మేనేజర్‌పై స్టార్ హీరో దాడి .. కేసు నమోదు చేసిన పోలీసులు!
on May 27, 2025
సినిమా రంగంలో రాణించడం, హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం, ఆ తర్వాత స్టార్ హీరో స్థాయికి ఎదగడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎంత టాలెంట్ ఉన్నా అందరీకీ ఆ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన స్టార్ స్టేటస్‌ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది అందరి వల్ల అయ్యే పని కాదు. ఎవరి నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తన ఉనికిని కాపాడుకోవడంలోనే ఆ హీరో సమర్థత ఏమిటి అనేది తెలుస్తుంది. హీరోలుగా ఒక స్థాయికి వచ్చిన వారు దాదాపు ఇదే పద్ధతిని పాటిస్తుంటారు. అయితే కొందరు మాత్రం విచక్షణ, సహనం కోల్పోవడం ద్వారా కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఆమధ్య కన్నడ స్టార్ హీరో దర్శన్ విషయంలో ఇదే మనం చూశాం. క్షణికావేశంలో అభిమానినే కడతేర్చి తనలోని రాక్షసుడ్ని అందరికీ పరిచయం చేశాడు. స్టార్ హీరో స్టేటస్‌ని అనుభవిస్తున్న దర్శన్ ఇప్పుడు హత్య కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తరహాలోనే ఓ మలయాళ స్టార్ హీరో వార్తల్లోకి వచ్చాడు.
వివరాల్లోకి వెళితే.. మలయాళంలో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్న ఉన్ని ముకుందన్‌పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగులో ‘భాగమతి’ చిత్రంలో హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించాడు. నటుడుగానే కాదు ప్లే బ్యాక్ సింగర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకొని నటుడిగా, సింగర్‌గా ఎన్నో అవార్డులు సాధించాడు. అతని దగ్గర ఆరేళ్లుగా విపిన్‌కుమార్ అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 18 ఏళ్ళుగా ఇండస్ట్రీలోనే ఉన్న విపిన్ ఎంతో మంది హీరోల దగ్గర పనిచేశాడు. అయితే హీరో ఉన్ని ముకుందన్‌పై విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి తనపై దాడి చేశారని విపిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా కాలం నుంచి ముకుందన్ తనను వేధిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపారు. ఇటీవల మరో మలయాళ హీరో టోవినో థామస్ కొత్త సినిమా ‘నరివెట్టను’ రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఆ సినిమా టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు విపిన్. ఇది ముకుందన్‌కు బాగా కోపం తెప్పించింది. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో విపిన్ ఉంటున్న అపార్ట్మెంట్కి వచ్చి, అతన్ని పార్కింగ్ ప్లేస్‌కి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టాడట.
గత ఏడాది ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయినా ఆ తర్వాత అతనికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దాంతో కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. అదే సమయంలో మరో హీరో సినిమాను విపిన్ ప్రశంసించడం తట్టుకోలేకపోయాడు ముకుందన్. అందుకే తనపై దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు విపిన్. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విపిన్.. ఇండస్ట్రీలోని పలు అసోసియేషన్స్‌లో ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. ముకుందన్‌కి సంబంధించి చాలా విషయాలు చెప్పాల్సి ఉందని, వాటిని తర్వాత వివరంగా తెలియజేస్తానని అంటున్నాడు విపిన్. ఇలాంటి వివాదాలు, కేసులు ముకుందన్‌కి కొత్తమీ కాదంటున్నాడు విపిన్. అతనిపై గతంలో లైంగిక వేధింపుల కేసు, యూట్యూబర్‌పై దాడి.. ఇలా పలు కేసులు అతనిపై నమోదయ్యాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
