శేఖర్ కమ్ముల ఏ స్టార్ హీరోతో చేస్తారో?
on May 24, 2020
దర్శకుడు శేఖర్ కమ్ముల వ్యవహారం అంతా వేరుగా ఉంటుంది. సినిమా తీసే విధానం, గట్రా సంప్రయాద శైలికి భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో శేఖర్ కమ్ముల సినిమాలు చేయలేదు. ఆయన చేసిన సినిమాల్లో నటించిన తరవాతే రానా దగ్గుబాటి, సాయి పల్లవి స్టార్లు అయ్యారు. నిఖిల్, వరుణ్ సందేశ్, తమన్నా తదితరులకు గుర్తింపు వచ్చింది. అలాగని, స్టార్ హీరోలతో సినిమాలు చేయకూడదని గిరి గీసుకుని కూర్చోలేదు. మధ్యలో ప్రయత్నించారు గానీ కుదరలేదు. నయనతార స్టార్డమ్లోకి వచ్చాక ఆమెతో ‘అనామిక’ చేశారు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్నారు. సాధారణంగా కొత్త హీరోలు, హీరోయిన్లుకు ట్రయినింగ్ ఇచ్చి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే శేఖర్ కమ్ముల, తరవాతి సినిమాను స్టార్ హీరోతో చేయనున్నట్టు ప్రకటన రావడం ఆశ్చర్యమే.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘లవ్ స్టోరీ’ నిర్మాతలలో ఒకరైన నారాయణ దాస్ నారంగ్, ఈ సినిమాకి విడుదల ముందే శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో స్టార్ హీరో నటిస్తారని ప్రకటించారు. ఏ స్టార్ హీరోతో చేస్తారో? నిజానికి, శేఖర్ కమ్ములతో చేయాలని చాలామంది స్టార్ హీరోలకు ఉంది.