
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయంటే.. అందులో నటించబోయే వారి గురించి ఆసక్తికర చర్చ మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి వార్తే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో త్రిష నటించబోతున్నారా? అంటే.. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి.
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత జె.ఎం. బషీర్ ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా ‘పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్’ పేరుతో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను ఆయనే పోషించనున్నారు. ఇక జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు బషీర్ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జె.ఎం. బషీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బయోపిక్ చిత్రీకరణను అక్టోబర్ 17 నుంచి ప్రారంభించనున్నారు. ఎంజీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయాల్లో ఆయన ఎదుగుదల వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నాదురై, కరుణానిధి వంటి కీలక రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఇందులో ఉండనున్నాయి. అయితే దర్శకుడు, సంగీత దర్శకుడు సహా ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని బషీర్ తెలిపారు.

నిజానికి జయలలిత పాత్రలో నటించాలనే ఆసక్తిని త్రిష గతంలోనే వ్యక్తం చేశారు. 2018లో ఓ సందర్భంలో జయలలిత బయోపిక్‌లో అవకాశం వస్తే నటించడానికి ఇష్టపడతానని చెప్పారు. జయలలితపై తనకు ఎంతో గౌరవం ఉందని కూడా వెల్లడించారు. ఇప్పుడు ఎంజీఆర్ బయోపిక్ కోసం ఆమెను సంప్రదిస్తున్నారనే వార్త రావడంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది.
ఇప్పటికే జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాలో కంగనా రనౌత్ ఆ పాత్రను పోషించారు. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి నటించారు. మరోవైపు రమ్యకృష్ణ కూడా గతంలో జయలలిత పాత్రలో కనిపించారు. ఇప్పుడు త్రిషకు అలాంటి అవకాశం వస్తే ఆమె ఎలా కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు మాత్రమే చిత్రబృందం నుంచి సమాచారం వచ్చింది. ఆమె ఈ పాత్రకు అంగీకరించారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. జయలలిత పాత్రలో ఆమెను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరగడం ఖాయం. మరి ఈ బయోపిక్‌లో త్రిష భాగమవుతారా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: నా ఫెయిల్యూర్ చూసి పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడతా - విజయ్ దేవరకొండ
[Trisha As Jayalalithaa, Trisha Jayalalithaa Role, Trisha as Thalaivi, MGR Biopic, Trisha Krishnan, JM Bashir, Jayalalithaa, MGR, Telugu News]






