Home

»

Latest News

బాలయ్య కోసం ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.. ఇప్పుడు ఎందుకు వదులుకుంటున్నారంటే?

Oct 12, 2026 11:06AM

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు పరిసరాల్లో రోడ్ల విస్తరణ కోసం తన నివాసానికి చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆయన అంగీకరించారు. ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా తన కుటుంబానికి అనుబంధం ఉన్న ఇంటిలో కొంత భాగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా అమలు చేసిన వన్‌వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావడంతో దానిని శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోడ్డు నంబర్‌ 45 జంక్షన్‌ సహా కొన్ని ప్రాంతాల్లో రహదారులను విస్తరించి వాహనాల రాకపోకలకు ఉన్న అడ్డంకులను తొలగించనున్నారు. ఈ పనులు పూర్తయితే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ నుంచి దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, నాలెడ్జ్‌ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది.

బాలకృష్ణ స్థలం ఇవ్వడానికి అంగీకరించిన ఇల్లు నందమూరి కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. దివంగత నందమూరి తారక రామారావు 1982లో బాలకృష్ణ కోసం ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలకు వేదికగా నిలిచింది. ఎన్టీఆర్‌ తన అభిమానులను కూడా ఈ ఇంట్లోనే కలిసేవారని సమాచారం. అయితే రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రస్తుతం ఉన్న భవనంలో సగానికి పైగా భాగం ప్రభావితమవుతుండటంతో బాలకృష్ణ మరో ప్రాంతానికి నివాసం మార్చుకోవాల్సి రానుంది.

బాలకృష్ణతో పాటు శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ కూడా రోడ్డు విస్తరణ కోసం తమ స్థలాలను ఇచ్చేందుకు అంగీకరించాయి. శబ్దాలయ స్టూడియో 608 చదరపు గజాలు, భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ 341.33 చదరపు గజాల స్థలాన్ని అందించనున్నాయి. ఈ యజమానులు నగదు పరిహారానికి బదులుగా బదిలీ అభివృద్ధి హక్కుల (టీడీఆర్‌) విధానాన్ని ఎంచుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే విస్తృత ప్రణాళికలో ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి.

 

 

[Nandamuri Balakrishna, Balakrishna Hyderabad House, NTR Ancestral House, KBR Park Road Widening, Hyderabad Traffic Updates, Balakrishna Latest News, NTR Balakrishna House, GHMC Road Expansion, Jubilee Hills Traffic, Hyderabad Elevated Corridor]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com