ఇక్కడ ఉదయ్.. అక్కడ సుశాంత్!.. షాకింగ్ సూసైడ్స్!!
Jun 14, 2020 6:11PM

బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ విషాద వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని సుశాంత్‌సింగ్ చనిపోయిన తీరు చూస్తే ఆరేళ్ల క్రితం ఇదే తరహాలో ఉరేసుకొని మరణించిన మన హీరో ఉదయ్ కిరణ్ ఉదంతం జ్ఞాపకం రాకమానదు. ఇద్దరి మధ్యా పలు పోలికలు కనిపిస్తుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఉదయ్ 33 సంవత్సరాల 6 నెలల వయసులో ఆత్మహత్య చేసుకుంటే, సుశాంత్‌సింగ్ 34 సంవత్సరాల ఆరు నెలల వయసులో ఉరేసుకున్నాడు. ఉదయ్ జూన్‌లో పుట్టి, జనవరిలో చనిపోతే, సుశాంత్ జనవరిలో జన్మించి, జూన్‌లో మరణించాడు. ఇద్దరూ డిప్రెషన్‌కు లోనై మరణించడం ఇంకో సిమిలారిటీ.

1980 జూన్‌లో పుట్టిన ఉదయ్ కిరణ్ ఇరవై ఏళ్లకే హీరో అయ్యాడు. తేజ డైరెక్ట్ చేసిన 'చిత్రం' (2000) అనే సూపర్ హిట్ మూవీతో హీరోగా పరిచయమై, ఆ వెంటనే వరుసగా 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ టైమ్‌లో ఉదయ్‌కు యూత్‌లో వచ్చిన క్రేజ్ అసామాన్యం. అమ్మాయిల కలల రాకుమారుడిగా అవతరించాడు. అయితే 2008లో వచ్చిన 'గుండె ఝల్లుమంది' మూవీ తర్వాత వరుస ఫ్లాపులు ఎదురవడంతో కెరీర్‌లో ఇక ఎదగనేమోననే డిప్రెషన్‌కు లోనై 2014 జనవరిలో హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరేసుకొని చనిపోయాడు.
వ్యక్తిగత జీవితం కూడా అతని డిప్రెషన్‌కు కారణంగా చెబుతుంటారు. తల్లి మరణం, తండ్రి మరో వివాహం చేసుకోవడం వంటివి కూడా అతడి మీద బాగా ప్రభావం చూపించాయి. నిశ్చితార్ధం జరిగి కూడా చిరంజీవి అల్లుడు కాలేకపోవడం, ఆనాడు జరిగిన ఘటనలు కూడా అతని మానసిక స్థితిపై పెను ప్రభావం చూపించాయి. 2012 అక్టోబర్‌లో విషిత అనే ఫేస్‌బుక్ ఉద్యోగినిని పెళ్లాడిన ఉదయ్.. ఆ తర్వాత కొద్ది కాలానికే టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు.

1986 జనవరిలో పాట్నాలో జన్మించిన సుశాంత్ సింగ్ 2008లో అంటే 22 ఏళ్ల వయసులో 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే టీవీ సీరియల్ ద్వారా నటుడిగా కెరీర్ ఆరంభించాడు. అంతేకాదు, 2010 'జరా నాచ్‌కే దిఖా', 'ఝలక్ దిఖ్‌లా జా 4' అనే డాన్స్ రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. ఈ రెండో దానిలో రన్నరప్‌గా నిలిచాడు కూడా. 'పవిత్ర రిష్'తా సీరియల్ తర్వాత 'కై పో చే' (2013) సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా 'శుద్ధ్ దేశీ రొమాన్స్' హిట్టవడంతో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఆమిర్‌ఖాన్ మూవీ 'పీకే'లో అనుష్క శర్మ లవర్ సర్ఫరాజ్‌గా కనిపించిన అతను 2016లో వచ్చిన 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. భారత అగ్రశ్రేణి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీగా సుశాంత్ ప్రదర్శించిన పర్ఫార్మెన్స్ విమర్శకుల్ని అమితంగా ఆకట్టుకోగా, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. తర్వాత 'కేదార్‌నాథ్' (2018), 'చిచ్చోరే' (2019) సినిమాలతోనూ అలరించాడు. అయితే ఆ తర్వాత చేసిన 'డ్రైవ్' సినిమా రిలీజ్‌లో ఇబ్బందులు ఎదురవడం, ఆ తర్వాత థియేటర్లలో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావడంతో అతను మానసిక క్షోభకు గురయ్యాడని సమాచారం.
ఇక అతడి చివరి సినిమా 'దిల్ బేచారా' 2018లోనే మొదలైనా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 2019 నవంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఆ సినిమా 2020 మే నెలకు పోస్ట్‌పోన్ అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా విడుదల మరోసారి పెండింగ్‌లో పడింది. ఈ సమయంలోనే గతంలో తనకు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలివాన్ తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అతడి డిప్రెషన్‌ను మరింతగా పెంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ఆరు రోజులకే సుశాంత్‌సింగ్ ఉరేసుకొని సూసైడ్ చేసుకోవడం సినీ వర్గాల వారినందరినీ విషాదంలో ముంచెత్తింది.
ఇలా ఆరేళ్ల క్రితం టాలీవుడ్ రైజింగ్ స్టార్ ఉదయ్ కిరణ్, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఒకే విధంగా ఆత్మహత్యకు పాల్పడడం ఎంతైనా బాధాకరం, శోచనీయం. ఇది సినిమా ఇండస్ట్రీలోని అనిశ్చిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.




