TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

వారణాసి వీడియో లీక్: ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.!

Nov 24, 2026 9:35AM

సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎక్కడో ఒకచోట ఫొటోలు, వీడియోలు లీక్ అవడం సాధారణమే. కొన్నిసార్లు చిత్రబృందం ఎంత జాగ్రత్తగా ఉన్నా అభిమానుల కెమెరాలకు చిక్కిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి లీక్‌కు కారణం ఓ వ్యక్తి కాదు.. ఆపిల్ మ్యాప్స్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా సెట్‌కు సంబంధించిన ఏరియల్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆపిల్ ఇటీవల భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన హై-రెజల్యూషన్ మ్యాపింగ్ చిత్రాల్లో హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ను నెటిజన్లు గుర్తించారు. వాటిని జూమ్ చేసి చూస్తే భారీ ఆలయ నిర్మాణాలు, నీటి కొలనులోకి దిగే రాతి మెట్లు, పడవలు, పురాతన నిర్మాణాలను పోలిన కట్టడాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇవి రాజమౌళి ‘వారణాసి’ సినిమా కోసం నిర్మించిన కాశీ సెట్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో సెట్స్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కథకు అవసరమైన ప్రపంచాన్ని తెరపై సృష్టించేందుకు ఆయన ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ‘వారణాసి’ కోసం కూడా హైదరాబాద్‌లోనే కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్‌ను నిర్మించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. నిజమైన వారణాసిలోని ఘాట్లు, ఆలయాల నిర్మాణ శైలిని పరిశీలించి, వాటిని పోలిన సెట్స్‌ను రూపొందించినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడించాయి.

ఇక ఇప్పుడు ఆపిల్ మ్యాప్స్‌లో కనిపించిన విజువల్స్‌లోనూ ఆలయాలు, ఘాట్లను పోలిన నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇన్నాళ్లూ తెర వెనుకే ఉన్న ఈ భారీ నిర్మాణాలు ఇప్పుడు ఏరియల్ వ్యూలో కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇది కూడా చదవండి: కిరణ్ అబ్బవరం రికార్డ్.. కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇన్ని మిస్టరీలా.?

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. వివిధ కాలాలు, ప్రాంతాల మధ్య సాగే అడ్వెంచర్ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్, డబ్బింగ్ పనులపై చిత్రబృందం దృష్టి పెట్టింది. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మొత్తానికి రాజమౌళి ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా.. ఈసారి ఆపిల్ మ్యాప్స్ రూపంలో అభిమానులకు ఓ భారీ సెట్ దర్శనమిచ్చింది. అయితే తెరపై ఈ కాశీ ప్రపంచం ఇంకెంత అద్భుతంగా కనిపించబోతోందో అన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.

మీకు నచ్చవచ్చు: 
రెండేళ్లుగా ఎదురుచూపులు.. ఎట్టకేలకు ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సోనీ చేతికి.!
బిగ్ సర్‌ప్రైజ్‌.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.!

 

 

 

[Varanasi Set, Apple Maps, Kokapet Kasi Set, SS Rajamouli, Mahesh Babu]

 

google-ad-img