అఫిషియల్: రానా, మిహీకా ఉంగరాలు మార్చుకున్నారు!
on May 21, 2020
రానా దగ్గుబాటి తన ప్రేయసి మిహీకా బజాజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఆ ఇద్దరి నిశ్చితార్ధం జరగడం గమనార్హం. ఈ వేడుక రామానాయుడు స్టూడియోస్‌లో రామానాయుడు మెమోరియల్ వద్ద జరిగింది. 2015లో మృతిచెందిన రామానాయుడు పార్థివ దేహాన్ని స్టూడియోలో ఖననం చేశారు. రామానాయుడు పేరునే సురేశ్‌బాబు తన పెద్ద కొడుకుకు పెట్టారు. అయితే ఆ పేరును కుదించుకుని 'రానా'గా తన స్క్రీన్ నేమ్‌ను అతను మార్చుకున్నాడు. తాతయ్య అంటే రానాకు అత్యంత ప్రేమాభిమానాలు. అందుకే ఆయన స్మారిక చిహ్నం వద్దే తన ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసుకున్నాడు రానా. ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య రానా, మిహీకా ఉంగరాలు మార్చుకున్నారు.
దీనికి సంబంధించిన ఫొటోలను రానా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో రానా, మిహీకా జంట అమిత సంతోషంతో నవ్వుతూ కనిపిస్తున్నారు. తెల్ల చొక్కా, అదే రంగు పంచెతో రానా సంప్రదాయబద్ధంగా కనిపిస్తే, గులాబీ, బంగారు వర్ణాల కలనేత సిల్క్ శారీలో మిహీకా మెరిసిపోయింది. ఈ ఫొటోలను షేర్ చేసిన రానా "It's official." అంటూ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆ జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ ఈవెంట్స్‌లో రానా, మిహీకా వివాహం ఒకటనేది నిశ్చయం. అయితే ఆ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది వెల్లడి కావాల్సి ఉంది.