నాని ప్లేస్ లో శ్రీవిష్ణు..!
on May 13, 2025
న్యాచురల్ స్టార్ నానికి తెలుగునాట ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పక్కింటి కుర్రాడిలా ఉండే నాని.. కామెడీ ఎంటర్టైనర్స్ తో యువతకి, కుటుంబ ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా నానికి పేరుంది. నటనలో, కథలలో సహజత్వం ఉంటుంది కాబట్టే.. న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటి నాని కొంతకాలంగా రూట్ మార్చి, వరుస మాస్ సినిమాలు చేస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం, హిట్-3 సినిమాలు తన ఇమేజ్ కి భిన్నంగా చేసినవే. ముఖ్యంగా హిట్-3 ఎంతో వయలెంట్ గా ఉంది. ఇక నాని చేస్తున్న నెక్స్ట్ మూవీ 'పారడైజ్' కూడా వయలెంట్ గా ఉండనుంది. నాని తన రూట్ ని మార్చేయడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరనే చర్చ మొదలైంది. దానికి సమాధానంగా శ్రీవిష్ణు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
విభిన్న చిత్రాలతో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్స్ శ్రీవిష్ణుకి మంచి పేరు తీసుకొస్తున్నాయి. సామజవరగమన, సింగిల్ వంటి సినిమాలతో.. అటు యూత్ కి, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాడు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే నాని ప్లేస్ ని శ్రీవిష్ణు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు అందరూ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. సరదాగా నవ్వుకునే ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు నాని అలాంటి ఎంటర్టైనర్స్ తో పలు విజయాలు అందుకున్నాడు. మధ్యలో విభిన్న సినిమాలు చేసినా.. అవి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకునే వాడు. కానీ ఇప్పుడు నాని పూర్తిగా యాక్షన్ బాట పట్టాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు కూడా చేస్తే.. శ్రీవిష్ణు మరో నాని అయ్యే అవకాశముంది.
శ్రీవిష్ణు పక్కింటి కుర్రాడిలాగా ఉంటాడు. నటనతో సహజత్వం ఉంటుంది. కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. తనకు సెట్ అయ్యే ఎంటర్టైనింగ్ సినిమాలను చేస్తే.. శ్రీవిష్ణు ఖచ్చితంగా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు అనడంలో సందేహం లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
