టాలీవుడ్‌లో మరో అందమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అభిషేక్, కాజల్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గోల్డ్ స్పాట్’. ఈ సినిమా నుంచి తాజాగా ‘పరిచయమే..’ అంటూ సాగే తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. చిన్ననాటి స్నేహితుల మధ్య చిగురించే ప్రేమను ఆవిష్కరిస్తూ సాగిన ఈ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో, తాజాగా విడుదలైన పాటతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
‘ఓ మనసా.. అలుపే రాదు తలపున నీవుంటే.. ఓ మనసా.. అదుపే లేదు ఎదురుగ నీవుంటే..’ అంటూ సాగే ఈ పాటలో ప్రేమలో పడుతున్న మనసులోని భావాలను అందంగా చూపించారు. సినిమాలో రామ్, శాంత అనే చిన్ననాటి స్నేహితులు క్రమంగా ప్రేమికులుగా మారే సందర్భంలో ఈ పాట వస్తుంది. పరిచయం ప్రేమగా మారి, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లాలనే భావనను సాహిత్యంలో చక్కగా పలికించారు. సంగీతం, సాహిత్యం, విజువల్స్ కలిసిన ఈ పాట రొమాంటిక్ మెలోడీగా నిలుస్తోంది.
ఈ పాటకు నరేన్ రెడ్డి సంగీతం అందించడంతో పాటు తుషార నిలయతో కలిసి ఆలపించారు. భార్గవ కార్తీక్ సాహిత్యం అందించారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఆయన వద్ద పనిచేసిన వేణు కార్తికేయన్ ‘గోల్డ్ స్పాట్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయకృష్ణ లింగమనేని సమర్పిస్తుండగా, శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహీ రెడ్డి సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ‘పరిచయమే’ పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం, త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
[Gold Spot Movie, Parichayame First Single, Gold Spot Song, Abhishek Pachipala, Kajal Choudhary, Naren Reddy Music, Tushara Nilaya Singer, Venu Karthikeyan, Dushyanth Katikaneni, Telugu Romantic Songs, Gold Spot First Song Release]





