లైలా వివాదం: మరోసారి రచ్చ చేసిన పృథ్వీ!
on Feb 11, 2025
సినిమాల ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ఉపయోగించే మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారిపోయింది. కొందరు సినీ ప్రముఖులు కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు టార్గెట్‌గా మారుతున్నారు. మరికొందరు యధాలాపంగా మాట్లాడిన విషయాలను భూతద్దంలో చూపిస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. ఏది ఏమైనా మీడియాలో మాత్రం వివాదాలు చాలా కామన్ అయిపోయాయి. ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా మీడియాకు కావాల్సిన మంచి స్టఫ్‌ని అందించడంలో సినీ ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల లైలా సినిమాకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నటుడు పృథ్వీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. వైసీపీని ఉద్దేశించి పృథ్వీ ఆ కామెంట్స్ చేశాడంటూ లైలా చిత్రంపై నిషేధాన్ని విధించారు కొందరు. బాయ్‌కాట్ లైలా అంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఆ స్లోగన్‌కి 25,000 ట్వీట్లు రావడంతో చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది. హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో విశ్వక్సేన్ మీడియా ముఖంగా సారీ చెప్పాడు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, మరోసారి పృథ్వీ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు మరోసారి లైలా చిత్రానికి, చిత్ర యూనిట్‌కి పెద్ద తలనొప్పిగా మారాయి.
విశ్వక్సేన్, సాహు గారపాటి ప్రెస్‌మీట్ తర్వాత తను చేసిన వ్యాఖ్యలపై పృథ్వీ స్పందిస్తాడని, తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే ఈ వివాదాన్ని మరింత జఠిలం చేసేలా పృథ్వీ మరోసారి కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలపై పృథ్వీ తాజాగా స్పందిస్తూ ఆ ఈవెంట్లో వైసీపీ వాళ్లను టార్గెట్ చేస్తూ నేను ఏమీ మాట్లాడలేదు. రాజకీయం మాట్లాడేందుకు అది వేదిక కాదు. పొలిటికల్ అంశాలు మాట్లాడేందుకు వేరే వేదికలు ఉంటాయి. ఆ సినిమా ఈవెంట్లో నేను ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు. అలాంటప్పుడు మీకు వచ్చిన బాధ ఏమిటి? సినిమాకు, రాజకీయానికి లింక్ పెట్టొద్దు. ఆరోజు నేను చాలా మామూలుగా మాట్లాడాను. నా మాటల వల్ల సినిమాను నిషేధిస్తామని చెప్పడం చాలా తప్పు. బాయ్‌కాట్ లైలా అన్నంత మాత్రాన ప్రేక్షకులు సినిమాను చూడకుండా ఉండరు. లైలా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ తాజా వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. బాయ్‌కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మరింత వేగంగా ముందుకెళుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
