Home

»

Latest News

సీత పాత్రతో నా ఆలోచనా విధానమే మారిపోయింది.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

Oct 20, 2026 9:55AM

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె ‘రామాయణ’ చిత్రంలో సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ భారీ చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ తెలుగు ప్రీ రిలీజ్ వేడుకలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సీత పాత్ర పోషించడం తనకు ఎంతో అదృష్టమని ఆమె పేర్కొన్నారు. 

సీతాదేవి పాత్ర ద్వారా ప్రశాంతంగా ఉండటం, ఆధ్యాత్మికంగా ఆలోచించడం వంటి విషయాలను నేర్చుకున్నానని సాయి పల్లవి తెలిపారు. ఈ పాత్ర కోసం తాము మూడేళ్ల పాటు పనిచేశామని, అయితే దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం దాదాపు పదేళ్లుగా ఈ ప్రాజెక్టుపై ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి గొప్ప ఇతిహాసంలో భాగం కావడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె వెల్లడించారు. పాత్రలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు చిత్ర బృందం కొన్ని పుస్తకాలు చదవాలని సూచించిందని, ఎన్టీఆర్ నటించిన రామాయణానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూశానని తెలిపారు. 

ఇక రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా సాయి పల్లవి పంచుకున్నారు. తొలి రోజు షూటింగ్‌లోనే ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించారని, ఆ సమయంలో తాను కొంత టెన్షన్ పడుతుంటే రణ్‌బీర్ ఎంతో సౌకర్యంగా ఉండేలా సహకరించారని చెప్పారు. భిన్నమైన సంస్కృతుల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయన అండగా నిలిచారని ప్రశంసించారు. యశ్ గురించి మాట్లాడుతూ.. తన మూలాలకు సంబంధించిన కథలను చెప్పాలనే తపన ఆయనలో కనిపిస్తుందని అన్నారు. రావణుడి పాత్రను యశ్ తన నటనతో ప్రేక్షకులకు నచ్చేలా చేస్తారని అభిప్రాయపడ్డారు. 

ఈ వేడుకలో సాయి పల్లవి హిందీలో రాముడి భజనను పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా హిందీలో చిత్రీకరించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుందని ఆమె చెప్పారు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాయి పల్లవి నటనను ప్రశంసించారు. రణ్‌బీర్ రాముడిగా అద్భుతంగా నటించారని, సాయి పల్లవి సీత పాత్రలో ఎంతో ప్రశాంతంగా కనిపించారని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్న ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com