
ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా మన స్టార్ హీరోలు హిందీ మార్కెట్లోకి వెళ్లాలంటే బాలీవుడ్ మేకర్స్‌తో సినిమాలు చేయడం ఒక మార్గంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మన హీరోలు సౌత్ దర్శకులతోనే భారీ ప్రాజెక్టులు చేస్తూ.. దేశవ్యాప్తంగా తమ మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ దర్శకుల కంటే మన దర్శకులకే స్టార్ హీరోలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే చర్చ మొదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బాలీవుడ్ ఎంట్రీగా వచ్చిన ‘జంజీర్’ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఆయన ప్రధానంగా తెలుగు దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ‘వార్ 2’లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులూ సౌత్‌కు చెందిన దర్శకులతోనే చేస్తున్నారు.

'ఆదిపురుష్' తర్వాత ప్రభాస్ సౌత్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తో 'కల్కి 2' ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.
మహేశ్ బాబు విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా, లోకేష్ కనగరాజ్, సుకుమార్ వంటి దర్శకులతో చేతులు కలిపే ఛాన్స్ ఉంది.
'పుష్ప'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది.
ఇలా మన స్టార్ హీరోల తదుపరి సినిమాల లైనప్‌ను పరిశీలిస్తే.. సౌత్ దర్శకుల పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి బాలీవుడ్ దర్శకులను పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పలేకపోయినా.. మన దర్శకులపై హీరోలకు ఉన్న నమ్మకం, వారితో సినిమాలు చేసేందుకు చూపిస్తున్న ఆసక్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: వారణాసి vs రామాయణ: రాజమౌళిని సవాల్ చేస్తున్న బాలీవుడ్ ఎపిక్.!
[Tollywood Heroes, South Directors, Bollywood Directors, Ram Charan, Jr NTR, Prabhas, Mahesh Babu, Allu Arjun, Pan India Movies, Telugu Film News]






