Home

»

Latest News

వారణాసి: ఆర్ఆర్ఆర్ కంటే 5 రెట్లు పెద్ద సినిమా.. కానీ 40 రోజులు ముందే.!

Oct 25, 2026 2:52PM

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్, ఊహకందని యాక్షన్ సీక్వెన్స్‌లు గుర్తుకొస్తాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు మహేశ్ బాబుతో ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి చెప్పిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఐదు నుంచి ఆరు రెట్లు భారీ స్థాయిలో ‘వారణాసి’ రూపొందుతోందని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. అంత పెద్ద సినిమా షూటింగ్‌ను గత చిత్రంతో పోలిస్తే 40 రోజులు తక్కువ సమయంలో పూర్తి చేశారట.

బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి, తన కొత్త సినిమా నిర్మాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేయడానికి 315 రోజులు పట్టిందని.. ‘వారణాసి’ మాత్రం 275 రోజుల్లోనే పూర్తయిందని తెలిపారు.

ఇక్కడే అసలు విశేషం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ కంటే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా అయినప్పటికీ, షూటింగ్ సమయాన్ని 40 రోజులు తగ్గించగలిగారంటే దాని వెనుక ఎంత ప్రణాళిక ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సినిమా నిర్మాణంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, ముందస్తు సన్నాహాలు ఈసారి బాగా ఉపయోగపడ్డాయని రాజమౌళి వివరించారు.

‘వారణాసి’ ప్రత్యేకత కేవలం భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో సినిమాలా రూపొందించాల్సి వచ్చిందని రాజమౌళి వెల్లడించారు. వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా వంటి విభిన్న ప్రాంతాలతో పాటు పురాణాలు, కాల ప్రయాణం వంటి అంశాలు కథలో భాగంగా ఉండనున్నాయి.

ఒక్కో ప్రాంతం, ఒక్కో సన్నివేశం కోసం ప్రత్యేకంగా పరిశోధన చేయాల్సి వచ్చిందని.. వాటన్నింటినీ ఒకే కథలో భావోద్వేగపరంగా అనుసంధానించడం అతిపెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. ఆరు, ఏడు సినిమాల అనుభూతిని ఒకే సినిమాలో ఇమిడ్చే ప్రయత్నం చేసినట్లు వివరించారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీరాముడిగానూ కాసేపు కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా జోనస్ మందాకిని పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

‘వారణాసి’ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడం కూడా ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’.. డిసెంబర్ నుంచి అసలు వేట మొదలు.!

 

 

 

[Rajamouli About Varanasi, Varanasi Bigger Than RRR, Varanasi Movie Update, RRR vs Varanasi, Varanasi Release Date, Varanasi Shoot Days, Varanasi Movie, SS Rajamouli, Mahesh Babu, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com