావడం కోసం, వ్యక్తిగత లక్ష్యాల కారణంగా తల్లి కావడాన్ని ఆలస్యం చేస్తున్నారు. మరీ ముఖ్యందా గత కొన్నేళ్లలో ఆలస్యంగా తల్లి కావడం అనే సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి.
వివాహం అయిన వెంటనే పిల్లలను కనాలని చాలా మంది పెద్దలు కొత్తగా పెళ్లైన జంటలను ఒత్తిడి చేస్తుంటారు. వయస్సు దాటిపోతుందని లేదా పెద్ద వయస్సులో పిల్లలను కనడం సమస్యగా ఉంటుందని తరచుగా చెబుతూ ఉంటారు. అయితే తల్లి కావడానికి సరైన వయస్సు ఉందా? ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం కష్టమవుతుందా? దీని గురించి తెలుసుకుంటే..
తల్లి కావడానికి సరైన వయస్సు..
వైద్యపరంగా 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గర్భధారణకు అత్యంత సురక్షితమైనదని, చాలా అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ వయసులో మహిళల శరీరంలో అండాల నాణ్యత అద్భుతంగా ఉంటుంది. సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ కూడా పెద్ద కష్టం లేకుండా సులువుగానే సాధ్యమవుతుంది. గర్భధారణ సమస్యలు తక్కువగా ఉంటాయి.
కానీ 30 లేదా 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం ప్రమాదకరం లేదా అసాధ్యమని దీని అర్థం కాదు. ఇప్పట్లో లక్షలాది మంది మహిళలు 35, 38, 40 ఏళ్లు పైబడిన వయసులో కూడా గర్భాన్ని దాల్చి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. అయితే దీనికి కావలసిందల్లా కొంచెం అవగాహన, వైద్యుల పర్యవేక్షణ.
35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడంలో సమస్యలు..
స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె శరీరంలో కొన్ని సహజ జీవ మార్పులు జరుగుతాయి.
అండాల సంఖ్య, నాణ్యత..
పుట్టినప్పటి నుండి అండాల నిల్వ పరిమితంగా ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత అండాల నాణ్యత తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది గర్భం దాల్చే అవకాశాలను కొద్దిగా తగ్గిస్తుంది.
క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం..
వయస్సు పెరిగే కొద్దీ పిండంలో క్రోమోజోమ్ లు అసాధారణంగా మారే ప్రమాదం పెరుగుతుంది. ఇది గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుంది.
గర్భధారణలో సమస్యలు..
అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం, ప్రీ-ఎక్లంప్సియా, అకాల ప్రసవం వంటి సమస్యల ప్రమాదం 35 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది. కానీ వీటిని ఆధునిక చికిత్స, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.
సంతానోత్పత్తి..
40 సంవత్సరాల తర్వాత సహజంగా గర్భం దాల్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. కొన్నిసార్లు IVF లేదా ఇతర మార్గాలు అవసరం కావచ్చు.
*రూపశ్రీ.