యంగ్ డైరెక్టర్ పెళ్ళికొడుకుగా మారిపోయాడు!
on Feb 3, 2023
దర్శకుడు వెంకీ అట్లూరి గురించి అందరికీ తెలుసు. ఆయన తీసిన తొలిప్రేమ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇంకా ఈయన పలు చిత్రాలలో నటునిగా కూడా కనిపించాడు. జ్ఞాపకం, స్నేహ గీతం వంటి చిత్రాలలో నటించిన అనుభవం ఈయనకు ఉంది. జ్ఞాపకం చిత్రంలో ఈయన లీడ్ రోల్ పోషించారు. ఇక ప్రస్తుతం ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా కోలీవుడ్ స్టార్ ధనుష్ తో సార్ అనే చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో వాతి పేరుతో విడుదలవుతోంది.
ఇలా నటునిగా, రచయితగా, దర్శకునిగా కూడా వెంకీ అట్లూరి మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. తాజాగా ఆయన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. పూజ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని హీరో నితిన్ బయటపెట్టారు. ప్రస్తుతం నితిన్ ఆంజనేయస్వామి దీక్షలో ఉన్నారు. వెంకీ అట్లూరి వివాహానికి నితిన్ మరో దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వెళ్ళారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్న వెంకీ అట్లూరికి కంగ్రాట్స్ తెలిపారు. పూజతో నీ జీవితం మరింత ఆనందంగా మారాలని కోరుకుంటున్నాను అంటూ నితిన్ కామెంట్ చేశారు. గతంలో నితిన్ -వెంకి అట్లూరి ఇద్దరు కలిసి రంగ్ దే చిత్రానికి పనిచేసిన విషయం తెలిసిందే.