తెలుగు సినిమా సరికొత్త చరిత్ర.. 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్!
on Jan 11, 2023

తెలుగు సినిమా పేరు మరోసారి అంతర్జాతీయంగా మారుమోగింది. ఇప్పటికే ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన యస్.యస్. రాజమౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్'.. సినిమా ప్రపంచం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఎంఎం కీరవాణి స్వరపరచగా చంద్రబోస్ రాసిన "నాటు నాటు" సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును సాధించింది. దీంతో కేవలం తెలుగు సినిమా మాత్రమే కాకుండా యావత్ భారతీయ సినిమా పులకించిపోయింది.
కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్ హోటల్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో "నాటు నాటు" సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆవార్డుకు ఎంపికైందని ప్రకటించగానే ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్ అయిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కరతాళ ధ్వనులు చేస్తుండగా కీరవాణి స్వయంగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పటి నుంచీ 'నాటు నాటు' సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన ఆ పాటకు తెరపై జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులు, ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యాయి. ఆ ఇద్దరి చేత అలా స్టెప్పులు వేయించిన ఘనత కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ది. 'నాటు నాటు' అంటూ లిరిక్స్ వచ్చే టైంలో తారక్, చరణ్ కలిసి వేస్తే స్టెప్ సిగ్నేచర్ స్టెప్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందితో ఆ స్టెప్ వేసేలా చేసింది. ఇప్పుడు ఆ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకుంది. ఒక తెలుగు సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం అనేది ఇదే తొలిసారి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



