Home

»

Latest News

‘బాషా 2’, ‘పేట 2’కు నో చెప్పిన ర‌జినీకాంత్‌.. ‘జైలర్ 2’ చేయ‌డం వెనుక రీజ‌న్ ఇదే.!

Oct 11, 2026 3:32PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అలాంటి సినిమాల్లో ‘బాషా’, ‘పేట’ కూడా ఉన్నాయి. ఈ చిత్రాలకు సీక్వెల్స్ చేసే ఆలోచనలు వచ్చినప్పటికీ రజనీకాంత్ మాత్రం వాటికి అంగీకరించలేదు. కానీ ‘జైలర్’ రెండో భాగం ‘జైలర్ 2’కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి కారణమేంటో తాజాగా ఆయన వెల్లడించారు. 

సాధారణంగా సీక్వెల్స్‌పై తనకు పెద్దగా ఆసక్తి ఉండదని రజనీకాంత్ తెలిపారు. మొదటి భాగంలోని కథకు కొన్ని కొత్త అంశాలను జోడించి మరో సినిమా తీయడం తనకు నచ్చదని చెప్పారు. గతంలో ‘బాషా 2’ కోసం ప్రతిపాదనలు వచ్చినా అంగీకరించలేదని, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘పేట 2’ ఆలోచనతో తనను సంప్రదించినప్పటికీ ముందుకు వెళ్లలేదని గుర్తుచేసుకున్నారు. అయితే ‘జైలర్’ విషయంలో మాత్రం కథలోనే రెండో భాగానికి సరైన పునాది కనిపించిందని వివరించారు. 

‘జైలర్’ ఓటీటీలో విడుదలైన తర్వాత మరోసారి సినిమా చూశానని రజనీ చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వర్మ అనే పాత్ర తన వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ముత్తువేల్ పాండియన్‌ను హెచ్చరించే సన్నివేశం తనను ఆలోచింపజేసిందన్నారు. అంతేకాదు.. సినిమాలో చూపించిన వేల కోట్ల విలువైన మూడు కంటైనర్లు, నాగ్‌పూర్ జైలులో ముత్తువేల్ పాండియన్‌కు ఉన్న పలుకుబడి వంటి అంశాలు కథను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించాయని తెలిపారు. దీంతో సీక్వెల్‌కు బలమైన కథ ఉందని భావించి, తానే దర్శకుడు నెల్సన్‌కు ఫోన్ చేసి ‘జైలర్ 2’ చేయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులతో పాటు ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో చూపించిన కథా ప్రపంచాన్ని రెండో భాగంలో నెల్సన్ ఎలా విస్తరించారో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

 

 

[Rajinikanth, Jailer 2, Baasha 2, Petta 2, Rajinikanth Sequel Movies, Nelson Dilipkumar, Jailer 2 Story, Rajinikanth Latest News, Tiger Muthuvel Pandian]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com