TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

లోకల్ ఛానల్స్ లో, బస్సులలో 'గేమ్ ఛేంజర్' ప్రదర్శన.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

Jan 15, 2025 11:16AM

 

వందలాది మంది శ్రమ, వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావడం అనేది మూవీ టీంకి ఎంతో బాధను కలిగిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమా విషయంలో ఆ టీం బాధ మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ పైరసీ సైట్స్ లో అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొందరు లోకల్ కేబుల్ ఛానల్స్ లో మరియు బస్సులలో దీనిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ పైరసీ ఘటనపై 'గేమ్ ఛేంజర్' టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా ఈ ఘటనపై మెగా కుటుంబానికి సన్నిహితుడు, నిర్మాత ఎస్.కె.ఎన్ స్పందించారు.

 

"కేవలం 4-5 రోజుల క్రితం విడుదలైన ఒక చిత్రం స్థానిక కేబుల్ ఛానెల్‌లు మరియు బస్సులలో ప్రసారం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు లేదా నిర్మాతలు కాదు. ఇది 3-4 సంవత్సరాల కృషి, అంకితభావం మరియు వేలాది మంది కలల ఫలితం.

సినిమాల విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారితో పాటు, చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తాయి

ఇటువంటి చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమాకి మంచి భవిష్యత్తును అందించడానికి , సినిమాని కాపాడటానికి అందరం ఏకమవుదాం." అంటూ సోషల్ మీడియా వేదికగా ఎస్.కె.ఎన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

google-ad-img