
సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? షూటింగ్‌లో దర్శకుల ప్లానింగ్ ఎంత ముఖ్యం? ఈ అంశాలపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా నిడివిపై అవగాహన లేకుండా గంటల కొద్దీ ఫుటేజీ షూట్ చేసి, చివరకు ఎడిటింగ్‌లో దాన్ని తొలగించే దర్శకులను పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని కోన వెంకట్ ఘాటుగా వ్యాఖ్యానించారు. “అలాంటి దర్శకులు ఇండస్ట్రీకి క్రిమినల్స్‌తో సమానం” అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన కోన వెంకట్.. సరైన ప్రణాళిక లేకుండా సినిమాలు తెరకెక్కించే కొందరు దర్శకుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 3 గంటల 50 నిమిషాల ఫుటేజీని షూట్ చేసి, అందులో గంటన్నర లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని ఎడిటింగ్‌లో తొలగిస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
అంతసేపు షూటింగ్ చేయడానికి ఖర్చయ్యే డబ్బు ఎవరిదని ఆయన నిలదీశారు. నిర్మాతలు అప్పులు చేసి, తమ కుటుంబాల భవిష్యత్తును పణంగా పెట్టి సినిమాలపై పెట్టుబడులు పెడతారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ముందస్తు ప్రణాళిక లేకుండా కోట్ల రూపాయల విలువైన ఫుటేజీని వృథా చేయడం ఎంతవరకు సమంజసమన్నది ఆయన నిలదీశారు.
సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది పూర్తిగా ఎవరి చేతుల్లోనూ ఉండదని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే షూటింగ్‌కు ముందే కథ, సన్నివేశాలు, సినిమా నిడివి వంటి అంశాలపై స్పష్టతతో ఉండటం మాత్రం దర్శకుడి బాధ్యత అని అన్నారు.
కనీస ప్రణాళిక, అవగాహన లేకుండా నిర్మాతలను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టే దర్శకులను పరిశ్రమ నుంచి నిషేధించాలని కోన వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ఒక్కో సినిమాకు 8 కోట్లా.. రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.!
[Kona Venkat Comments On Directors, Comrade Kalyan Movie, Kona Venkat, Telugu Film Industry, Directors Planning, Movie Runtime, Producer Losses, Telugu Film News]






