53 షోల నుంచి 1575 షోల దాకా.. 4 రోజుల్లో హిందీ 'కార్తికేయ2' సంచలనం!
on Aug 17, 2022
నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన 'కార్తికేయ2' మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్లతో రిలీజైన ఈ సినిమా తెలుగు వెర్షన్‌తో పాటు హిందీ వెర్షన్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించి, ప్రాఫిట్స్ సంపాదించడం స్టార్ట్ చేసేసింది.
కాగా 'కార్తికేయ2' హిందీ వెర్షన్‌కు ఫస్ట్ డే కేవలం 53 షోలు మాత్రమే లభించగా, నేడు 5వ రోజు ఆ సినిమాకు లభించిన షోల సంఖ్య 1575 పైగా చేరడం అతి పెద్ద విశేషంగా భావిస్తున్నారు. ఆగస్ట్ 13న తక్కువ షోల కారణంగా కేవలం రూ. 7 లక్షల నెట్ వచ్చిన ఈ సినిమాకు రెండో రోజు పెరిగిన షోలతో రూ. 28 లక్షలు వచ్చాయి. మూడో రోజు సోమవారం షోలు మరింతగా పెరిగి ఏకంగా రూ. 1.10 కోట్లు వచ్చాయి.
గత వారం విడుదలైన బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ఆమిర్ ఖాన్ సినిమా 'లాల్ సింగ్ చడ్ఢా', అక్షయ్ కుమార్ సినిమా 'రక్షాబంధన్'.. రెండూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. #BoycottLaalSinghChaddha అనే నెగటివ్ స్లోగన్‌కు లభించిన విపరీతమైన ప్రచారం ఆ సినిమాకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ఫలితంగా బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా 'లాల్ సింగ్ చడ్ఢా' నిలించింది. అయితే దాన్ని క్యాష్ చేసుకోవడంలో 'రక్షాబంధన్' మూవీ కూడా విఫలమైంది. ఇలా ఆ రెండు సినిమాలను తిరస్కరించిన హిందీ ప్రేక్షకులు.. 'కార్తికేయ2' సినిమాపై ఆసక్తి కనపరుస్తున్నారు. ఫలితంగా రోజు రోజుకూ అక్కడ మన మూవీ వండర్స్ క్రియేట్ చేస్తోంది.