టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దుర్వినియోగం వల్ల అన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సినీ తారల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ కొందరు అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా నటి శ్రియ శరణ్ కూడా ఏఐ దుర్వినియోగంపై స్పందించారు. తన ఫొటోలను కూడా కొందరు ఇష్టమొచ్చినట్లు మార్చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, శరీర భాగాల ఆకృతులను మార్చడంతో పాటు వేసుకున్న దుస్తులను కూడా ఏఐ సాయంతో తొలగిస్తున్నారని శ్రియ వెల్లడించారు. కొన్నిసార్లు ఆ ఫొటోలను చూస్తే అందులో ఉన్నది తానేనా అని తనకే అనిపిస్తుందని పేర్కొన్నారు. మొదట్లో ఇలాంటి వాటిని చూసి తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. రోజురోజుకూ ఈ వ్యవహారం విసుగు తెప్పిస్తోందని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్చడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఏఐ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే దాన్ని తప్పుగా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని శ్రియ హెచ్చరించారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలోనూ ఏఐ మార్ఫింగ్, నకిలీ ఫొటోల సమస్యను ఎదుర్కొన్న శ్రియ.. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై మాట్లాడటంతో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల నటి జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన వీడియోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేయడం కూడా చర్చకు దారితీసింది. మహిళా నటీమణుల అనుమతి లేకుండా వారి చిత్రాలను మార్చి అసభ్యకరంగా ప్రచారం చేయడంపై సినీ పరిశ్రమలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సృజనాత్మకతకు ఉపయోగపడాల్సిన సాంకేతికతను ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
[Shriya Saran, Shriya Saran AI Misuse, AI Deepfake Images, AI Photo Morphing, Shriya Saran Latest News, Janhvi Kapoor AI Video, Artificial Intelligence Misuse]






