Home

»

Latest News

బ్రిటిషర్ల దారుణాలు.. ‘ఎల్‌నినో’తో లక్షలాది మరణాలు.. ‘రణబాలి’ వెనుక అసలు కథ ఇదే.!

Oct 15, 2026 2:27PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. చరిత్రలో మరుగునపడిన ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సుమారు 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో సంభవించిన ‘గ్రేట్ మద్రాస్ ఫామైన్’ (మద్రాస్ మహా కరువు) గురించి విజయ్ దేవరకొండ ప్రస్తావించారు. ఆ సమయంలో బ్రిటిషర్లు చేసిన దారుణాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం సూపర్ ఎల్‌నినో ప్రభావంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఎదురైన కరువు పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ప్రజలకు కీలక సూచన చేశారు. నీరు, విద్యుత్, ఆహారాన్ని ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వాటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగగల సత్తా భారతీయులకు ఉందని విజయ్ అన్నారు. 

1876–1878 మధ్య దక్షిణ భారతదేశాన్ని అతలాకుతలం చేసిన మహా కరువు నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతుంది. ఆకలి, పేదరికం, అంటువ్యాధులతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బ్రిటిష్ పాలకుల దోపిడీని ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడే వీరుడిగా కనిపించనున్నారు. చరిత్రలోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ కథ వెనుక ప్రధాన ఉద్దేశమని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెలిపారు. 

ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘రణబాలి’ తనకు, విజయ్‌కు ఎంతో ముఖ్యమైన సినిమా అని చెప్పారు. ఇందులో జయమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని, సినిమాలోని ప్రేమకథ కూడా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. మొత్తానికి చారిత్రక నేపథ్యం, భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ‘రణబాలి’పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరువు చరిత్రను గుర్తుచేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

 

[Vijay Deverakonda, Ranabaali Movie, El Nino Effect, Great Madras Famine, Ranabaali Story, Rashmika Mandanna, Rahul Sankrityan]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com