శివరాత్రికి విశ్వక్ సేన్ 'ధమ్కీ'
on Nov 24, 2022
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ'. 'ఫలక్‌నుమాదాస్' తర్వాత విశ్వక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'ధమ్కీ'పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల బాలకృష్ణ చేతుల మీదుగా ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్-1 ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ ఆటిట్యూడ్, యాక్షన్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విడుదల సమయంలోనే ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మూవీ టీమ్.. తాజాగా తేదీని కూడా రివీల్ చేసింది.
శివ రాత్రి కానుకగా 2023 ఫిబ్రవరి 17న 'ధమ్కీ' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. అందులో స్టిక్ పట్టుకొని ఉన్న విశ్వక్ లుక్ ఆకట్టుకుంటోంది. గతంలో హీరోగా, దర్శకుడిగా చేసిన 'ఫలక్‌నుమాదాస్'తో మెప్పించిన విశ్వక్ మరోసారి 'ధమ్కీ'తో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.